Karthi - Pawan Kalyan : పవన్ కళ్యాణ్ కి సారీ చెప్పిన కార్తీ

చిన్న చిన్న విషయాలు ఒక్కోసారి కొందరికి పెద్దగా కనిపిస్తాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి ఆటంకం కలిగితే ఊరుకోను అనే పంతం పట్టాడు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సిఎమ్ గా ఉన్న పవన్ తిరుపతిలోని లడ్డూ కల్తీ విషయమై 11 రోజుల దీక్ష కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో తిరుమల లడ్డు వ్యవహారం సంచలనంగా మారింది. హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా గత ముఖ్యమంత్రి జగన్ తిరుమల లడ్డులో పంది కొవ్వు, గోమాంసం కొవ్వు కలిపినట్టుగా వచ్చిన ఆరోపణలు కుదిపేస్తున్నాయి. ఇది జగన్ రాజకీయ జీవితాన్నే సమాధి చేస్తుందనే వ్యాఖ్యానాలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి.
ఇక లేటెస్ట్ గా తమిళ్ హీరో కార్తీ నటించిన సత్యం సుందరం మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ సందర్భంగా లడ్డూ గురించి యాంకర్ పదే పదే కార్తీని అడిగింది. అతను చాలాసార్లు నో కామెంట్ అన్నట్టుగానే ఉన్నాడు. బట్ యాంకర్ ఫోర్స్ వల్ల లడ్డూ విషయం సెన్సిటివ్ ఇక్కడ మాట్లాడకూడదు అన్నాడు. ఈ విషయంపై పవన్ సీరియస్ అయ్యాడు. ‘లడ్డూ విషయం సెన్సిటివ్ కాదు. ఇంకోసారి ఇలా మాట్లాడితే ఊరుకోను. సినిమావాళ్లు మాట్లాడితే మద్ధతుగా మాట్లాడండి లేదా కామ్ ఉండండి..’అంటూ నిప్పులు చెరుగుతూ హుకుం జారీ చేశాడు.
ఈ అంశంపై కార్తీ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ కు సారీ చెప్పాడు. ఇది అనుకోకుండా వచ్చిన మాటే తప్ప దాని వెనక ఎలాంటి ఇంటెన్షన్ లేదు. నేనూ వెంకటేశ్వర స్వామి భక్తుడినే.. జరిగిన దానికి సారీ చెబుతున్నా అని స్పందించాడు. అయితే ఆ వీడియో చూస్తే కార్తీ మాట్లాడిన దాంట్లో ఎలాంటి తప్పూ కనిపించదు. నిజంగానే ఇప్పుడు అది సెన్సిటివ్ ఇష్యూ.. అందుకే మాట్లాడలేదు. కాదూ మద్ధతుగా మాట్లాడాల్సిందే అని పవన్ అనడం కూడా సరైంది కాదు. మొత్తంగా కార్తీకి తన సినిమా సత్యం సుందరం విడుదలకు ఉంది కాబట్టి ఇలా సారీ చెప్పాడేమో అనుకోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com