Lata Mangeshkar Raj Singh: క్రికెటర్‌ను ప్రేమించి కుమారిగా మిగిలిపోయిన లతా మంగేష్కర్..

Lata Mangeshkar Raj Singh: ప్రస్తుతం గాన కోకిల లతా మంగేష్కర్ మరణవార్త ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె గురించి ఇన్నిరోజులు దృష్టిపెట్టని ఎన్నో విషయాలు లతా మృతి తర్వాత చర్చల్లోకి వస్తున్నాయి. అందులో ఒకటి లతా మంగేష్కర్ పెళ్లి విషయం. అసలు లతా మంగేష్కర్ ఎందుకు పెళ్లి చేసుకోలేదు. అప్పట్లో ఆమె ప్రేమ గురించి వచ్చిన వార్తలు నిజమేనా అని మరోసారి ఆరాతీయడం మొదలుపెట్టారు ప్రేక్షకులు.
లతా మంగేష్కర్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆమె ప్రేమకథే అని ఇప్పటికీ చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే అప్పటి ప్రేక్షకులకు మాత్రమే ఈ ప్రేమకథ గురించి వివరంగా తెలుసు. ఆమె ప్రేమకథ ఒక వ్యక్తి వల్ల బలయిపోయిందని సమాచారం. మాజీ స్టార్ క్రికెటర్ రాజ్‌సింగ్ దుంగార్పూర్ గురించి ఇప్పటి తరంవారికి తెలియకపోవచ్చు. అతడితోనే లతా మంగేష్కర్ ప్రేమ ప్రయాణం మొదలయ్యింది.
లతా మంగేష్కర్ సోదరుడి ద్వారా రాజ్ సింగ్‌కు, తనకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కొన్నాళ్లకే ప్రేమకు దారితీసింది. ఒక రాజ్ సింగ్ పూర్తిగా స్థిరపడకముందే లతా మంగేష్కర్ బాలీవుడ్‌ను ఏలేయడం మొదలయ్యింది. రాజ్ సింగ్ కూడా క్రికెటర్‌గా స్థిరపడ్డాడు. ఇక రాజ్ సింగ్, లతా మంగేష్కర్ పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారు. అందుకే తన ప్రేమ సంగతి తల్లిదండ్రులకు చెప్పాడు రాజ్ సింగ్.
రాజ్ సింగ్ తండ్రి మహర్‌వాల్ లక్ష్మణ్ సింగ్ రాజస్థాన్‌లో ఓ సంస్థానానికి రాజు. ఆ రాచరికం వారి ప్రేమకు అడ్డుపడింది. అంత గొప్ప గాయని పట్ల ఆయనకు కొంచెం కూడా గౌరవం కలగలేదు. చులకనగా చూసి లతాను ఆయన ఇంటి కోడలును చేసుకోను అని చెప్పేశారు. రాజ్ సింగ్ బయట ఎంత క్రికెటర్ అయినా.. ఇంట్లో మాత్రం తండ్రి మాటను కాదనలేకపోయాడు.
తండ్రి మాట కాదనలేకపోయాడు కానీ రాజ్ సింగ్ మాత్రం మరే స్త్రీని తన జీవితంలోకి రానివ్వనని ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అదే మాట లతా మంగేష్కర్‌కు వెళ్లి చెప్పాడు. అయితే రాజ్ సింగ్ లాగానే లతా కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానని నిర్ణయించుకుంది. అనుకున్నట్టుగానే లతా, రాజ్ సింగ్ అస్సలు పెళ్లి చేసుకోకుండానే మిగిలిపోయారు. పైగా మంచి స్నేహితులుగా ఒకరికి ఒకరు ఎప్పుడూ తోడుగా ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com