Kantara1 Trailer : కాంతార చాప్టర్ 1 ట్రైలర్.. ఈశ్వరుడు కొలువైన నేల

Kantara1 Trailer :  కాంతార చాప్టర్ 1 ట్రైలర్.. ఈశ్వరుడు కొలువైన నేల
X

కాంతారతో దేశవ్యాప్తంగా బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి. హొంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం అప్పుడు అనూహ్య విజయం సాధించింది. అందుకే ఈ చిత్రానికి ప్రీక్వెల్ మొదలుపెట్టాడు రిషబ్. ఈ సినిమా ఆరంభం నుంచి అనేక సమస్యలు వచ్చాయి. చిత్రీకరణ టైమ్ లో కొందరు చనిపోయారు. సెట్స్ కాలిపోయాయి. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇవన్నీ దాటుకుని విజయవంతంగా షూటింగ్ ముగించుకుని అక్టోబర్ 2న ఈ మూవీ విడుదల కాబోతోంది. తాజాగా కాంతార చాప్టర్ 1 ట్రైలర్ విడుదల చేశారు. కాంతార 1 ట్రైలర్ పైనా భారీ అంచనాలున్నాయి.

కాంతారకు సంబంధించిన ప్రేక్షకుల్లో ఒక అంచనా ఉంది. వాటికి భిన్నంగా కనిపిస్తుంది ఈ ట్రైలర్. కాంతారలో మట్టి వాసన ఎక్కువగా కనిపిస్తుంది. ఇందులో అది మిస్ అయిందా అనే భావన ట్రైలర్ చూస్తే కలుగుతుంది. అయితే వీళ్లు కాంతార అనే ప్రాంతం గురించి చెప్పబోతున్నారు అనేది మాత్రం అర్థం అయింది. ‘ఎప్పుడు మనిషి అధర్మం వైపు వెళతాడో.. ధర్మాన్ని కాపాడటానికి ఆ ఈశ్వరుడు తన గణాలను పంపుతుంటాడు. ఈ అన్ని గణాలూ వచ్చి కొలువైంది.. ఈ పుణ్య భూమిలో..’అనే డైలాగ్ చూస్తే ఆ గణాలు వచ్చి చేరిన ప్రాంతమే కాంతార. ఆ ప్రాంతంలో బ్రహ్మరాక్షసుడున్నాడు అనే మాట ఉంది. అలాంటి రాజ్యంపై ఓ బాంగ్రా అనే రాజ్యపు రాజు దండయాత్ర చేస్తాడు. వారిని బానిసలుగా చేసుకుంటాడు. వారు పండించేదంతా తనకూ ఇవ్వాలనే రూల్ పెడతాడు. ఆ రూల్ ను బ్రేక్ చేసి బాంగ్రాలోనే వ్యాపారం మొదలుపెట్టేలా చేస్తాడు.. ‘‘బెర్మి’’. బెర్మి.. ఇదే ఇందులో హీరో పేరు. అతని నాయకత్వంలో ఆ ప్రాంతం ఎలా ఎదిగింది అనే కోణంతో పాటు.. కాంతారకు ఉన్న దైవత్వం మొదటగా ఎవరికి తెలిసింది.. ఎలా తెలిసింది అనే కోణంలో సినిమా సాగుతుంది అనేలా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. అలాగే బాంగ్రా దేశపు యువరాణిని ఈ కాంతార ప్రాంతపు బెర్మి ప్రేమించడం.. తద్వారా ఆ ప్రజలను ఆ రాజు చంపేయడం.. వంటి సన్నివేశాలూ కనిపిస్తున్నాయి.

కాంతార సింపుల్ గా ఉంటూ.. ఎఫెక్టివ్ గా కనిపిస్తుంది. ఈ చాప్టర్ 1లో ఆ సింప్లిసిటీ మిస్ అయింది. అలాగే ఎఫెక్ట్ కూడా తగ్గింది. అయితే రిషబ్ శెట్టిని తక్కువ అంచనా వేయడానికి లేదు. తన ప్రాంతం గురించి ప్రపంచానికి చెప్పబోతున్నాడు. అంటే చాలా జాగ్రత్తలే తీసుకుని ఉంటాడు. అయినా ఇది కూడా కాంతారలాగానే ఉంటే ఇంక ప్రీక్వెల్ ఎందుకు అనిపిస్తుంది కదా. ఏదేమైనా కాస్త సహజత్వం లోపించినట్టు కనిపించినా.. మరోసారి కాంతారతో ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లబోతున్నా అనిపిస్తుంది.

ఇక హీరోయిన్ గా రుక్మిణి వసంత్ చాలా అందంగా కనిపిస్తోందీ మూవీలో. తన పాత్ర పేరు కనకావతి అని గతంలో పరిచయం చేశారు. బాంగ్రాదేశం రాజుగా హిందీ నటుడు గుల్షన్ దేవయ్య నటించాడు. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు.

Tags

Next Story