Jr. NTR : తెలుగు తెరకు మరో తారక రాముడు.. విషెస్ చెప్పిన ఎన్టీఆర్

Jr. NTR :   తెలుగు తెరకు మరో తారక రాముడు.. విషెస్ చెప్పిన ఎన్టీఆర్
X

నందమూరి తారక రామారావు.. తెలుగు సినిమాకే కాదు.. తెలుగు దనానికి ఒక ఐకన్ ఈ పేరు. ఆ పేరు అంటేనే ఒక చరిత్ర. ఆ పేరు వింటేనే తెలుగు వారికి ఓ గర్వం. అందుకే అలాంటి పేరు మరొకరికి పెట్టాలంటే అది ఆయనకే సాధ్యం. అందుకే తన కొడుకు హరికృష్ణ తనయుడు అయిన తారక్ కు తన పేరు పెట్టి ఆశీర్వదించాడు. అలా జూనియర్ ఎన్టీఆర్ గా నందమూరి తారక రామారావు పేరుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడు అన్న పేరు తెచ్చుకున్నాడు. నటన, డ్యాన్సులు, డిక్షన్, యాక్షన్.. ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చే ఏకైక స్టార్ కూడా అతనే అంటారు ఇండస్ట్రీలో చాలామంది. ఇండస్ట్రీ టాప్ హీరోస్ లో ఒకడుగా వెలుగుతున్నాడిప్పుడు. అలాంటి ఎన్టీఆర్ టాప్ లో ఉండగానే మరో ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

నందమూరి హరికృష్ణ పెద్ద కొడుకు దివంగత జానకి రామ్ తనయుడి పేరు కూడా తారక రామారావు అనే పెట్టారు. అతన్ని హీరోగా పరిచయం చేస్తూ వైవిఎస్ చౌదరి ఓసినిమా చేస్తున్నాడు. తాజాగా ఆ కొత్త తారక రామారావును ఫస్ట్ దర్శన అంటూ కుర్రాడికి సంబంధించిన ఒక వీడియో విడుదల చేశాడు వైవిఎస్.

శాసన సభకు ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేసినట్టుగా ఓ స్క్రిప్ట్ రాసి అతని చేత చదివిస్తూ.. లుక్ ను పరిచయం చేయించాడు వైవిఎస్ చౌదరి. అదెలా ఉందంటే..

‘‘నందమూరి తారక రామారావు అనే నేను.. ఊహ తెలిసినప్పటి నుంచి నటన పట్ల ఇష్టం పెంచుకుని.. శ్రీ వైవిఎస్ చౌదరి గారి వద్ద గత 18 నెలలుగా అన్ని ముఖ్య విభాగాల్లో శిక్షణ పొంది.. ఆయన దర్శకత్వంలోనే మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ ద్వారా భారతీయ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న నేను.. ఎందరో మహోన్నత నటీ నటులు, సాంకేతిక నిపుణులతో జగజ్జేగీయమానమవుతున్న.. మన చలన చిత్ర పరిశ్రమ పట్ల.. నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, దానియొక్క సమగ్రతను కాపాడతానని.. కథా రచయిత, దర్శక, నిర్మాతల సంతృప్తిమేరకు కథలు, సన్నివేశాలు, పాత్రలకు అనుగుణంగా నటించి ప్రేక్షకులను రంజింప చేయడంలో నా వంతు నిరంతర కృషి చేస్తానని .. నా ముత్తాత, నా దైవం, విశ్వ విఖ్యాత, నట సార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావుగారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను..’’.. అనే కంటెంట్ ను చదువుతున్నప్పుడు డిక్షన్ పట్ల జాగ్రత్తలు తీసుకున్నారు. కుర్రాడి గొంతూ బావుంది. హైటూ అదీ ఆకట్టుకుంటోంది. కుర్రాడు హీరోగా నిలబడేలానే ఉన్నాడు.

ఇక ఇతని ఎంట్రీపై ఎన్టీఆర్ విషెస్ చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు.

ముత్తాత, తాత, తండ్రిల ఆశిష్సులతో నువ్వు గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అంటూ ఎన్టీఆర్ విషెస్ చెప్పడం కూడా చాలామందిని ఆకట్టుకుంటోంది. మరి తాత పేరును మనవడు నిలబెట్టాడనే చెప్పాలి. ఈ కొత్త ముని మనవడు కూడా ముత్తాత పేరు నిలబెడతాడా లేదా అనేది చూడాలి.




Tags

Next Story