Ramesh Babu: 'నువ్వే నా బలం.. నువ్వే నా ధైర్యం..' సోదరుడిపై మహేశ్ ఎమోషనల్ పోస్ట్..

Ramesh Babu: ఘట్టమనేని రమేష్‌బాబుకు కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. మహాప్రస్థానంలో అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రమేష్‌బాబు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. ఇవాళ ఉదయం పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోకి తరలించారు. అక్కడ తండ్రి కృష్ణ, కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పించారు. అనంతరం మహా ప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించారు.
1965, అక్టోబర్ 13న చెన్నైలో జన్మించిన రమేష్‌బాబు.. 1974లో బాలనటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. తండ్రి కృష్ణ, సోదరుడు మహేష్‌బాబుతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. 1997 నుంచి నటనకు దూరంగా ఉన్న రమేష్‌బాబు 2004లో నిర్మాతగా మారారు. రమేష్‌బాబు మొత్తం 15 చిత్రాల్లో హీరోగా నటించారు. రమేష్‌బాబుకు భార్య మృదుల, పిల్లలు భారతి, జయకృష్ణ ఉన్నారు.
'నువ్వే నా స్ఫూర్తి, నువ్వే నా బలం, నువ్వే నా ధైర్యం, నువ్వే నా సర్వం. నువ్వు లేకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. నువ్వు నాకోసం చేసినవాటికి చాలా థాంక్యూ. నా జీవితంలో ఇప్పటివరకు, ఇకపై నాకు ఉండే అన్నయ్య నువ్వు ఒక్కడివే. ఎప్పటికీ లవ్ యూ.' అంటూ మహేశ్ బాబు తన అన్నయ్య రమేశ్ బాబు గురించి ఒక ఎమోషనల్ పోస్ట్‌ను షేర్ చేశారు.
— Mahesh Babu (@urstrulyMahesh) January 9, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com