'Kaali' poster controversy: 'కాళీ' పోస్టర్ వివాదం.. ఎవరీ లీనా మణిమేకలై..

Kaali poster controversy: కాళీ పోస్టర్ వివాదం.. ఎవరీ లీనా మణిమేకలై..
'Kaali' poster controversy: గత కొన్ని రోజులుగా, ఒక సినిమా పోస్టర్ దేశంలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. సినిమా పోస్టర్‌లో కాళీ దేవి వేషధారణలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతూ కనిపించింది.

'Kaali' poster controversy: గత కొన్ని రోజులుగా, ఒక సినిమా పోస్టర్ దేశంలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. సినిమా పోస్టర్‌లో కాళీ దేవి వేషధారణలో ఉన్న మహిళ సిగరెట్ తాగుతూ కనిపించింది. ఈ కారణంగా, ఈ సినిమా దర్శకురాలు లీనా మణిమేకలై రాజకీయ పార్టీలు మరియు హిందూ సమాజం నుండి పెద్దఎత్తున విమర్శలను ఎదుర్కొంటోంది.

వృత్తి రీత్యా చిత్రనిర్మాత మరియు దర్శకురాలు అయిన లీనా మణిమేకలై తన రాబోయే చిత్రం 'కాళి' పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో అది వివాదానికి దారితీసింది. ట్విటర్‌లో సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ, టొరంటోలోని అగాఖాన్ మ్యూజియంలో "రిథమ్స్ ఆఫ్ కెనడా" విభాగంలో భాగంగా తన చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది.

వివాదాస్పద పోస్టర్‌ను ట్విట్టర్‌లో పంచుకుంటూ "నా ఇటీవలి చిత్రం ప్రారంభోత్సవాన్ని పంచుకోవడం చాలా థ్రిల్‌గా ఉంది'' అని రాసుకొచ్చారు. కాళీ దేవిని ధూమపానం చేసే మహిళగా చిత్రీకరించినందుకు రాజకీయ నాయకులతో పాటు సామాన్యులు కూడా ఆమె పై విరుచుకుపడుతున్నారు. అయితే మణిమేకళై తన పోస్టర్‌ని, సినిమాని సమర్థించుకుంటుంది. చంపేస్తామని బెదిరింపులు వస్తున్నా భయపడేదే లేదన్నట్లు ఉన్న ఆమె ధైర్యానికి సినీ వర్గాలు హాట్సాఫ్ చెబుతున్నాయి.. ఇంతకీ ఎవరీ లీనా మణిమేకలై అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ఆమె గురించి వివరంగా..

లీనా మణిమేకలై తమిళనాడులోని మధురైలో జన్మించారు. కెనడాలోని టొరంటోలో కెరీర్‌ను ప్రారంభించిన లీన చిత్రనిర్మాత, రచయితగా పలు చిత్రాలకు పని చేస్తున్నారు. 2021లో తన మొదటి చిత్రం 'మాదతి - యాన్ అన్‌ఫెయిరీ టేల్' విడుదలతో చిత్రనిర్మాతగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఆమె ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్ట్ 'కాళి'ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇది ఇప్పుడు భారీ వివాదానికి దారితీసింది.

తన సినిమాను సమర్థిస్తూ, "నేను కోల్పోయేది ఏమీ లేదు, నేను జీవించే వరకు, నేను నమ్మినదాన్ని నిర్భయంగా మాట్లాడే గొంతుతో జీవించాలనుకుంటున్నాను. దానికి నా ప్రాణాలను కూడా ఫణంగా పెడతాను" అని పేర్కొంది. కాళీ పోస్టర్ గురించి పంచుకుంటూ, మణిమేకలై ఇలా వ్రాశారు, "ఈ చిత్రం ఒక మంచి సాయంత్రం టొరంటో నగరంలోని వీధుల్లో కాళీ విహరించేటప్పుడు జరిగిన సంఘటనల గురించి చెబుతుంది. సినిమా చూస్తే 'లీనా మణిమేకలైని అరెస్ట్ చేయి' అని కాకుండా 'లవ్ యూ లీనా మణిమేకలై' అనే హ్యాష్‌ట్యాగ్‌ పెడతారు.

మరోవైపు మతపరమైన మనోభావాలను దెబ్బతీసినందుకు కాళీ డైరెక్టర్‌పై పలు ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. మణిమేకలైని అరెస్టు చేయాలని పలువురు పిలుపునిచ్చారు. అనేక హిందూ సంస్థలు మద్దతు ఇచ్చాయి.

Tags

Read MoreRead Less
Next Story