Manchu Vishnu: కూతుళ్లను వెండితెరకు పరిచయం చేయనున్న మంచు విష్ణు..

Manchu Vishnu: ప్రస్తుతం టాలీవుడ్‌లోని చాలామంది నటీనటుల వారసులు వెండితెరపై తెరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొందరు కీలక పాత్రలతో, కొందరు పాటల్లో గెస్ట్ రోల్‌తో.. ఇలా ఇప్పటికే కొందరి స్టార్ హీరోల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. తాజాగా మంచు విష్ణు కూడా త్వరలోనే తన కూతుళ్లను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నట్టు సమాచారం.
కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న విష్ణు.. ప్రస్తుతం 'గాలి నాగేశ్వర రావు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ విరామం లేకుండా సాగుతోంది. టాకింగ్ పార్ట్ షెడ్యూల్స్‌ను పూర్తి చేసి సాంగ్స్ షూటింగ్‌లో బిజీగా ఉంది మూవీ టీమ్.
తాజాగా గాలి నాగేశ్వర రావు నుండి ఓ క్రేజీ అప్డేట్ బయటికొచ్చింది. మంచు విష్ణు కూతుళ్లు అరియనా, వివియానా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌ను పాడారట. అంతే కాకుండా ఈ పాట సినిమాకే హైలెట్ అని టాక్. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో మంచు విష్ణు కూతుళ్లు పాడిన పాటకు భాస్కరభట్ల లిరిక్స్‌ను అందించారు. హీరోగా పాపులర్ అయిన విష్ణు.. తన కూతుళ్లను సింగర్స్‌గా ప్రేక్షకులకు పరిచయం చేయనున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com