Kaikala Satyanarayana: కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమం.. మల్టీ ఆర్గాన్స్..

Kaikala Satyanarayana: టాలీవుడ్ మెచ్చిన, ప్రేక్షకులు నచ్చిన సీనియర్ నటుడు కైకాల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆయన అస్వస్థతకు గురవ్వడంతో అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వెంటిలేటర్ పై ఆయనకు చికిత్స అందుతోంది. ఆయన క్షేమంగా తిరిగి రావాలని ఇప్పటికే అభిమానులంతా కోరుకుంటున్నారు. కానీ అపోలో వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ మాత్రం వారిలో కలవరం పెంచేదిలా ఉంది.
ప్రస్తుతం సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఎందుకంటే ఆయన మల్టీ ఆర్గాన్స్ ఫెయిలయ్యాయి. పైగా వైద్యుల చికిత్సకు కూడా ఆశించినంతగా ఆయన శరీరం స్పందించడం లేదు. వైద్యులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ఈ విషయాలను స్పష్టం చేసింది. దీంతో టాలీవుడ్ ప్రముఖులు కూడా ఆందోళనకు గురయ్యారు.
కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న చాలామంది ప్రముఖులు.. ఆయన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. సత్యనారాయణ తాజా ఆరోగ్య పరిస్థితిని వాకబు చేస్తున్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కు ధైర్యం చెబుతున్నారు. గత నెల 30న ఆయన అనారోగ్యంతో ఇబ్బంది పడ్డారు. ఇంట్లో జారిపడడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్సను అందించడంతో కొంతమేర కోలుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఇలా ఉండడంతో ఆయన అభిమానులు బాధపడుతున్నారు.
తెలుగు చిత్రసీమలో నవరసాలను పండించగల అతికొద్దిమంది నటుల్లో కైకాల సత్యనారాయణ ఒకరు. యముడి వేషంతో టాలీవుడ్ ప్రేక్షకులను మైమరిపించగలరు. ఎన్టీఆర్ హీరోయిజానికి పోటాపోటీగా విలనిజం పండించడంలో దిట్ట. 2019లో విడుదలైన ఎన్టీఆర్ కథానాయకుడు.. మహర్షి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆ తరువాత ఆయన మరే సినిమాలను ఒప్పుకోలేదు. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com