Allu Arjun : అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ రియాక్షన్

అల్లు అర్జున్ ను హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ లు అరెస్ట్ చేశారు. ఈ నెల 4న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి ఘటనపై అర్జున్ ను అరెస్ట్ చేశారు. దీనిపై ఎలాంటి సమాచారం లేకుండానో పోలీస్ లు అరెస్ట్ చేశారు అనే వాదన కూడా ఉంది. అవన్నీ ఎలా ఉన్నా.. ఈ అరెస్ట్ తో ప్రభుత్వం ఎవరినీ వదలదు అన్న సంకేతం ఇస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. అదే సమయంలో ఇది అభద్రతా భావం వల్ల జరిగిన అరెస్ట్ అంటున్నాడు కేటీఆర్. అల్లు అర్జున్ అరెస్ట్ పై కేటీఆర్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టడం చూస్తుంటే ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంటుందనుకుంటున్నారు. ఇంతకీ కేటీఆర్ ఏం అన్నాడంటే..
‘‘జాతీయ అవార్డ్ విన్నింగ్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పాలకుల అభద్రతకు పరాకాష్ట. తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తిగా సానుభూతి ఉంది కానీ నిజంగా ఎవరు విఫలమయ్యారు? అల్లుఅర్జున్ ను ఒక సాధారణ నేరస్థుడిగా ట్రీట్ చేయడం.. ప్రత్యేకించి అతను నేరుగా బాధ్యత వహించని విషయానికి పిలవబడటం దురదృష్టం. గౌరవం & గౌరవప్రదమైన ప్రవర్తనకు ఎల్లప్పుడూ స్థలం ఉంటుంది. ప్రభుత్వ ప్రవర్తనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అదే దిక్కుమాలిన లాజిక్‌తో వెళితే, హైదరాబాద్‌లో హైడ్రామా చేసిన భయం సైకోసిస్‌తో మరణించిన ఇద్దరు అమాయకుల మరణానికి కారణమైన రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి’’.. అంటూ ఓ కొటేషన్ ను కూడా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ అర్థం ఏంటంటే.. ‘ఒక అభద్రతా భావం ఉన్న నాయకుడి వల్ల తన చుట్టూ ఉన్న ప్రజలే విధ్వంసానికి గురవుతారు’అని.
మొత్తంగా అల్లు అర్జున్ కు డైరెక్ట్ గానే బిఆర్ఎస్ సపోర్ట్ లభించిందని చెప్పాలి. ఈ ఘటనను ఎంత రాజకీయం చేస్తే ఇండస్ట్రీకి అంత ఇబ్బంది అవుతుందనేది కూడా గుర్తించాలి. ఓ సంఘటనకు బాధ్యుడిపై చట్టం తన పని తను చేస్తున్నట్టుగానే భావించాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com