Kriti Sanon : తప్పుడు వార్తల వ్యాప్తిపై ఆగ్రహం, చర్యలు

జాతీయ అవార్డు గెలుచుకున్న నటి కృతి సనన్ ఈ సంవత్సరం పలు మార్లు సంచలనం సృష్టిస్తూ వార్తల్లో నిలుస్తోంది. ఈ సంవత్సరం, ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. ఆ మూడు కూడా బాక్సాఫీస్ వద్ద భారీగా విఫలమయ్యాయి. ప్రస్తుతం ఆమె తన రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం షూటింగ్‌ల్లో బిజీగా ఉంది. తాజాగా ఈమె తప్పుడు వార్తల్లో చిక్కుకుంది. కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ 8 లో ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ఆమోదించడంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కృతి స్పష్టం చేసింది.
కృతి సనన్ ఈ వాదనలన్నింటినీ తిరస్కరించింది. ఈ నివేదికలను బహిరంగంగా ఖండించింది. ఈ తప్పుడు వార్తల వ్యాప్తికి వ్యతిరేకంగా చట్టపరమైన చర్యలు తీసుకుందని పలు నివేదికలు కూడా చెబుతున్నాయి. డిసెంబర్ 3న, కృతి కరణ్ జోహార్ షో కాఫీ విత్ కరణ్ 8లో ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌ను ప్రమోట్ చేసినట్లు ఆరోపణలకు సంబంధించిన నివేదికలను తోసిపుచ్చుతూ ఒక ప్రకటన విడుదల చేసింది.
కృతి సనన్ చట్టపరమైన చర్య
ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీలో.. 'తప్పుడు వార్తలు ఇచ్చిన చాలా కథనాలు ఉన్నాయి. నేను కాఫీ విత్ కరణ్‌లో కొన్ని ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రమోట్ చేస్తున్నానని వచ్చిన కథనాలు పూర్తిగా నకిలీవి, అబద్ధం. అవి చెడు ఉద్దేశ్యంతో ప్రచురించబడ్డాయి. ఈ కథనాలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. నన్ను ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌కి లింక్ చేసినట్లు తప్పుగా క్లెయిమ్ చేస్తున్నాయి. షోలో నేనెప్పుడూ ఏ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ గురించి మాట్లాడలేదు' అని కృతి సనన్ చెప్పుకొచ్చింది. దాంతో పాటు, 'నేను ఇలాంటి తప్పుడు కథనాలు, నివేదికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. లీగల్ నోటీసు జారీ చేసాను. ఇలాంటి తప్పుడు, బూటకపు, పరువు నష్టం కలిగించే నివేదికల పట్ల జాగ్రత్త వహించాలని నేను ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను' అని చెప్పింది.
వర్క్ ఫ్రంట్‌లో
కృతి సనన్ వర్క్ ఫ్రంట్ లో.. ఆమె ఇటీవలే 'గణపథ్'లో కనిపించింది. ఆమె రాబోయే చిత్రాల విషయానికొస్తే.. 2024లో 'ది క్రూ', 'దో పట్టీ'లో కనిపించనుంది. 'ది క్రూ' రియా కపూర్ దర్శకత్వం వహించగా, ఏక్తా కపూర్ నిర్మించారు. కృతి సనన్ 'దో పట్టి' చిత్రంలో నటిస్తూనే నిర్మిస్తోంది. 'దివాలే' తర్వాత 'దో పట్టి'లో కాజోల్‌తో కలిసి రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com