Dasari Narayanarao : సినిమా శక్తి దాసరి నారాయణరావు జయంతి స్పెషల్

వ్యక్తికి బహువచనం శక్తి అన్నాడు శ్రీశ్రీ. ఆ మాటలు ఎంత నిజమో దాసరి నారాయణరావును చూస్తే అర్థమౌతుంది. ఓ దిగ్ధర్శకుడిగా తెలుగు చిత్ర సీమపై చెరగని ముద్రవేసిన దాసరి తర్వాత పరిశ్రమకే పెద్ద దిక్కుగా మారారు. సహాయం చేయాలన్నా.. వ్యంగ్యస్త్రాలు విసరాలన్నా.. ప్రత్యర్థులపై సినిమాస్త్రరాలు సంధించాలన్నా.. ఆయనకు ఆయనే సాటి. స్వయం కృషి, ప్రతిభ ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చనని నిరూపించిన దర్శక దిగ్గజం దాసరి. మే 4న దాసరి జయంతి. ఈ సందర్భంగా ఆయన కెరీర్ ను ఓ సారి చూద్దాం.
దర్శకుడిగా దాసరి స్థానం శిఖరం. 150 సినిమాలతో గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించిన ది గ్రేట్ డైరెక్టర్ ఆయన. దర్శకుడు అనే పదానికే వన్నె తెచ్చిన కెప్టెన్. ‘తాతామనవడు‘ లాంటి లో బడ్జెట్ సినిమాతో కెరీర్ ఆరంభించి.. ఆ తర్వాత లో బడ్జెట్ సినిమాలతో బిగ్గెస్ట్ హిట్స్ ఎలా సాధించవచ్చో నిరూపించాడు. అలాగే కథ కరెక్ట్ గా ఉంటే స్టార్స్ అవసరం లేదని నిరూపించిన గ్రేట్ రైటర్. సినిమాకు ఓ బాధ్యత ఉందని నమ్మి ఆచరించిన మహాదర్శకుడు దాసరి నారాయణరావు. అందలమెక్కాలంటే అండదండలుండక్కర్లేదు. అంతులేని ఆత్మవిశ్వాసం ఉంటే చాలు అని నిరూపించిన వ్యక్తి దాసరి నారాయణరావు. ట్రెండ్ కు భిన్నంగా వెళ్లి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన దర్శకుడు ఆయన. 150సినిమాల దర్శకుడిగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కిన ఆ దర్శక రత్నం తీసిన సినిమాల్లో 90 చిత్రాలు క్లీన్ యు సర్టిఫికెట్ సాధించాయి. ఓ రకంగా ఇదీ ఓ రికార్డే. దాసరి నారాయణ రావు పేరు వినగానే కథాబలం ఉన్న ఎన్నో గొప్ప చిత్రాలు గుర్తొస్తాయి. కేవలం కథను మాత్రమే నమ్మి ముందుకు సాగిన దర్శకుడాయన. తొలి సినిమా నాటి తాతామనవడు నుంచి నిన్నటి ఎర్రబస్సు వరకూ ఎన్నో సంచలనాలకు కేరాఫ్ ఆ పేరు. ఎన్నో రికార్డులకు, మరెన్నో రివార్డులకు కేరాఫ్ దాసరి.. అందుకే ఆయన దర్శకరత్నమయ్యారు.
నిజానికి.. రంగస్థలమే లోకం అనుకున్న ఓ కుర్రాడు అనుకోకుండా వెండితెర వైపు వచ్చాడు. ప్రతిభకు హద్దేలేని ఆ చోట ఆయనో శక్తిలా మారాడు. హీరోల చుట్టూ తిరిగే కమర్షియల్ మార్కెట్ ను తన వైపు తిప్పుకున్నాడు. కానీ కమర్షియల్ పేరిట వెర్రిమొర్రి వేశాలేయలేదు.. వెండితెరకు మానవ సంబంధాల్లోని లోతుల్ని పరిచయం చేసి... ప్రేక్షకుల మనసు లోతుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్నాడు. దాసరి దర్శకుడు కంటే ముందు మంచి కథకుడు. స్క్రీన్ ప్లే రైటర్. ఆ కారణంగానే ఆయన సినిమాల్లో బలమైన కథ, కథనాలుంటాయి. ఇక కథకుడుగానూ ఎన్నో సాహసవంతమైన చిత్రాలే చూపించారు మనకు. నేటి తరంలో ఎంతో మంది చేయలేని సాహసాలను అప్పుడే చేశారు.. ఎక్స్ ట్రా మారిటల్ రిలేషన్స్ తో మేఘసందేశం, ఓ ఇల్లాలు.. తాళిని తీసి నేలను కొట్టే గోరింటాకు లాంటి అప్పటి టైమ్ కు మహిళలకు ఇష్టం లేని కథాంశాలతో సినిమాలు చేసినా కన్విన్సింగ్ కథనాలతో అద్భుతమైన విజయాలు అందుకున్నారు. ముఖ్యంగా దాసరి గురించి చెప్పాల్సి వస్తే ఖచ్చితంగా ఉండాల్సిన సినిమాగా మేఘ సందేశం నిలిచిందంటే కారణం, ప్రేమకు వయసు అడ్డం కాదనే విషయాన్ని ఎంతో కవితాత్మకంగా చెప్పడం.. ప్రేమకూ, వ్యామోహానికి మధ్య ఉన్న గీతను అత్యంత స్పష్టంగా స్పష్టం చేయడం.. అందుకే మేఘసందేశం తెలుగులో వచ్చిన ది బెస్ట్ మూవీస్ లిస్ట్ లోనూ ఖచ్చితంగా ఉంటుంది.
దాసరి ఎప్పుడూ స్టార్ల వెంట పరుగులు తీయలేదు. కథే స్టార్ గాఎంతో మంది స్టార్స్ ను తయారు చేశారు. దాసరి నారాయణరావు సినిమాలంటే కథాబలం ఉన్న చిత్రాలుగా పేరు తెచ్చుకున్నారు. తెలుగు సినిమా మలి చరిత్రలో దర్శకుడి పేరుతోనే ఓపెనింగ్స్ తెచ్చిన ఏకైక దర్శకుడాయన. అందుకే పోస్టర్ పై హీరోకు సమానంగా ఆయన ఫోటో ఉన్నా ఆడియన్స్ ఆనందంగానే ఫీలయ్యారు.
అక్కినేనితో ఆయనకున్న అనుబంధం ఏ సినిమా చూసినా అర్థమౌతుంది. మేఘసందేశమే కాదు, ప్రేమాభిషేకం, ప్రేమమందిరం, యువరాజు, బహుదూరపు బాటసారి, ఏడంతస్తుల మేడ, ఆది దంపతులు, బంగారు కుటుంబం.. ఇలా ఏ సినిమా చూసినా ఆయన తన అభిమాన కథానాయకుడిని వెండితెరపై ఆవిష్కరించిన విధానమే కనిపిస్తుంది. కథాపరంగానూ ఇవన్నీ అద్భుతమైనవే. ముఖ్యంగా యాభైయేడేళ్ల వయసులో అక్కినేని చేత లవర్ బాయ్ వేషం వేయించడం అనేది దాసరి దర్శకత్వ ధైర్యానికి నిదర్శనం. అలాగే యువరాజు చిత్రంలోనూ ఆయన పాత్ర ఆకట్టుకునేదే. ఇలా ఒక్కో సినిమాలో ఒక్కో వైవిధ్యమైన పాత్రతో అక్కినేని మలిదశ కెరీర్ ను మరింత కాలం కొనసాగేలా చేయడంలో దాసరి పాత్రే చాలా పెద్దది.
అయితే దాసరి ఏ సినిమా చేసినా అందులో ఖచ్చితంగా మానవీయ కోణం ఉంటుంది. సామాజిక బాధ్యత ఉంటుంది. ప్రతి పాత్రకూ ఏదో ఒక బాధ్యత ఉంటుంది. నిజానికి ఇలాంటి కథాంశాలను ఎంచుకుని అన్నేళ్లుగా ఎన్నో విజయాలు అందుకున్న దర్శకుడు దాసరి తప్ప మరొకరు లేరేమో.. అనిపించక మానదు. ఎన్టీఆర్ తో దాసరి చేసిన సినిమాలు చరిత్ర సృష్టించాయి.. ఆ సినిమాలే ఎన్టీఆర్ పార్టీ పెట్టి సరికొత్త చరిత్ర సృష్టించేందుకూ కారణమయ్యాయంటే అతిశయోక్తి కాదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన బొబ్బిలిపులి, సర్ధార్ పాపారాయుడు చిత్రాలు చూస్తే దాసరి కలం బలం తెలుస్తుంది. నాటి సామాజిక, రాజకీయ కోణాలపై పదునైనా విమర్శలతో అనేక ప్రశ్నలు సూటిగా సంధిస్తారు. ఈ సినిమాల డైలాగుల వల్లే సెన్సార్ సంబంధమైన ఇబ్బందులూ ఎదుర్కొన్నారు. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు సమాజం, రాజకీయ వ్యవస్థపై ఆయనకున్న పట్టూ తెలుస్తుంది. బొబ్బిలిపులి, సర్దార్ పాపారాయుడు.. ఈ రెండు సినిమాల ప్రభావం ఎన్టీఆర్ రాజకీయ పార్టీకి ఎంత పెద్ద ప్లస్ అయిందో అందరికీ తెలిసిందే. ఆ టైమ్ లో ఎన్టీఆర్ అడవిరాముడ, వేటగాడు వంటి ఫక్తు కమర్షియల్ సినిమాలు చేస్తూ ఒక వర్గం ప్రేక్షకుల నుంచి విమర్శలూ ఎదుర్కొంటున్నారు. ఆ సమయంలో వచ్చిన ఈ చిత్రాలు మళ్లీ ఎన్టీవోడిని శిఖరంపై నిలబెట్టాయి.
దాసరికి తర్వాతి తరం స్టార్ హీరోలెవరూ పెద్దగా కలిసి రాలేదు. అందుకు ఉదాహరణ లంకేశ్వరుడు. అప్పటికే సుప్రీంహీరోగా వెలుగుతున్న చిరంజీవితో ఆయన తన వందో చిత్రంగా చేసిన లంకేశ్వరుడు ఫ్లాప్ అయింది. కారణం.. ఆయన చిరు స్టార్డమ్ కోసం కొంత రాజీపడ్డట్టు కనిపించడం. అది కథ, కథనాల్లో స్పష్టంగా కనిపిస్తుంది కూడా.. లంకేశ్వరుడు ఫ్లాప్ తర్వాత మరోసారి తనదైన శైలికే పరిమితమయ్యారు దాసరి. అయితే విజయం మాత్రం కొంత దూరమైందనే చెప్పాలి. అయితే తెలుగు సినిమా పరిశ్రమలో తొలిసారిగా సిండికేట్ నిర్మాణ పద్ధతిలో రూపొందిన అమ్మా రాజీనామా చిత్రంతో మరోసారి ఫామ్ లోకి వచ్చారు. ఇప్పుడు చూసినా మనసు చెమ్మగిల్లే ఈ సినిమా ఆయన దర్శకత్వ ప్రతిభకు మరో నిదర్శనం.
సినిమాల్లోకి రాకముందే దాసరి నాటక రచయిత, నటుడు. నాటకాల్లో ఎన్నో గొప్ప పాత్రల పోషించిన వ్యక్తి. ఆ నటన వెండితెరపైనా ప్రభావంతంగా చూపించాడు. ముఖ్యంగగా 90వ దశకంలో వచ్చిన సూరిగాడు చిత్రంలో దర్శక నటుడిగా, ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్ లో మామగారుగా ఆయన నటన అసమానం. అద్భుతమైన తన నటనతోనే ఆ రెండు సినిమాలనూ నిలబెట్టారు. అప్పటి వరకూ ఆయన నటుడిగా చాలా సినిమాల్లో కనిపించినా అవన్నీ ఒకెత్తు, ఈ రెండూ ఒకెత్తు.. అంటే అతిశయోక్తి కాదు.
ఇక తెలుగు సినిమా హిస్టరీలో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన మరో సినిమా ఒసేయ్ రాములమ్మా. ఈ సినిమాతో దాసరి కీర్తి శిఖరాన్ని తాకిందనే చెప్పాలి. అనన్యసామాన్యమైన కథాంశంతో విజయశాంతి ప్రధాన పాత్రలో దాసరి రూపొందించిన ఈ సినిమా తెలుగు సినిమా గమనాన్ని కొన్నాళ్ల వరకూ శాసించింది.
ఒసేయ్ రాములమ్మా కంటే ముందే వచ్చిన ఒరేయ్ రిక్షా మరో సంచలనం..ఆర్. నారాయణమూర్తి హీరోగా నటించిన ఈ సినిమా క్లాస్ మాస్ అన్నతేడా లేకుండా అన్ని సెంటర్స్ లోనూ అఖండ విజయం సాధించింది. అయితే ఈ చిత్రం పూర్తిగా నారాయణమూర్తి అప్పటి వరకూ సంపాదించుకున్న ఇమేజ్ మీదే రూపొందింది కావడం విశేషం. తర్వాత మరెన్నో సినిమాలు డైరెక్ట్ చేశారు. నటించారు. రచయితగా కథలనూ అందించారు. అయితే మరోసారి దాసరికి స్టార్ హీరోల చేదుగుళిక పరమవీర చక్ర రూపంలో తగిలింది. బాలకృష్ణతో చేసిన ఈ సినిమా దాసరి స్థాయిలో లేక అంచనాలు అందుకోలేకపోయింది. చివరగా చేసిన ఎర్రబస్సు సైతం అలరించలేదు. అయితే పవన్ తో సినిమా చేస్తానని ప్రకటించిన తర్వాత.. సడెన్ గా ఆరోగ్యం దెబ్బతింది. అది చిన్నదే అని అంతా అనుకున్నారు. కానీ ఈ లోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తను పుట్టిన మే నెలలోనే 30న హఠాత్తుగా కన్నుమూసి పరిశ్రమ మొత్తాన్ని శోక సంద్రంలో ముంచివేశారు.
- బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com