Krishnam Raju : కృష్ణంరాజు సినీ రంగంలోకి ఎలా వచ్చారంటే..

Krishnam Raju : కృష్ణంరాజు సినీ రంగంలోకి ఎలా వచ్చారంటే..
X
Krishnam Raju : తెలుగు సినీరంగంలో రెబల్‌స్టార్‌గా పేరు గాంచిన కృష్ణం రాజు మృతితో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది

Krishnam Raju : తెలుగు సినీరంగంలో రెబల్‌స్టార్‌గా పేరు గాంచిన కృష్ణం రాజు మృతితో చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఐదు దశాబ్ధాలకు పైగా సినీరంగంలో ప్రయాణించిన ఆయన మరణం సినీపరిశ్రమకు తీరని లోటు. అనారోగ్యం కారణంగా AIG హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.

ఫోటోగ్రఫీపై ఇష్టంతో హైదరాబాద్‌లో రాయల్ స్టూడియో ప్రారంభించారు కృష్ణంరాజు. తర్వాత మిత్రుల ప్రోత్సాహంతో సినీరంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్రాసు వెళ్లారు. తెలుగు సినీరంగంలో ఎన్టీఆర్‌, అక్కినేని తర్వాత వచ్చిన రెండో తరం హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. శోభన్‌బాబు, కృష్ణ వెండితెరకు పరిచయం అయిన కొన్నాళ్లకే...1966లో వచ్చిన చిలకా గోరింకా సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఐతే మొదటి సినిమా ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా ఫ్లాప్‌ కావడంతో చాలా నిరాశపడ్డారు కృష్ణంరాజు.

తర్వాత నటనలో రాటు దేలేందుకు అనేక పుస్తకాలు చదివారు. పాతకాలం నటుడు నారాయణరావు దగ్గర శిక్షణ తీసుకున్నారు. నటనలో పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేవరకు వచ్చిన అన్ని అవకాశాలు వదులుకున్నారు. తర్వాత అవే కళ్లు సినిమాలో విలన్‌గా నటించి మెప్పించారు. ఈ పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తర్వాత వరుసగా 30 సినిమాల్లో విలన్ వేషాలే వేశారు కృష్ణంరాజు. తర్వాత పలు సినిమాల్లో హీరో సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ కూడా చేశారు. ఎన్టీఆర్‌తో భలే మాస్టర్, బడిపంతులు, వాడే వీడు, పల్లెటూరి చిన్నోడు, మనుషుల్లో దేవుడు, మంచికి మరోపేరు, సతీసావిత్రి చిత్రాల్లో నటించారు.

ఇక అక్కినేనితో బుద్ధిమంతుడు, జైజవాన్, పవిత్రబంధం,మంచిరోజులు సినిమాల్లో కలిసి నటించారు. మాతృమూర్తి సినిమాలో విలన్‌గా నటించి మెప్పించారు. అక్కినేని నటించిన ఎస్పీ భయంకర్‌ సినిమాలో సపోర్టింగ్ హీరోగా నటించారు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన ఇంటి దొంగలు చిత్రంతో మలళ్లీ హీరోగా మారారు. ఐతే ఆ సినిమా లేడి ఒరియంటెడ్‌ కావడంతో ప్రత్యగాత్మతో ఉన్న అనుబంధం కారణంగా ఒప్పుకున్నారు. విలన్‌గా రాణిస్తున్న టైంలోనే గోపికృష్ణా మూవీస్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి వరుసగా సినిమాలు తీశారు. స్వంత బ్యానర్‌లో వచ్చిన మొదటి చిత్రం కృష్ణవేణి...12 సెంటర్‌లలో వంద రోజులు ఆడింది. తర్వాత ఇక కృష్ణంరాజు హీరోగా వెనక్కి తిరిగిచూడలేదు.

సొంత బ్యానర్ గోపికృష్ణా మూవీస్‌లో కృష్ణంరాజు నటించిన రెండో సినిమా భక్త కన్నప్ప. అప్పట్లో ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. కృష్ణంరాజు కెరీర్‌లోనే గొప్ప చిత్రంగా నిలిచిపోయింది. చిత్ర రిలీజ్‌ అయిన అన్ని సెంటర్‌లలో 25 వారాల పాటు ఆడింది. 1984లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో బొబ్బిలి బ్రహ్మణ్ణ చిత్రం తీశారు. ఈ చిత్రం కూడా అఖండ విజయం సాధించింది. దాసరి నారాయణరావుతో తీసిన తాంద్ర పాపరాయుడు మంచి గుర్తింపునిచ్చింది.

కృష్ణంరాజు నటనకు మెచ్చి అనేక అవార్డులు వరించాయి. 1977లోఅమరదీపం, 1984లో బొబ్బిలి బ్రహ్మన్న చిత్రాలకు ఏపీ ప్రభుత్వం నంది అవార్డుతో సత్కరించింది. 1986లో తాండ్రపాపారాయుడు సినిమాకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారాన్ని తీసుకున్నారు.

Tags

Next Story