ఫిల్మ్ మాఫియా రాకెట్ పై కంగనా కీలక వ్యాఖ్యలు.. ముంబై సైబర్ పోలీసులకు ఫిర్యాదు

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇద్దరు ప్రముఖ బాలీవుడ్ సూపర్ స్టార్ లపై విమర్శల వర్షం కురిపించింది. అదే సమయంలో తన పేరును దుర్వినియోగం చేస్తున్న ఇన్ స్టాగ్రామ్ స్కామ్ గురించి కూడా ఆమె ఫాలోవర్లను హెచ్చరించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని షేర్ చేసిన స్క్రీన్ షాట్ ను పోస్టు చేసిన కంగనా.. తన ఫాలోవర్స్ ఎవరూ ఈ మోసపూరిత చర్యకు గురికావద్దని తెలిపింది. దాంతో కొన్ని కీలక విషయాలను కూడా ఆమె బయటపెట్టింది.
తన పేరునుపయోగించి ఖాతాలను హ్యాక్ చేసే రాకెట్ ను ఫిల్మ్ మాఫియాగా పేర్కొన్న కంగనా.. తన మేనేజర్ అని చెప్పుకునే వ్యక్తితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేసింది. అసలు అలాంటి ఆన్‌లైన్ నిర్వాహకులు తనకెవరూ లేరని చెప్పుకొచ్చింది. దీని వెనుక సినిమా మాఫియా ఉందని కంగనా ఆరోపించింది. తన సోషల్ మీడియా ఖాతాలను హ్యాక్ చేయడం, నకిలీ బల్క్ టిక్కెట్లు కొనుగోలు చేయడం, బాక్సాఫీస్ కలెక్షన్లను తారుమారు చేయడం వంటి నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ... ఇద్దరు బాలీవుడ్ తారలపై ఆరోపణలు చేసింది. అంతే కాకుండా ఈ చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ఆమె ముంబై సైబర్ పోలీసులను కోరారు.
ఈ క్రమంలోనే కంగనా.. ఇటీవల కరణ్ జోహార్, రణ్ వీర్ సింగ్ లపై విరుచుకుపడింది. కరణ్ జోహార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీ’ మువీని విమర్శిస్తూ ఆమె తన ఇన్‌స్టా ఖాతాలో వరుస పోస్టులు పెట్టారు. ప్రేక్షకులను ఇక మోసం చెయ్యలేరు. ఇలాంటి ఫేక్ సెట్స్, ఫేక్ కాస్ట్యూమ్స్‌తో తీసిన సినిమాలను వాళ్లు అంగీకరించరు. నిజ జీవితంలో ఇలాంటి దుస్తులు ఎవరైనా ధరిస్తారా? 90ల్లో తెరకెక్కించిన చిత్రాలనే కాపీ కొట్టినందుకు కరణ్ సిగ్గుపడాలి. పైగా 3 గంటల డైలీ సీరియల్‌కు రూ.250 కోట్లు ఖర్చుపెట్టాడు. టాలెంట్ ఉన్నవాళ్లకు బడ్జెట్ దొరక్క ఇబ్బందిపడుతుంటే ఆయనకు ఇంత డబ్బు ఎవరు ఇచ్చారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇండస్ట్రీలో ప్రస్తుతం డబ్బును వృధా చేయడం అంతమంచిపని కాదన్న కంగనా.. ఇప్పట్నుంచైనా డైరెక్షన్ చేయడం ఆపేయ్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. నువ్వు రిటైర్ అయిపో.. టాలెంట్ ఉన్న కొత్త నిర్మాతలకు అవకాశం ఇవ్వు అంటూ ఆమె కోరారు. అలాగే రణ్‌వీర్‌కు డ్రెస్సింగ్ సెన్స్‌పై కంగనా కొన్ని సూచనలు చేశారు. ‘రణ్‌వీర్ నీకు నేనిచ్చే సలహా ఒక్కటే డ్రెస్సింగ్ విషయంలో దయచేసి కరణ్‌ను ఫాలో అవ్వద్దొ. సాధారణ వ్యక్తుల మాదిరిగా డ్రెస్సింగ్ చేసుకోవడానికి ప్రయత్నించు. దక్షిణాది హీరోలు ఎంత హుందాగా దుస్తులు ధరిస్తారో చూసి నేర్చుకో. వారెప్పటికీ మన దేశ సంస్కృతిని నాశనం చెయ్యరంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు. ఇక కంగనా సినిమా విషయాలకొస్తే కంగనా 'ఎమర్జెన్సీ', 'చంద్రముఖి-2', 'తేజస్' మువీలో కనిపించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com