Viswak Sen : మెకానిక్ రాకీ సాంగ్.. అదరగొట్టిన అశోక్ తేజ

విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తోన్న ఈ మూవీ ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్లపూడి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు. జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందించిన ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. దీనికంటే ముందే విడుదలైన ప్రోమోతో ఇదో మంచి ఫోక్ బీట్ తో ఉంటుందని ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. అందుకు తగ్గట్టుగానే పాటను సుద్దాల అశోక్ తేజతో రాయించారు.. మంగ్లీతో పాడించారు.
కొన్ని పాటలు వినగానే ఆకట్టుకుంటాయి. కొన్ని వినగానే ఓకే అనిపించి.. తర్వాత అడిక్ట్ అయిపోయేలా ఉంటాయి. ఇది ఈ రెండో కోవకు చెందిన పాటలా కనిపిస్తోంది. వినగానే మొదట ఓకే అనిపించిస్తుంది. బట్ రెండు మూడుసార్లు వింటే సద్దాల అశోక్ తేజ కలం చమత్కారం ఆకట్టుకుంటుంది. నిజంగా ఈ మధ్య కాలంలో ఒక హీరోయిన్ మనసు పారేసుకున్న వాడిపై తన ఫీలింగ్స్ ను ఎక్స్ ప్రెస్ చేస్తూ ఇంత మంచి సాహిత్యంతో పాట రాలేదు. అశోక్ తేజ శైలిలో ఉంటూనే అక్కడక్కడా బూతు ధ్వనించని శృంగారాత్మక పద బంధాలు భలే అనిపిస్తాయి.
‘‘నడుము గీరుకుంటు వడ్డాణమై ఉంటడే, గదవ కింద గంధామైతడే.. పైటా జారకుండా పిన్నీసైతడే, రైకలు ఊరడించ హుక్కులుంటడే..’’ అంటూ తెలంగాణ మాండలిక పద ప్రయోగాలో అశోక్ తేజ సాహిత్యం ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ‘‘ గుల్లానైతిరో నేను రసగుల్లానైతిరో.. ఖల్లాస్ అయితే కల్లు గిలాసైతరో.. ’’ అనే పదాలు అశోక్ తేజకే సాధ్యం అయ్యే చమత్కారాల్లా ఉన్నాయి.
మొత్తంగా కొన్నాళ్ల పాటు వేడుకల్లో వినిపించే పాట అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయీ పాటకు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com