Mehreen Pirzada: అన్నీ తెలిసే ఈ రంగంలోకి.. రాత్రికి రాత్రే మా జీవితాలు..: మెహ్రీన్ ఎమోషన్ పోస్ట్

Mehreen Pirzada: ఆర్టిస్టుల జీవితాలు అందరూ అనుకున్నంత అందంగా ఏమీ ఉండవు.. మొహానికి రంగులు పూసుకుని, లేని నవ్వుని తెచ్చి పెట్టుకుని అంతా ఆర్టిఫిషియల్ లైఫ్.. దూరం నుంచి చూస్తే చాలా బావుంటుంది.. కానీ దగ్గరకు వస్తేనే అసలు విషయం తెలుస్తుంది. అన్నీ తెలిసే ఈ రంగంలోకి అడుగు పెడతాం అని టాలీవుడ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఎమోషన్ స్టోరీని పోస్ట్ చేసింది. ఆ స్టోరీ అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఒక సెలబ్రిటీ జీవితంలో ఎదురయ్యే కష్టాల గురించి, ఒత్తిళ్ల గురించి రాసుకొచ్చింది. డబ్బు, పేరు అన్నీ ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ అది ఎప్పుడూ సంతోషాన్ని ఇవ్వదు.
ఓ నటి అందంగా కనిపించడం కోసం కఠినమైన వ్యాయామాలు చేయవలసి ఉంటుంది. తినే ఫుడ్ లో కంట్రోల్ ఉండాలి. షూటింగ్ అర్ధరాత్రి, అపరాత్రి ఉన్నా వెళ్లాలి. బంధువులకు, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండవలసి వస్తుంది. కొన్ని ఇబ్బందికరమైన ప్రదేశాల్లో పని చేయవలసి వస్తుంది.
ఆర్టిస్టులకు తమ ఆసక్తితో పని లేదు. పగలు, రాత్రి, ఏ సీజన్‌లోనైనా పని చేయాల్సి ఉంటుంది. ఇది తమ ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఆమె గుర్తు చేసుకున్నారు.
ఆర్టిస్టుల జీవితాల్లో ఎత్తుపల్లాలు కామన్, రాత్రికి రాత్రే జీవితాలు మారిపోతుంటాయి. సినిమా హిట్ అయితే వరుస ఆఫర్లు.. ప్లాప్ అయితే ఎవరూ మొహం చూడరు. అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలి. విజయం దక్కిందని సంతోషపడే లోపే వైఫల్యం ఎదురవుతుంటుంది. అవన్నీ తెలిసి కూడా ఈ రంగాన్ని ఎంచుకుంటాం అని మెహ్రీన్ తన పోస్టులో రాసుకొచ్చింది.
కాగా, మెహ్రీన్ నటించిన ఎఫ్ 3 మే 27న రిలీజ్ కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ నటించారు. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూర్చగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com