Jawan song Chaleya: 'చలేయ' పాటలో నయన్ తో షారుఖ్ రొమాన్స్.. టీజర్ రిలీజ్

Jawan song Chaleya: చలేయ పాటలో నయన్ తో షారుఖ్ రొమాన్స్.. టీజర్ రిలీజ్
X
'జవాన్' నుంచి సెకండ్ సింగిల్ టీజర్ రిలీజ్

సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన 'జవాన్' సినిమా ప్రమోషన్స్ జోరుగా ప్రారంభమయ్యాయి. సినిమా థియేటర్లలోకి రావడానికి ఒక నెల కంటే తక్కువ సమయం ఉండటంతో, మేకర్స్ తమ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను ఏదో ఒక విధంగా షేర్ చేస్తూనే ఉన్నారు. ఈ మధ్యే రిలీజైన ప్రీవ్యూకు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అనిరుధ్ రవిచందర్ సంగీతం సినీ ప్రియులను, సంగీత ప్రేమికులను ఎంతగానో అలరించింది. ముఖ్యంగా జిందా బందా పేరుతో వచ్చిన మొదటి ట్రాక్ అశేష స్పందనను తెచ్చుకుంది. సన్యా మల్హోత్రా, ప్రియమణితో కలిసి షారుఖ్ చేసిన ఎనర్జిటిక్ డ్యాన్స్ ఇప్పటికీ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. తాజాగా మరో కొత్త సోల్‌ఫుల్ ట్రాక్ చలేయాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో షారుఖ్.. నయనతారతో రొమాన్స్ చేస్తూ కనిపించాడు.

జవాన్ బృందం ఈ ఉదయం సోషల్ మీడియా వేదికగా ఈ సింగిల్ టీజర్ ను విడుదల చేసింది. ఫుల్ ట్రాక్ ను రేపు.. అంటే ఆగస్టు 14న రిలీజ్ చేయనున్నట్టు వెల్లడించింది. రెండవ పాటగా వస్తోన్న ఈ సాంగ్ టీజర్‌ చలేయ అనే టైటిల్‌తో ఉంది. "ప్రేమ మీ హృదయానికి ఒక మార్గాన్ని కనుగొంటుంది....చలేయా తేరీ ఔర్.... #చలేయా, #హయ్యోడా మరియు #చలోనా పాట రేపు విడుదల అవుతుంది!" అంటూ షారుఖ్ సోషల్ మీడియాలో రాసుకువస్తూ.. ఈ వీడియోను షేర్ చేశాడు.

షారుఖ్ ఖాన్, నయనతార జంటగా నటిస్తోన్న 'జవాన్' కు అట్లీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రధాన తారాగణంలో నయనతారతో పాటు విజయ్ సేతుపతి కూడా ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. దీపికా పదుకొనే అతిథి పాత్రలో నటించారు. కాగా భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో సెప్టెంబర్ 7న థియేటర్లలోకి రానుంది.

ఇటీవల రిలీజైన 'జిందా బందా' సాంగ్ మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ లో షారుఖ్ కు తెలుగు, తమిళ పదాల ఉచ్చరణను దర్శకుడు అట్లీ స్వయంగా నేర్పించడం విశేషంగా తెలుస్తోంది. ఈ వీడియోలో అనేక మంది డ్యాన్సర్ల మధ్య అట్లీ, షారుఖ్ తో కలిసి స్టెప్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో జవాన్ పై ఉన్న అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.


Tags

Next Story