Kiran Abbavaram : క మూవీ రివ్యూ

రివ్యూ : క
తారాగణం : కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వి రామ్, అచ్యుత్, రెడిన్ కింగ్ స్లే, శరణ్య ప్రదీప్
ఎడిటర్ : శ్రీ వరప్రసాద్
సినిమాటోగ్రఫీ : విశ్వాస్ డేనియల్, సతీష్ రెడ్డి మాసం
సంగీతం : శామ్ సి.ఎస్
నిర్మాత : చింతా గోపాలకృష్ణ
రచన, దర్శకత్వం : సుజిత్ - సందీప్
ఏ సినిమాపై అయినా ఒక అంచనాకు వచ్చేది ట్రైలర్ చూసిన తర్వాతే. కొన్ని మాత్రమే ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి ప్రామిసింగ్ గా అనిపించుకుంటాయి. అలా అనిపించుకున్న వన్నీ హిట్ అవుతాయి అనే గ్యారెంటీ కూడా ఏం లేదు. ఇక మేకర్స్ నమ్మకం చూసినప్పుడు కూడా ప్రేక్షకులకు పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఫీలింగ్ నే కలిగించిన సినిమా ‘క’. కిరణ్ అబ్బవరం హీరోగా నటించాడు. అన్నిటికంటే ఈ సినిమాకు మీకు నచ్చకపోతే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా అన్న అతని కాన్ఫిడెన్స్ కు చాలామంది ముచ్చటపడ్డారు. మరి అతని కాన్ఫిడెన్స్ క విషయంలో వర్కవుట్ అయిందా లేదా అనేది చూద్దాం.
కథ :
అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) ఒక అనాథ. ఒక ఆశ్రమంలో పెరుగుతుంటాడు. అక్కడ అనుకోకుండా ఆశ్రమం సార్ కు వచ్చిన ఉత్తరం చదువుతాడు. అది చదివినప్పుడు ఆ బంధాలన్నీ తనవే అనిపిస్తుంది. అప్పటి నుంచి ఎదుటి వాళ్ల ఉత్తరాలు చదువుతూ లేని బంధాలను ఊహించుకుంటూ ఉంటాడు. ఇలా చదివినందుకే ఆశ్రమం నుంచి వెళ్లగొడతాడు సార్. అలా చివరికి ఒక స్నేహితుడి సాయంతో కృష్ణగిరి అనే ఊరికి చేరుకుంటాడు. ఆ ఊరిలో అసిస్టెంట్ పోస్ట్ మేన్ ఉద్యోగం సంపాదిస్తాడు. పోస్ట్ మాస్టర్ కూతురు సత్యభామ(నయన్ సారిక)తో ప్రేమలో పడతాడు. ఆ ఊరిలోనే లాలా, అబిద్ షేక్ ల గురించి ప్రత్యేకంగా తెలుసుకుంటాడు. లాలా వల్ల రాధ (తన్వి రామ్) అనే అమ్మాయి జీవితం పాడవుతుంది. అదే సమయంలో ఆ ఊరిలో వయసుకు వచ్చిన అమ్మాయిలు మిస్ అవుతుంటారు. ఎవరు చేస్తున్నారో పోలీస్ లకు అంతు పట్టదు. అందరి ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుదేవ్ కు అమ్మాయిల మిస్సింగ్ కు సంబంధించిన ఓ క్లూ ఓ ఉత్తరం ద్వారా తెలుస్తుంది. దాన్ని ఛేదించాలని ప్రయత్నించిన వాసుదేవ్ లైఫ్ లో ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. మరి ఆ సమస్యల వల్ల అతను ఎదుర్కొన్న ఇబ్బందులేంటీ..? అమ్మాయిలు మిస్ అవడానికి కారణం ఏంటీ..? చివరికి వాసుదేవ్, సత్యభామ ఒక్కటయ్యారా..? రాధ జీవితం ఏమైంది.. అనేది మిగతా కథ.
విశ్లేషణ :
క .. ఇది పూర్తిగా దర్శకుల చిత్రం. ఓ సాధారణ కథను నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో చెప్పిన వారి ప్రతిభ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కథగా చూస్తే సింపుల్ కమర్షియల్ పాయింట్. అనాథైన హీరో. ఏదో ఒక ఊరికి వచ్చి అందరినీ తనవాళ్లు అనుకోవడం.. వారికి ఏదో సమస్య రావడం.. అందుకోసం తను ఆ ఊరికి అండగా నిలవడం.. ఇదే క సినిమా కథ. ఈ కథను దర్శకులు చెప్పిన విధానానికే ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతారు.
సినిమా ఆరంభంలోనే తీవ్రమైన గాయాలతో ఉన్న వాసుదేవ్ ను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేసి ఒక ముసుగు వ్యక్తికి అప్పగిస్తారు. వాసుదేవ్ ను ఒక రూమ్ లో బంధిస్తారు. అతనితో పాటు మరో రూమ్ లో రాధను కూడా అలాగే బంధిస్తారు. వాసుదేవ్ ను ఫలానా టైమ్ లో వచ్చిన ఒక ఉత్తరం ఎందుకు చదివావు అంటూ ఇంటరాగేషన్ మొదలుపెడతారు. కానీ అప్పటికే వాసుదేవ్ అన్నీ మర్చిపోతాడు. అతని కోసం టైమ్ మెషీన్ లాంటి యంత్రాన్ని తెచ్చి దాని ద్వారా అతని కథ చెప్పిస్తుంటారు. అలా వాసుదేవ్ ఎవరు.. కృష్ణ గిరి ఎందుకు వచ్చాడు. ఇవన్నీ అతని చేతే చెప్పిస్తూ.. అతను చేసిన తప్పులు, ఒప్పుల గురించి విశ్లేషణ చేస్తుంటారు. ఈ క్రమంలో వచ్చే వాసుదేవ్, సత్య భామల ప్రేమకథ ఆహ్లాదంగా ఉంటుంది. కథా కాలం 1970 - 80ల వరకూ ఉంటుంది. ఆ సమయాన్ని సినిమాటోగ్రఫీలో అద్భుతంగా క్యాప్చర్ చేశారు. మనకూ ఆ కాలానికి, ఆ ఊరికి వెళ్లాలనిపిస్తుంది.
హీరోయిన్ ను కాపాడే క్రమంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, కోర్ట్ లో ఫైట్, చివరి అరగంట ముఖ్యంగా చివరి 10 నిమిషాలు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంటుంది. మనిషి పుట్టుక, మరణం వంటి అంశాలను భగవద్గీతలో చెప్పిన పాయింట్స్ ఆధారంగా పునర్జన్మ, కర్మ ఫలం అనే కోణాలను గొప్పగా ఆవిష్కరించారు దర్శకులు. ఎక్కడా పాయింట్ నుంచి డీవియేట్ కాకుండా.. అనవసరమైన సోది లేకుండా ఆకట్టుకుంటుంది. ఇలాంటి థ్రిల్లర్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ దూరం అనుకుంటారు.కానీ ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే సినిమా. నచ్చేలా తీసిన సినిమా.
మైనస్ ల గురించి చెప్పాలంటే కూడా ఉన్నాయి. అసిస్టెంట్ పోస్ట్ మేన్ ఉద్యోగం ఇచ్చే హక్కు పోస్ట్ మాస్టర్ కు ఉండదు. ఒక ఊరికి ఒకే పోస్ట్ మేన్ కదా ఉంటాడు. ఫస్ట్ హాఫ్ లో కాస్త స్లోగా రన్ అవుతున్నట్టు అనిపిస్తుంది. లవ్ ట్రాక్ రిపీటెడ్ గా ఉంది. రాధ పాత్రను సరిగా రాసుకోలేదు. చాలా పాత్రలు ఊహించినట్టుగానే ఉన్నాయి.
నటన పరంగా కిరణ్ అబ్బవరంలో ఓ కసి కనిపించింది. వాసుదేవ్ గా ఈ పాత్రను అతను ఓన్ చేసుకున్నాడు. కిరణ్ లా కాక వాసుదేవ్ లానే కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్ లలో అదరగొట్టాడు. నయన్ సారిక చబ్బీగా బలే అందంగా ఉంది. తన్వీరామ్ సహజంగా కనిపించింది. ఇతర పాత్రలన్నీ చాలా సహజంగా కనిపిస్తాయి.
టెక్నికల్ గా ఈ చిత్రానికి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బిగ్గెస్ట్ ఎసెట్. ఆర్ఆర్ తో అదరగొట్టాడు శ్యామ్ సిఎస్. ఎడిటింగ్ బావుంది. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సెట్స్, ఆర్ట్ వర్క్ అన్నీ అద్భుతంగా కుదిరిగాయి. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా రాజీ పడలేదు. ఇక దర్శకులుగా సుజిత్, ప్రదీప్ గురించే చెప్పాలి. ఇది వారి సినిమా. కంప్లీట్ గా వారి మైండ్ లో రూపుదిద్దుకున్న సినిమా. చాలాకాలం తర్వాత ఇది డైరెక్టర్స్ మూవీ అని ఖచ్చితంగా చెప్పే సినిమాగా క నిలుస్తుంది.
కిరణ్ అబ్బవరం కాన్ఫిడెన్స్ ను డబుల్ చేసి దీపావళికి పెద్ద విజయాన్ని ఇచ్చింది క.
ఫైనల్ గా : ‘క’థనంతో కట్టి పడేసే సినిమా
రేటింగ్ : 3/5
- బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com