'మా' బరిలోకి మరొకరు..

'మా' ఎన్నికల వ్యవహారం మరింత రసవత్తరంగా మారనుంది. సీనియర్ న్యాయవాది, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సివిఎల్ నరసింహారావు 'మా' ఎన్నికల బరిలో తానూ ఉన్నట్లు ప్రకటించారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ఆదివారం ప్రకటించారు.
తెలంగాణ మనోభావాలను తెలియజేస్తూ, సివిఎల్ రావు ఈ ప్రాంతానికి చెందిన కళాకారులను సినీ పరిశ్రమలో ఎలా నిర్లక్ష్యం చేస్తున్నారో వివరించారు. నా ఎజెండా తెలంగాణ సెంటిమెంట్. తెలంగాణ కళాకారులకు తీవ్ర అన్యాయం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుండి వచ్చిన పేద మరియు అట్టడుగు కళాకారులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతానని నటుడు రావు చెప్పారు.
అయితే ఎలక్షన్లు జరగడానికి ఇంకా మూడు నెలలు టైమ్ ఉంది. ఈలోపు ఎంత మంది పేర్లైనా తెర మీదకు వచ్చే అవకాశం ఉంది. చివరికి మిగిలేది ఎవరు అనే విషయం ఎన్నికలు సమీపించే వరకు తెలియదు. ఇక ప్యానల్‌కు సంబంధించిన పేర్లను ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ మాత్రమే ప్రకటించారు. జీవిత, మంచు విష్ణ, హేమ తదితరులు ప్రకటించలేదు.
గతంలో 'మా' పరిస్థితి వేరు..
పాతికేళ్ల క్రితం ఏర్పడిన 'మా' ప్రారంభించినప్పుడు సినీ పెద్దలంతా ప్యానల్‌లో ఎవరు ఉన్నా లేకపోయినా అధ్యక్ష పదవి మాత్రం ఏకగ్రీవ ఒప్పందంతో జరిగేది. చాలా కాలం ఈ పద్దతి కొనసాగింది. అందుకు దర్శకరత్న దాసరి నారాయణ రావు కారణం. ఆయన మాటకు విలువిచ్చి అందరూ ఒకమాట మీద నిలబడి అధ్యక్షుడిని ఎన్నుకునేవారు. ఆ విధంగానే మురళీ మోహన్‌తో పాటు మరికొంత మంది ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారి అధ్యక్ష పదవికి హేమా హేమీలంతా పోటీపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com