Johnny Master : నన్ను బ్యాన్ చేసిన వారిని వదలను - జానీ మాస్టర్

Johnny Master  :  నన్ను బ్యాన్ చేసిన వారిని వదలను - జానీ మాస్టర్
X

కొన్ని రోజుల క్రితం ఓ అసిస్టెంట్ ఫీమేల్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశాడనీ, మతం మార్చుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నాడని కేస్ పెట్టింది. ఆ కేస్ లో అరెస్ట్ అయిన జానీ జైలుకు వెళ్లాడు. ప్రస్తుతం బెయిల్ పై ఉన్నాడు. ఆ కేస్ విచారణలో ఉంది. ఇందులో భాగంగా అతను దోషా, నిర్దోషా అనేది కోర్ట్ తేలుస్తుంది. ఈ క్రమంలో తాజాగా జానీ మాస్టర్ ను యూనియన్ నుంచి శాశ్వతంగా తొలగించారు అనే వార్త సోషల్ మీడియాలో బాగా సర్కిలేట్ అవుతోంది. దీనిపై జానీ మాస్టర్ స్పందించి ఒక వీడియో విడుదల చేశాడు. దాని ప్రకారం చూస్తే.. ‘తనను డ్యాన్సర్స్ అసోసియేషన్ యూనియన్ నుంచి తీసేశారనే వార్త నిజం కాదు. నన్నెవరూ తీయలేదు.. తీయలేరు. నా కార్డ్ నా దగ్గరే ఉంది. కొన్ని ఛానల్స్ మనసులు బాధపెట్టేలాగా ఉన్నదీ లేనిదీ ప్రసారం చేస్తున్నారు. ఇదంతా తప్పుడు ప్రచారం. నన్నే కాదు ఎవర్నీ కూడా శాశ్వతంగా తీయలేరు. పనిని, టాలెంట్ ను ఆపే హక్కు ఎవరికీ లేదు. ఎవరైనా ఎక్కడైనా పనిచేసుకోవచ్చు. త్వరలోనే ఓ మంచి పాటతో వస్తున్నాను. ప్రస్తుతం రిహార్సల్స్ నడుస్తున్నాయి. మా గురువుగారు ముక్కురాజు మాస్టర్ నిర్మించిన యూనియన్ ద్వారానే ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అనే ట్యాగ్ వచ్చింది. అందుకు యూనియనే కారణం. అలాంటి యూనియన్ ను గౌరవిస్తాను. ప్రస్తుతం నేను అధ్యక్షుడుగా ఉన్న యూనియన్ లో జరిగిన ఎన్నికల సమంజసం కాదు. దానిపై నేను ఫైట్ చేస్తాను. చాలా యూనియన్స్ తో నేను వర్క్ చేశాను. చాలామందికి కొరియోగ్రాఫర్ గా అవకాశం ఇచ్చాను. మోయిన్, శిరీష్, ఆనీ, భాను మాస్టర్స్ వీళ్లంతా నా దగ్గర నుంచే వచ్చారు. నాకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అంటూ ఆ వీడియోలో చెప్పుకువచ్చాడు జానీ మాస్టర్.

మరోవైపు ఈ అంశంపై డ్యాన్సర్స్ అసోసియేషన్ నుంచి ఎలాంటి ప్రకటనా కనిపించడం లేదు. మరి అఫీషియల్ గా కోర్ట్ లో దోషిగా నిర్ధారణ అయితే తప్ప అతను తప్పు చేసినట్టు కాదు. అలా కాకుండా వీళ్లే నిర్ణయం తీసుకోవడం అనేది చట్ట ప్రకారం చెల్లదు. అందుకే జానీ మాస్టర్ తను కోర్ట్ కు వెళ్లి తేల్చుకుంటా అంటున్నాడు. మరి ఈ పంచాయితీ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.

Tags

Next Story