Justice Chandru : ఎవరీ జస్టిస్ చంద్రు.. 'జైభీమ్'కు ఈయనకి సంబంధం ఏంటి?

Justice Chandru : కొన్ని సినిమాలు డబ్బులు కోసం కాకుండా సమాజం కోసం తీస్తారు.. అలాంటి సినిమాలలో ఒకటి తాజాగా వచ్చిన 'జైభీమ్'.. సక్సెస్ ఫెయిల్యూర్ లతో సంబంధం లేకుండా ప్రయోగాలకే పెద్ద పీట వేస్తూ సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు సూర్య... దాదాపుగా సూర్య కెరీర్లో అత్యధిక విజయాలు ప్రయోగాల ద్వారా వచ్చినవే. అందులో ఒకటి ఈ జైభీమ్.. కోర్టు డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 2 న అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైంది. ఆద్యంతం ఆకట్టుకునేలా ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు జ్ణానవేల్. సినిమాకి ఎక్కడ చూసిన పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకి స్ఫూర్తి ఎవరో కాదు తమిళనాడులోని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ కే చంద్రు.
జస్టిస్ కే చంద్రు...చెన్నై హైకోర్టులో చాలాకాలం జడ్జిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఒక న్యాయవాదిగా వృత్తి ప్రారంభించి మానవ హక్కుల కోసం డబ్బు తీసుకోకుండా వాదించి ఎంతో మంది పీడిత వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తిగా అయనకి మంచి పేరుంది. జడ్జ్ అయ్యాక 6 ఏళ్లలో ఏకంగా 96,000 కు పైగా కేసులకి ఓ పరిష్కారం చూపించి రికార్డ్ సృష్టించారు. ఆయన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు ఉద్యోగంతో పాటు వచ్చే హంగులకి, అర్బాటలకు చాలా వరకు దూరంగా ఉన్నారు. జడ్జి దగ్గర ఉండే బంట్రోతులు రెడ్ కాప్ ఉండటం, ఐరన్ బిళ్ళ ఉండటం అదంతా స్వేచ్చకి విరుద్ధం అని వాటిని కూడా తీసేయించారు.
తన కార్ మీద ఉండే ఎర్ర లైటును కూడా తీసేసారు, ఎస్సై రేంజ్ అధికారి తనకి గార్డ్ ఎందుకని ఒక్క కానిస్టేబుల్‌ను సెక్యురిటిగా తీసుకున్నారు. ఆయన పదవి విరమణ కూడా చాలా నిరాడంబరంగా జరిగింది. పదవి విరమణ రోజు మాములుగా ఎప్పటిలాగా కోర్టుకు వచ్చి తన ఆస్తిపాస్తుల వివరాలను స్వచ్చందంగా తెలియచేస్తూ ఒక డాక్యుమెంటును ప్రధాన న్యాయమూర్తికి అందచేసారు. ఆ రోజున తన అధికార వాహనాన్ని కూడా ఆయన వాడుకోలేదు. రిటైర్ అనంతరం సాయింత్రం ఇంటికి మెట్రోరైల్లో వెళ్లారట.
ఆయన ఛాంబర్ దగ్గర ఏర్పాటు చేసిన బోర్డ్ లో ఇలా రాసి ఉండేది…
"ఇక్కడ ఎవరూ దేవతలు లేరు,
మీరు పూలు బొకేలు తీసుకురావద్దు"
"ఇక్కడ ఎవరు ఆకలితో లేరు,
మీరు పండ్లు స్వీట్లు తీసుకురావద్దు"
"ఇక్కడ ఎవరు చలికి వణకడం లేదు,
మీరు శాలువాలు తీసుకురావద్దు."
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com