Kota Srinivasa Rao: 'కోట్లలో పారితోషికం తీసుకుంటూ సినీ కార్మికుడు ఎలా అవుతాడు'.. చిరుపై కోట కామెంట్స్

Kota Srinivasa Rao: టాలీవుడ్‌లో ఇప్పటికీ ఎందరో గుర్తుండిపోయే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. వారు సినిమాలకు దూరమయినా.. ప్రేక్షకుల మనసుల్లో మాత్రం ఎప్పటికీ నిలిచిపోతారు. అలాంటి వారిలో ఒకరే కోట శ్రీనివాస రావు. కానీ ఇటీవల కాలంలో కోట శ్రీనివాస రావు చేస్తున్న కొన్ని కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవిపై ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనాన్నే సృష్టించేలా ఉన్నాయి.
కోట శ్రీనివాస రావుకు ఇప్పటికీ ఎన్నో సినిమా ఆఫర్లు వస్తున్నా.. ఆయన వయసును దృష్టిలో పెట్టుకొని సినిమాలు చేయడం తగ్గించినట్టు చాలాసార్లు స్పష్టం చేశారు. ఎన్నో వందల చిత్రాల్లో నటనతో అలరించిన కోట.. ప్రస్తుతం అప్పుడప్పుడు ఇంటర్వూలలో కనిపించడం వరకే పరిమితం అవుతున్నారు. తాజాగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్యూలో చిరంజీవిపై కోట చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
చిరంజీవి అంటే కోటకు చాలా గౌరవం. ఈ విషయం ఆయనే స్వయంగా పలుమార్లు బయటపెట్టారు. కానీ మే డే కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడిన మాటలకు కోట అభ్యంతరం చెప్పారు. ఇటీవల సినీ కార్మికుల సమక్షంలో జరిగిన మే డే కార్యక్రమంలో చిరంజీవి పాల్గొన్నారు. అప్పుడు చిత్రపురి కాలనీలో ఆసుపత్రి కట్టిస్తానని చిరు మాటిచ్చారు. దానికి కోట అభ్యంతరం తెలిపారు.
ఆసుపత్రి సంగతి తరువాత అని ముందు సినీ కార్మికులకు తిండిపెట్టే ఏర్పాట్లు చేయాలని కోట అన్నారు. కృష్ణ నగర్‌లో అవకాశాలు లేక ఎంతోమంది సినీ కార్మికులు వ్యసనాలకు అలవాటు పడుతున్నారని తెలిపారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే అపోలో ఆసుపత్రికి వెళతారు కానీ చిరంజీవి కట్టే ఆసుపత్రికి రారని ఆయన అన్నారు. చిరంజీవి తనను తాను సినీ కార్మికుడు అని చేసిన వ్యాఖ్యలను కూడా కోట విమర్శించారు.
కోట్ల రూపాయల పారితోషికం అందుకునే చిరంజీవి కార్మికుడు ఎలా అవుతారని కోట ప్రశ్నించారు. కార్మికుడు అని చెప్పుకునే చిరంజీవి ఎప్పుడైనా, ఎవరికైనా సాయం చేశారా అని అడిగారు. ఎవరికైనా తన సినిమాల్లో వేశాలు ఇప్పించారా అని కామెంట్ చేశారు. ఉన్నట్టుండి చిరంజీవిపై కోట ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడంతో వీరి మధ్య ఏమైనా వివాదాలు తలెత్తాయా అని ప్రేక్షకుల్లో సందేహం మొదలయ్యింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com