కేరళ కోసం మెగా విరాళం

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ లో జరిగిన ప్రకృతి ప్రకోపానికి ఆ ప్రాంతం అంతా అల్ల కల్లోలం అయిపోయింది. అర్థరాత్రిపూటి కొండ చరియలు విరిగిపడటంతో వందల మంది మృత్యువాత పడ్డారు. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు.ఊళ్లకు ఊళ్లే కనుమరుగైపోయాయి. సింపుల్ గా చెబితే అంతులేని విషాదానికి చిరునామాలా మారింది ఆ ప్రాంతం. ఎక్కడ ఏం జరిగినా అంతా మనవాళ్లే అని స్పందించడంలో టాలీవుడ్ ఎప్పుడూ ముందే ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ కేరళ సిఎమ్ రిలీఫ్ ఫండ్ కు తమ విరాళాలను అందజేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించాడు.
వయనాడ్ బాధితుల కోసం ఆయన తనవంతుగా 1 కోటి రూపాయల విరాళం ప్రకటించి మరోసారి తన మెగా మనసు చాటుకున్నాడు. ఇప్పటి వరకూ టాలీవుడ్ నుంచి ఇంత పెద్ద మొత్తం ఎవరూ డొనేట్ చేయలేదు. కేరళతో తనకు ఉన్న అనుబంధాన్ని దృష్టిలో ఉంచుకునే మెగాస్టార్ ఇంత పెద్ద మొత్తంలో సాయం చేశాడు.
ఆయనతో పాటు ఇంకా చాలామంది కేరళ కోసం కదిలి వస్తున్నారు. ఈ ఆదివారం రోజే అల్లు అర్జున్ కూడా 25 లక్షల విరాళం ప్రకటించాడు. అల్లు అర్జున్ ను కేరళీయన్స్ తమ సొంత స్టార్ లా చూసుకుంటారు. అతన్ని అక్కడ ఏకంగా మల్లూ అర్జున్ అని పిలుచుకుంటారు.అందుకే ఐకన్ స్టార్ కూడా తన వంతుగా స్పందించాడు. ఏదేమైనా ఈ ఘోర విపత్తు నుంచి దేవ భూమిగా చెప్పుకునే కేరళ అలాగే వయనాడ్ త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com