Suriya : కోలీవుడ్ కు ఇంకా సాధ్యం కాని ప్యాన్ ఇండియా కల

Suriya :  కోలీవుడ్ కు ఇంకా సాధ్యం కాని ప్యాన్ ఇండియా కల
X

ప్రస్తుతం ఇండియాలో ప్యాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. ఈ ట్రెండ్ కొన్ని దశాబ్దాల క్రితం కూడా ఉంది. ఆ టైమ్ లో దీన్ని అలా చూడలేదు. కేవలం డబ్బింగ్ సినిమాలుగా మాత్రమే చూశారు. ఎందుకంటే ఆ సినిమాలు చేసిన వాళ్లు అదే టైమ్ లో అన్ని భాషల్లో ప్రమోషన్స్ చేయలేదు. డబ్బింగ్ కూడా బాగా ఆలస్యంగా జరిగేవి. బట్ బాహుబలి తర్వాత ప్యాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయింది. ఒకేసారి అన్ని భాషల్లో విడుదల చేయడం. అన్ని భాషల్లోనూ ప్రమోషన్స్ చేయడం అనేది ఈ మూవీతోనే స్టార్ట్ అయింది. అందుకు అదిరిపోయే రిజల్ట్ వచ్చింది. పుష్ప 2 సాధించే వరకూ ప్రస్తుతం హయ్యొస్ట్ కలెక్షన్స్ రికార్డ్ లో రెండో స్థానంలో ఉంది బాహుబలి 2.

బాహుబలి తర్వాత వెంటనే అప్పటి వరకూ పెద్దగా ఫేమ్ లోనే లేని కన్నడ ఇండస్ట్రీ కూడా ప్యాన్ ఇండియా మార్కెట్ లోకి కేజీఎఫ్ తో ఎంటర్ అయింది. ఈ మూవీ సాధించిన విజయానికి బాలీవుడ్ ముక్కున వేలేసుకుంది. ఎక్కువ శాతం వాయిస్ ఓవర్ తోనే నడిపించినా టేకింగ్, మేకింగ్, మాస్ ను మెస్మరైజ్ చేసిన విధానం అలాగే మదర్ సెంటిమెంట్.. ఇవన్నీ అన్ని భాషల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆపై తెలుగు నుంచి మరిన్ని మూవీస్ ప్యాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్నాయి. కానీ కార్తికేయ 2, హను మాన్, సలార్, కల్కి, దేవర చిత్రాలు మాత్రమే బ్లాక్ బస్టర్ అనిపించుకున్నాయి. ఇక తాజా పుష్ప 2 గురించి చెప్పేదేముందీ.. బాహుబలి 2 రికార్డులను కొల్లగొట్టేయబోతోంది.

అటు కన్నడ నుంచి కేజీఎఫ్ 2, చార్లీ 777, కాంతార వంటి మూవీస్ తో శాండల్ వుడ్ కెపాసిటీ ఏంటో నార్త్ ఆడియన్స్ కు చూపించాయి. ఇక మాలీవుడ్ గురించి చెప్పేదేముందీ.. ప్యాన్ ఇండియా ఫార్మాట్ లో కాకపోయినా దృశ్యంతో అన్ని భాషల్లోనూ దుమ్మురేపారు. బట్ ఓటిటిల్లో ఎక్కువ మంది చూసేది మళయాల సినిమాలే. సో.. ఈ లీగ్ లోకి ఇంత వరకూ ఎంటర్ కాలేకపోయిన ఇండస్ట్రీ కోలీవుడ్.

కోలీవుడ్ ను తక్కువ చేయడం అని కాదు కానీ.. ఒకప్పుడు నాయకుడు, బొంబాయి, రోజా, దిల్ సే, గురు వంటి కేవలం మణిరత్నం సినిమాలే దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను అలరించాయి. బట్ ఇప్పుడున్న ట్రెండ్ లో అలా ప్యాన్ ఇండియా సినిమా అనిపించుకునేవే రాలేకపోతున్నాయి ఈ పరిశ్రమ నుంచి. ఒకవేళ విక్రమ్, జైలర్ లాంటి సినిమాలు ఆ స్థాయివే అని చెప్పినా.. ఆ రెండూ కనీసం 500 కోట్ల క్లబ్ లో కూడా చేరలేకపోయాయి.

కోలీవుడ్ నుంచి ఫస్ట్ ప్యాన్ ఇండియా సినిమా అందించే బాధ్యత తీసుకున్నాడా అన్నట్టుగా మళ్లీ మణిరత్నమే రూపొందించిన పొన్నియన్ సెల్వన్ రెండు భాగాలూ.. తమిళ్ వారికి తప్ప మరెవరికీ కనెక్ట్ కాలేదు. ఇక అంతకు ముందే బాహుబలిని చూసి విజయ్ పులి అనే సినిమాతో వాత పెట్టుకున్నాడు.

2024లో కోలీవుడ్ ప్యాన్ ఇండియా మార్కెట్ ను ఛేదిస్తుంది అనుకున్నారు. అందుకు కంగువా, వేట్టైయాన్ వంటి మూవీస్ ను ముందుకు పెట్టారు. ముఖ్యంగా కంగువా 2వేల కోట్లు సాధిస్తుందని నిర్మాత మైకులు పగిలేలా చెప్పుకొచ్చాడు. చూస్తే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. మామూలుగా తమిళ్ మూవీస్ బయట ఫ్లాప్ అయినా అక్కడ ఆడతాయి. కానీ కంగువాను అక్కడా పట్టించుకోలేదు. మొత్తంగా బాహుబలి తర్వాత మారిన ప్యాన్ ఇండియా ట్రెండ్ లోకి ఎంటర్ కావడానికి కోలీవుడ్ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. బట్ 2024 వరకూ సాధ్యం కాలేదు. మరి ఈ యేడాదైనా ఆ మార్కెట్ ను ఛేదిస్తారా లేదా అనేది చూడాలి.

Tags

Next Story