Jani Master : జానీ మాస్టర్ ఇష్యూపై లీగల్ విచారణ జరుగుతోంది : తమ్మారెడ్డి భరద్వాజ

జానీ మాస్టర్ ( Jani Master ) వివాదంపై టాలీవుడ్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్ మంగళవారం ప్రెస్ మీట్ పెట్టింది. తమ్మారెడ్డి భరద్వాజ్, ఝాన్సీ, ఫిల్మ్ చాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్, ప్యానెల్ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. జానీ మాస్టర్ మీద ఆరోపణలు రావడంతో ఈ వివాదం తేలే వరకు అతడిని డ్యాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ను ఇప్పటికే ఆదేశించామన్నారు. ఐదేండ్ల పాటు బాధిత అమ్మాయి నరకం చూసిందని.. యువతి తల్లిదండ్రుల నుంచి సైతం సమాచారం సేకరించామన్నారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ తో చర్చించి జానీపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నారు. ఝాన్సీ మాట్లాడుతూ.. ‘జానీ మాస్టర్ ఇష్యూకు సంబంధించి బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించింది. మీడియా ఈ ఘటనను మా దృష్టికి తీసుకొచ్చింది. పని ప్రదేశంలో వేధింపులు ఉన్నాయంటూ తొలుత ఆ అమ్మాయి ఛాంబర్‌ను ఆశ్రయించింది. ఆ తర్వాత లైంగిక వేధింపుల గురించి బయటపెట్టింది. దీనిపై లీగల్‌గా విచారణ జరుగుతోంది. ఇద్దరి తరఫున వాదనలు విన్నాం. 90 రోజల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రిపోర్ట్ చేస్తాం. మా పరిధిలో మేము విచారణ పూర్తి చేశాం. అమ్మాయిలు ఎవరైనా కంప్లయింట్ చేస్తే వారి వివరాలు మేం సీక్రెట్ గా ఉంచుతాం. అందుకే ఈ అమ్మాయి వివరాలను కూడా బయటకు చెప్పకూడదని నిర్ణయించుకున్నాం. సంగీత, ప్రేమ, ప్రగతి ‘వాయిస్ ఆఫ్ విమెన్’లో భాగం. ఇటీవల సమంత దీని గురించే పోస్ట్ పెట్టారు. ‘వాయిస్ ఆఫ్ విమెన్’ ఇండస్ట్రీకి సంబంధించిందే తప్ప సెపరేట్ కాదు’ ఝాన్సీ పేర్కొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ మీడియాకు థ్యాంక్స్ తెలిపారు. ‘ఇలాంటి కేసుల కోసమే 2013లో ఆసరా అని పెట్టాం. 2018లో ప్యానల్ పెట్టాం. ఇలాంటివి ఎన్ని తీసుకొచ్చినా మహిళలకు ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. ఇండస్ట్రీలో మహిళలు సేఫ్‌గా ఉంటారని తెలియజేయడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాం. 90 రోజుల్లో దీనికి పరిష్కారం ఆలోచిస్తాం. మీడియా సహకారంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. మీరంతా కూడా సహకరించాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com