Raveena Tandon: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. సోదరుడితో సంబంధంపై రవీనా కామెంట్..
Raveena Tondon: తెర వెనుక ముఖానికి రంగు పూసుకుని తెరపై నవ్వులు చిందించే తారలంతా వెండితెర వేలుపులేనా.. అడుగడుగునా అవమానాలు, మనసుని బాధించే మాటలు.. అన్నింటిని తట్టుకుని నిలబడాలంటే ఆత్మస్థైర్యం మెండుగా ఉండాలి.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి రవీనా టాండన్ తనకు ఇండస్ట్రీలో ఎదురైన అనుభవాలను వివరించింది.
ఆకాశ వీధిలో, పాండవులు పాండవులు తుమ్మెద వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన రవీనా బాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది. నటిగా నిలదొక్కుకుంటున్న సమయంలో కోస్టార్స్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు పత్రికలు రాసుకొచ్చేవి.. అది మనసుని చాలా బాధించేది. అసలు అలా ఎలా రాస్తారు..
ఒకానొక సమయంలో అయితే తన సోదరుడితో కూడా రిలేషన్ అంటగట్టారు. దానికి తానెంతో కృంగిపోయాను అని చెప్పింది. అప్పట్లో జర్నలిస్టుల దయతోనే నటీనటులు ఉండేవారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది రవీనా.
ప్రతి నెలా సినిమా మ్యాగజైన్లు విడుదలవుతున్నాయంటే భయంగా ఉండేది. వాటిల్లో తన గురించి ఏ రాశారో అని ఆ మ్యాగజైన్లు తెప్పించుకుని చదివే వరకు నిద్ర పట్టేది కాదని చెప్పుకొచ్చింది. లేనిపోనివి కల్పించి రాయడంతో కృంగిపోయేదాన్నని.. దాంతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని తెలిపింది.
కొన్ని పుకార్లు నా తల్లిదండ్రులను మరింత క్షోభకు గురిచేశాయి. ఓసారి షూటింగ్‌కు డ్రాప్ చేయడానికి నా సోదరుడు వచ్చాడు. అందమైన అబ్బాయితో రవీనా టాండన్.. బాయ్‌ఫ్రెండ్‌ని కనిపెట్టాం అని స్టార్‌డస్ట్ రాసుకొచ్చింది. అలా ఎలా రాస్తారు.. ఎవరో తెలుసుకోకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తారు.. మేమూ మనుషలమే.. మాకూ మనసుంటుంది.. రాసేముందు ఒక్కసారి కూడా ఆలోచించరా అని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు జరిగిన చేదు సంఘటనలను గుర్తు చేసుకుంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com