Malavika Moahanan : శృతి హాసన్.. నా ఆఫర్ కొట్టేసింది

ఒకరి ఆఫర్స్ మరొకరికి వెళ్లడం ఇండస్ట్రీలో కామన్. డేట్స్ వల్ల, టైమింగ్ వల్ల, టాలెంట్ వల్ల కూడా ఆఫర్స్ మారుతుంటాయి. కొన్నిసార్లు సహజంగా అనిపిస్తే మరికొన్నిసార్లు ఎవరో కావాలని ఒకరి ఆఫర్ ను కొట్టేసిన సందర్భాలూ చూస్తుంటాం. ఇది అలాంటిది కాదు కానీ.. తను చేయాల్సిన సినిమాను శృతి హాసన్ చేస్తోందని ఫీల్ అవుతోంది సోషల్ మీడియా హాట్ బ్యూటీ మాళివిక మోహనన్. ప్రస్తుతం ప్రభాస్ తో రాజా సాబ్ లో మెయిన్ లీడ్ చేస్తోన్న ఈ మళయాలీ ముద్దుగుమ్మ తన ఆఫర్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుని బాధపడింది. కానీ తను చెప్పింది చూస్తే అంత బాధపడాల్సిందేం లేదు అనిపిస్తుంది.
కోలీవుడ్ లో రెండో సినిమాకే టాప్ డైరెక్టర్ అనిపించుకున్నాడు లోకేష్ కనకరాజ్. ప్రస్తుతం లోకేష్ వర్స్ అనేది క్రియేట్ చేసి వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అతను కొన్నాళ్ల క్రితం దళపతి విజయ్ తో మాస్టర్ అనే మూవీ చేశాడు. ఆ మూవీలో హీరోయిన్ గా మాళవిక మోహనన్ నటించింది. ఆ టైమ్ లోనే లోకేష్ తను రజినీకాంత్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడట. ఆ సినిమాలో రజినీకాంత్ కూతురు పాత్రను మాళవికకు ఆఫర్ చేశాడట. ఈమె కూడా ఓకే చెప్పింది. కానీ సడెన్ గా కోవిడ్ పాండమిక్ రావడంతో ప్రాజెక్ట్ ఆగింది. ఈ లోగా లోకేష్ విక్రమ్, లియో వంటి మూవీస చేశాడు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు రజీనీకాంత్ తో కూలీ అనే సినిమా చేస్తున్నాడు లోకేష్.
కూలీలో శృతి హాసన్ నటిస్తోందని అందరికీ తెలుసు. అయితే ఈ పాత్ర తనదే కావొచ్చు అని ఫీల్ అవుతోంది మాళవిక. ఇప్పటి వరకూ శృతి హాసన్ రజినీకాంత్ కు కూతురుగా నటిస్తోందనే వార్తలు ఎక్కడా రాలేదు. అయినా పాత్రల్లో చిన్న చిన్న మార్పులు కూడా సహజమే కదా. అలా చూస్తే ఇది అదే అనడానికీ లేదు. అయినా మాళవిక ఏమైనా హీరోయిన్ రోల్ మిస్ అయిందా.. అంత ఫీలవడానికి అంటున్నారు జనం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com