K.Vishwanath : సినీ జగత్తులో చెరగని ముద్రలు..

K.Vishwanath : సినీ జగత్తులో చెరగని ముద్రలు..
కుల వ్యవస్థపై గురి పెట్టిన సప్తపది చిత్రం కె.విశ్వనాథ్‌నో మరో కోణాన్ని ఆవిష్కరించింది.

తెలుగు సినీ జగత్తుకు కళా చుక్కాని కాశీనాథుని విశ్వనాథ్‌. గురువారం హైదరాబాద్ లో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు.

సినీ జగత్తులో చెరగని ముద్రలు..
కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్‌ తెలుగు సినీ జగత్తులో చెరగని ముద్ర వేశారు. ఆయన సష్టించిన పాత్రలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. లోతైన మాటలు ఆలోచింపచేస్తాయి. ఆయన చిత్రాల్లో సంగీతానిది ప్రత్యేక పాత్ర. కళలకు పెద్దపీట వేస్తూ.. విశ్వనాథులవారు తెరకెక్కించిన చిత్రాలు అజరామరం. ఆయన రచించి.. తెరకెక్కించిన శంకరాభరణం, సప్తపది, స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం.. ప్రేక్షకుల మనస్సుల్లో అలా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఐదు చిత్రాలకు జాతీయ అవార్డులను అందించింది.

కమర్షియల్‌ హంగులేమీ లేకుండా కేవలం.. సంప్రదాయ సంగీతం ప్రధాన అంశంగా తెరకెక్కిన అపురూప దృశ్య కావ్యం శంకరాభరణం.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. జె.వి.సోమయాజులు ముఖ్య పాత్రధారిగా తెరకెక్కిన ఈ సినిమా 1980లో విడుదలై అఖండ విజయాన్ని అందుకుంది. ఇందులోని పాత్రలు, పాటలు, మాటలు.. ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అందుకే, ఈ చిత్రాన్ని ఎన్నో అవార్డులు, రివార్డులు వరించాయి. ముఖ్యంగా నాలుగు జాతీయ అవార్డులను శంకరాభరణం సొంతం చేసుకుంది.

కుల వ్యవస్థపై గురి పెట్టిన సప్తపది చిత్రం కె.విశ్వనాథ్‌నో మరో కోణాన్ని ఆవిష్కరించింది. మనుషులను విడదీసే కులవ్యవస్థను చెరిపివేయాలని చాటి చెప్పిన అద్భుత చిత్రం సప్తపది. సమాజంలో పేరుకుపోయిన కులవ్యవస్థను రూపుమాపాలనే ఆలోచన అందరిలో కలిగేలా చేసింది. 1981లో విడుదలైన ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా భావించే నర్గీస్‌దత్త్‌ అవార్డు ఫర్‌ బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ ఆన్‌ నేషనల్‌ ఇంటిగ్రేషన్ అవార్డు వరించింది.

కె.విశ్వనాథ్‌ మరో అపురూప చిత్రం స్వాతిముత్యం. చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన స్త్రీకి మళ్లీ వివాహం చేయాలనే ఆలోచన రేకెత్తించిన చిత్రమిది. కమల్‌హాసన్‌లోని నటనా కౌశలానికి అద్దం పట్టిన మరపురాని చిత్రాల్లో ఇదీ ఒకటి. సినీ ప్రియులు మాత్రమే కాకుండా ప్రముఖుల ప్రశంసలు సైతం సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగులో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా జాతీయ అవార్డు అందుకుంది.


విశ్వనాథ్‌ మరో ఆలోచన రేకెత్తించే చిత్రం సూత్రధారులు. హింసతో కాదు.. అవినీతి అక్రమాలను ఎదుర్కొనడానికి శాంతియుత మార్గం ఉత్తమమని చాటి చెప్పిన చిత్రం సూత్రధారులు. ఈ సినిమా 1989లో విడుదలై.. మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కూడా తెలుగులో ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌గా జాతీయ అవార్డును పొందింది.

భారతీయ సినీ పరిశ్రమలో కె.విశ్వనాథ్‌ తిరుగులేని కీర్తి సొంతం చేసుకున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. అద్భుత చిత్రాల రూపంలో ఎప్పటికీ మన మధ్యే ఉంటారు.

Tags

Read MoreRead Less
Next Story