Lata Mangeshkar : హ్యాట్సాఫ్ లతాజీ... ఒక్క రూపాయి జీతం తీసుకోని ఏకైక ఎంపీ..!

Lata Mangeshkar : ప్రముఖ గాయని, భారతరత్న గ్రహీత లతా మంగేష్కర్ ఈ రోజు (ఆదివారం) ముంబైలో కన్నుమూశారు . 'నైటింగేల్ ఆఫ్ ఇండియా'గా పేరుగాంచిన ఆమె యాభై వేలకి పైగా పాటలు పాడారు. సింగర్ గానే కాకుండా నిర్మాతగా కూడా ఆమె రాణించారు. ఇక రాజకీయాల్లోకి వస్తే ఆమెకి బీజేపీ మద్దతు ఇవ్వడంతో 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. అయితే తన ఆరేళ్ళ పదవికాలంలో కేవలం 12 సార్లు మాత్రమే పార్లమెంట్ కు హాజరయ్యారు.
అయితే సభలో ఆమె ఒకే ఒక ప్రశ్న అడిగారు. వివిధ సెక్షన్లలో రైళ్లు పట్టాలు తప్పుతున్న సంఘటనలు పెరుగుతుండటం నిజమేనా? 2000 సంవత్సరం ప్రారంభం నుంచి అలాంటి సంఘటనలు ఎన్ని జరిగాయి? పర్యవసానంగా రైల్వేలకు ఎంత నష్టం జరిగింది? ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? అని ప్రశ్నించారు.
పార్లమెంటేరియన్‌గా ఆమెకు లభించే భత్యాలు, చెక్కులను ఆమె స్వీకరించలేదని సమాచార హక్కు చట్టం ప్రకారం చేసిన దరఖాస్తుకు సమాధానం వచ్చింది. ఆమెకు చేసిన చెల్లింపులన్నీ పే అకౌంట్స్ కార్యాలయానికి తిరిగి వచ్చినట్లు వెల్లడైంది. అనారోగ్య సమస్యలతో రాజ్యసభలో సమావేశాలకు హాజరు కాకపోవడంతో ప్రతిపక్ష నేతలు విమర్శించినప్పటికీ ఆమె మాత్రం తిరిగి కామెంట్స్ చేయకుండా హుందాగా వ్యవహరించారు. ఇక లతా మంగేష్కర్ ఎంపీ పెన్షన్ కోసం కూడా దరఖాస్తు చేసుకోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com