Kajal Aggarwal : నేను క్షేమంగా ఉన్నాను.. ఆ వార్తలపై స్పందించిన కాజల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కు ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని, ఆమె ప్రాణాలు కోల్పోయిందంటూ సోషల్ మీడియాలో ఇటీవల వైరల్ అయిన వార్తలపై కాజల్ అగర్వాల్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని, ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పారు.
"నేను ప్రమాదానికి గురైనట్లు వస్తున్న వార్తలు నా దృష్టికి వచ్చాయి, అలాగే నేను లేనని కూడా ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదు. నిజం చెప్పాలంటే అవి చూసి నేను చాలా నవ్వుకున్నాను. ఎందుకంటే.. ఇంతకుమించిన ఫన్నీ న్యూస్ ఉండదు. అవన్నీ పూర్తిగా అవాస్తవం. దేవుడి దయ వల్ల నేను క్షేమంగా, సురక్షితంగా ఉన్నాను. అంతేకాకుండా మరింత బాగానే ఉన్నానని మీ అందరికీ తెలుపుతున్నాను. ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని లేదా ప్రచారం చేయవద్దని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ప్రేమ, కృతజ్ఞతలతో మీ కాజల్” అని ట్విట్టర్ లో ఆమె పేర్కొన్నారు. ఇక కాజల్ పోస్ట్ తో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com