ఎవరో చెబితే ఎన్నికల నుంచి తప్పుకుంటా: మంచు విష్ణు

ఎవరో చెబితే ఎన్నికల నుంచి తప్పుకుంటా: మంచు విష్ణు
అధ్యక్ష బరిలో తానూ ఉన్నానని ప్రకటించిన మంచు విష్ణు తాజాగా ఈ ఎన్నికకు సంబంధించి ఓ వీడియో చేశారు.

మరో మూడు నెలల్లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి అధ్యక్ష బరిలో నిలబడేందుకు పలువురి ప్రముఖుల పేర్లు వినిపించాయి. గత కొన్ని రోజులుగా దీనికి సంబంధించిన సమాచారం గోప్యంగా ఉంచినా.. అధ్యక్ష బరిలో తానూ ఉన్నానని ప్రకటించిన మంచు విష్ణు తాజాగా ఈ ఎన్నికకు సంబంధించి ఓ వీడియో చేశారు.

విష్ణు మాట్లాడుతూ " మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఒక కుటుంబం. అందులో 900 మంది ఉన్నారు. పెద్దలంతా కలిసి ఎవరినైనా ఒకరిని నిలబెట్టి ఇతడే అధ్యక్షుడు అని చెబితే నేను ఎన్నికల నుంచి తప్పుకుంటాను. ఒకవేళ వాళ్లంతా ఏకగ్రీవంగా ఎవరినీ ఎన్నుకోలేకపోతే తాను పోటీకి సిద్ధం అని అంటున్నారు. పెద్దల్ని గౌరవిస్తాను, వాళ్ల సలహా తీసుకుంటాను అని అన్నారు మంచు విష్ణు. పదవుల్లో ఉన్నా లేకపోయినా పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా నేను, నా కుటుంబం వారికి అండగా నిలుస్తూనే ఉందని చెప్పారు విష్ణు.

ప్రతి ఎన్నికల్లో 'మా' భవనం ప్రధాన అజెండాగా మారుతోంది. అందుకే భవన నిర్మాణానికి అయ్యే ప్రతి పైసా నేనే ఇస్తా.. నేను నా కుటుంబం కలిసి భవనాన్ని నిర్మిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇకపై నటులకి ఎదురవుతున్న సమస్యల మీదే దృష్టి పెట్టాలన్నారు. ఇంతకు ముందు అధ్యక్షులంతా 'మా' కోసం నిస్వార్థంగా పని చేశారు. ఏవైనా చిన్న చిన్న తప్పులు జరిగి ఉండొచ్చు.

కానీ అవేవీ ఉద్దేశ్యపూర్వకంగా చేసినవి కావని అనుకుంటున్నా. గతాన్ని తవ్వుకోకుండా మంచి పనులు ఎలా చేయాలో ఆలోచిద్దాం. సినిమాల్లో నటిస్తున్న అందరినీ సభ్యులుగా చేయాలి. 'మా'కుటుంబాన్ని మరింతగా విస్తరించి ప్రతి నిర్మాణ సంస్థకి ప్రాధాన్యత ఇవ్వాలని ఓటీటీ వేదికని కోరాలి. 'మా' బలపడాలి, నిర్మాతలకి సహకరించాలి అని అన్నారు మంచు విష్ణు.

Tags

Read MoreRead Less
Next Story