Lucky Baskhar Review : లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ

Lucky Baskhar Review  :  లక్కీ భాస్కర్ మూవీ రివ్యూ
X

రివ్యూ : లక్కీ బాస్కర్

తారాగణం : దుల్కర్ సాల్మన్, మీనాక్షి చౌదరి, సచిన్ ఖేద్కర్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ తదితరులు

ఎడిటర్ : నవీన్ నూలి

సంగీతం : జివి ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ : నిమేష్ రవి

నిర్మాతలు : నాగవంశీ, సాయి సౌజన్య

దర్శకత్వం : వెంకీ అట్లూరి

సితార బ్యానర్ లో సినిమా అంటే మాగ్జిమం ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే కథలే ఉంటాయి. అలాంటిదే ఇది కూడా అని రిలీజ్ కు ముందు నుంచే అనిపించిన సినిమా లక్కీ బాస్కర్. మళయాల స్టార్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ చిత్రంపై ముందు నుంచీ మంచి అంచనాలున్నాయి. ఆ అంచనాలను అందుకోవడానికి ఈ రోజు విడుదలైన లక్కీ బాస్కర్ ఎలా ఉందో చూద్దాం.

కథ :

1989 - 1992 మధ్య కాలంలో సాగే కథ లక్కీ బాస్కర్. బాస్కర్ (దుల్కర్) ఓ బ్యాంక్ ఎంప్లాయ్. మధ్య తరగతి వ్యక్తి. భార్య సుమతి (మీనాక్షి) కొడుకుతో పాటు పెళ్లికి ఎదిగిన చెల్లి, చదువుకునే తమ్ముడు, అనారోగ్యంతో బాధపడే తండ్రితో కలిసి ముంబైలోని సొంత ఇంట్లో ఉంటాడు. అతనికి వచ్చే జీతం ఇన్ని జీవితాలను నెట్టుకు రావడానికి సరిపోదు. అప్పులు చేస్తాడు. అవి తీర్చడంలో ఆలస్యం అవుతుంది. వాళ్లు అవమానిస్తారు. డబ్బుంటేనే గౌరవం అనే విషయం అర్థం అవుతుంది. అదే టైమ్ లో ఆంటోనీ( రాంకీ) అనే వ్యక్తి బాస్కర్ సాయం కోసం వస్తాడు. సాయం చేస్తే తనకు వచ్చే లాభాల్లో వాటా ఇస్తానంటాడు. ఆ వాటా పెద్దదే. దీంతో బ్యాంక్ లో కొంత డబ్బు దొంగతనంగా తీసి ఆంటోనీకి ఇస్తాడు. మళ్లీ బ్యాంక్ లోఅడ్జెస్ట్ చేస్తాడు. అప్పటి నుంచి బాస్కర్ లైఫ్ లో అనేక మార్పులు వస్తాయి. ఎంత అంటే ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి ఖాతాలో 100 కోట్లు ఉన్నాయని సిబిఐ వాళ్లు ఎంక్వైరీకి వచ్చేంత మార్పులు. అతను ఇంత డబ్బు ఎలా సంపాదించాడు. ఈ క్రమంలో బాస్కర్ ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటీ..? కుటుంబ పరంగా వచ్చిన ఇబ్బందులేంటీ.. అతను అరెస్ట్ అయ్యాడా లేదా అనేది మిగతా కథ.

ఎలా ఉంది.. :

1990లలో భారతదేశాన్ని కుదిపేసిన పెద్ద కుంభకోణాల్లో హర్షద్ మెహతాది ఒకటి. చదువుకున్న వాళ్లకే సరిగా అర్థం కాని.. షేర్ మార్కెట్ ను తన తెలివి తేటలతో షేక్ చేసి వేల కోట్ల ధనం సంపాదించిన అతని కోణంలో సాగే కథ ఇది. హర్షద్ మెహ్రా అని పేరు మార్చారీ సినిమాలో. కథకు ఓ దశలో సెంటర్ పాయింట్ అతనే అయినా ఫేస్ కనిపించకుండా మంచి స్క్రీన్ ప్లే అల్లుకున్నాడు దర్శకుడు. బ్యాంకింగ్ సెక్టర్ లో జరిగే అనేక అక్రమాలను సామాన్యులకూ బాగా అర్థం అయ్యేలా సింపుల్ ఫై చేసిన కథనం మెప్పిస్తుంది. ఇప్పటికీ షేర్ మార్కెట్స్ గురించి చాలామందికి తెలియదు. అలాంటి అంశాన్ని కథగా తీసుకున్నప్పుడు బలమైన నేపథ్యం కూడా తోడైతే బావుంటుంది కదా. అది హర్షద్ మహతా రూపంలో వచ్చింది. కేవలం మూడేళ్ల కాలంలోనే కథా నాయకుడు 100 కోట్లు సంపాదించడం వెనక అతను నైతికంగా ఎంత దిగజారినా.. ‘ఇండియాలో వస్తువు కావాలంటే డబ్బుతో కొనుక్కోవాలి. రెస్పెక్ట్ కావాలంటే ఆ డబ్బు మన ఒంటిపై కనిపించాలి’ అనే తత్వం తెలిసిన వాడుగా తను ఏం చేసినా సబబే అని సమర్థించుకుంటాడు. కానీ రోజులు ఒకేలా ఉండవు కదా. అవే అతని జీవితంలో సమస్యలు తెస్తాయి. చివరికి తండ్రి వల్ల ఓ రోజు జూదం ఆడటం తప్పు కాదు.. ఎప్పుడు ఆపాలో తెలసుకోకపోవడం తప్పు అనే ఉద్బోధతో మారతాడు. మరోవైపు డబ్బు తెచ్చిన అహంకారం వల్ల ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య దూరం జరుగుతుంది. ఇవన్నీ కలిపి తను చేసే తప్పుడు ఆటను ఆపేస్తాడు. ఆ తర్వాతా వచ్చిన సమస్యల నుంచి ఎలా బయట పడ్డాడు అనేది సినిమాలోనే చూడాలి. ఆ చివరి 20 నిమిషాలు మాత్రం గూస్ బంప్స్ తెప్పించే సీన్స్ ఉంటాయి.

చిన్న చిన్న డైలాగ్స్ తో బాగా ఆకట్టుకున్నాడు వెంకీ అట్లూరి. క్యారెక్టర్ డ్రైవెన్ స్టోరీలా పూర్తిగా దుల్కర్ చుట్టే తిరుగుతుంది. మొదట్లోనే అతను తన పాత్రను, ఫ్యామిలీని పరిచయం చేస్తూ దాదాపు ఐదు నిమిషాలకు పైగా డైలాగ్స్ తోనే అంతా చెప్పేస్తుంటాడు. సినిమాలో చాలా వరకూ దుల్కర్ చెబుతుంటే మనం వింటున్నాం అన్నట్టుగా ఉంటుంది. ఇలాంటి సంక్లిష్టమైన కథలను సరళతరం చేయాలంటే ఇదో టెక్నిక్ కూడా. హీరోలు తప్పులు చేసినా ఒప్పుకుంటోన్న ప్రేక్షకులున్నారు కాబట్టి ఈ కథ ఖచ్చితంగా అన్ని వర్గాలకూ నచ్చుతుంది.

నటన పరంగా దుల్కర్ కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండే. మీనాక్షి ది బెస్ట్ అనిపించుకుంది. ఆచిన్న పిల్లాడూ బాగా చేశాడు. రాంకీ పాత్ర, నటన బాగా ఆకట్టుకుంటుంది. హీరో ఫ్రెండ్ గా రాజ్ కుమార్ క్యారెక్టరైజేషన్ బావుంది. సచిన్ ఖేద్కర్, టినూ ఆనంద్ వల్ల ఆ పాత్రలకు స్టేచర్ పెరిగింది. ఇతర పాత్రలన్నీ కథకు ఎంత వరకు అవసరమో అంత వరకే అన్నట్టుగా ఉన్నాయి.

టెక్నికల్ గా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం హైలెట్. పాటలు, నేపథ్య సంగీతం రెండూ ఆ కాలానికి తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బావుంది. ఓల్డ్ బాంబేనే చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. డైలాగ్స్ చాలా బావున్నాయి. కాస్ట్యూమ్స్, సెట్స్, ఆర్ట్ వర్క్ బావున్నాయి. దర్శకుడుగా వెంకీ అట్లూరి టఫ్ కంటెంట్ ను తీసుకున్నా సింపుల్ గా చెప్పాడు. దీంతో ఈ అర్థం కాని కథను అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగాడు.

ఫైనల్ గా : లక్కీ పటాస్

రేటింగ్ : 3.25 / 5

- బాబురావు. కామళ్ల

Tags

Next Story