Jk Bharavi: ఒకప్పుడు కార్లలో తిరిగి.. ఇప్పుడు బైక్ బుక్ చేసుకుని ఇంటర్వ్యూకి.. భారవి పరిస్థితి

Jk Bharavi: సినిమాలకి ఆయన మాటలే ఊపిరి.. భక్తిరస ప్రధాన చిత్రాలకు భగవంతుడే పరవశించిపోయేలా ఆయన పలుకులు.. సరస్వతీ దేవి తన నాలుక మీద నాట్యమాడుతున్నట్లు ఆయన చేతుల్లో అక్షరాలు అలవోకగా రూపుదిద్దుకునేవి.. JK భారవి.. చలనచిత్ర పరిశ్రమలో పేరుపొందిన మాటల రచయిత.
ఒక్క మాటలేకాదు, పలు చిత్రాలకు పాటలు కూడా అందించారు. ఆయనలో విభిన్న కోణాలు నేపథ్య గాయకుడు , స్వరకర్త, నటుడు, నిర్మాత మరియు దర్శకుడుగా చిత్ర పరిశ్రమకు చెందిన దాదాపు అన్ని రంగాల్లో ఆయనకు ప్రవేశం ఉంది. తెలుగు సినిమాల్లో ప్రధానంగా ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. 2004లో, అతను బొమ్మలత చిత్రానికి స్క్రిప్ట్ అందించాడు, ఆ సంవత్సరానికి తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది ఆ సినిమా. అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ, శ్రీ మంజునాథ వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయనది.
ఓడలు బండ్లవుతాయనే సామెత ఊరికే అనలేదు పెద్దవాళ్లు.. ఒకప్పుడు ఎంతో వెలుగు వెలిగిన వారే చివరకు వంద రూపాయలకు కూడా ఒకరి దగ్గర చేయి చాచవలసిన పరిస్థితులు తలెత్తుతాయి.. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో ఇలాంటివి సర్వసాధారణం.. అప్పటి వరకు సంపాదించిన డబ్బు, పలుకుబడి అంతా ఒక్క సినిమాతో హారతి కర్పూరంలా కరిగిపోయింది..
నాగార్జున ప్రధాన పాత్రధారిగా జగద్గురు ఆదిశంకరాచార్య తీశారు జెకె భారవి.. తన దగ్గర ఉన్నడబ్బులన్నీ ఆ సినిమా కోసం ఖర్చు పెట్టారు. భారవి టైమ్ బాలేదు. ఆ సినిమా జనాలకి రీచ్ అవలేదు.. దానికి తోడు కరోనా పరిస్థితులు.. ఒప్పుకున్న కథలు ఒకే అయినా డబ్బులు రావడం ఆలస్యమవుతోందని ఆయన వాపోతున్నారు. ఆర్ధిక పరిస్థితులతో సతమతం అవుతున్న ఆయన తన పరిస్థితి గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కెరీర్‌లో ఎన్నో కార్లు చూసిన తాను ఇప్పుడు ఇంటర్వ్యూ రావడానికి బైక్ బుక్ చేసుకుని రావలసి వచ్చిందని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సంపాదించినదంతా ఒక్క సినిమాతో పోయిందని వివరించారు. ప్రస్తుత తన పరిస్థితి బాగాలేదని నాగార్జునకు తెలిస్తే ఆదుకుంటారని.. కానీ తనకు అడగడం ఇష్టం లేదని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com