Koozhangal: నయనతార సినిమా ఆస్కార్ బరిలో..

Koozhangal (tv5news.in)
Koozhangal: కొంతమంది నటీనటులు యాక్టింగ్‌తో పాటు నిర్మాతలుగా తమ సత్తా చాటుతున్నారు. భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించకపోయినా కంటెంట్ ఉండి ఛాన్సులు రాని మేకర్స్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా అలాంటి ఒక టాలెంట్ ఉన్న మేకర్‌ను కోలీవుడ్‌కు పరిచయం చేసింది. ఆ దర్శకుడు తెరకెక్కించిన సినిమా ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది.
నయనతార, తన కాబోయే భర్త విఘ్నేశ్ శివన్.. తమ సొంత బ్యానర్ రౌడీ పిక్చర్స్ ద్వారా నిర్మించిన తమిళ చిత్రం 'కూఱంగల్'(అంటే తెలుగులో ముత్యాలు) . పి ఎస్ వినోథ్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కరుత్తడయ్యాన్, చెళ్లపాండి ఇందులో లీడ్ రోల్స్‌లో నటించారు. తండ్రి హింసను తట్టుకోలేక ఇంట్లో నుండి వెళ్లిపోయిన తల్లిని వెనక్కి తీసుకురావడానికి ఒక పిల్లాడు పడే తపనే కూఱంగల్.
పి ఎస్ వినోథ్ రాజ్ ఇదే తొలి చిత్రం. అందుకే తన కుటుంబంలోని సంఘటనల ఆధారంగానే సింపుల్‌గా, నేచురల్‌గా 'కూఱంగల్'ను తెరకెక్కించాడు. ఈ సినిమా గురించి ముఖ్యంగా చెప్పుకోవాల్సిన మరో అంశం సంగీతం. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఇప్పటికే పలు నేషనల్, ఇంటర్‌నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఎన్నో అవార్డులను దక్కించుకుంది 'కూఱంగల్'. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచి ఇండియన్ సినిమా తరపున అవార్డును దక్కించుకోవడానికి సిద్ధమైంది. వచ్చే ఏడాది 2022 మార్చి 22న 94వ అకాడెమీ అవార్డు ప్రదానోత్సవం అమెరికా లాస్ ఏంజిల్స్‌లోని డాల్బి థియేటర్‌లో జరగనుంది. ఈ సినిమాకే అవార్డు రావాలని దర్శక నిర్మాతలతో పాటు మూవీ లవర్స్ కూడా కోరుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com