Movies in 2022: బాలీవుడ్‌‌ని షేక్ చేసిన సౌత్ సినిమా.. ఈ ఏడాది టాప్-10 చిత్రాల జాబితాలో..

Movies in 2022: బాలీవుడ్‌‌ని షేక్ చేసిన సౌత్ సినిమా.. ఈ ఏడాది టాప్-10 చిత్రాల జాబితాలో..
X
సౌత్‌ సినిమానా మజాకా..! టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్‌ దెబ్బకు.. బాలీవుడ్‌ మొత్తం షేక్‌ అయిపోయింది.

Top 10 Movies in 2022: సౌత్‌ సినిమానా మజాకా..! టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్‌వుడ్‌ దెబ్బకు.. బాలీవుడ్‌ మొత్తం షేక్‌ అయిపోయింది. ఈ ఏడాది షో మొత్తం సౌత్‌ ఇండియన్‌ సినిమాలదే. ఇండియన్‌ సినిమాల్లో ఈ ఏడాది టాప్‌-10లో నిలిచిన చిత్రాల జాబితాను IMBD విడుదల చేసింది. మొదటి పదింటిలో ఏకంగా తొమ్మిది సినిమాలు దక్షిణాదికి చెందినవే. అందులోనూ ట్రిపుల్‌ఆర్ సినిమా అత్యధిక రేటింగ్స్‌ సంపాదించి ఫస్ట్‌ ప్లేస్ దక్కించుకుంది.


తెలుగు నుంచి మూడు సినిమాలు, కన్నడం నుంచి మూడు, తమిళం నుంచి మూడు సినిమాలు లిస్ట్‌ అయ్యాయి. టాప్‌-10లో బాలీవుడ్‌ నుంచి కేవలం ది కాశ్మీరీ ఫైల్స్‌ సినిమా మాత్రమే నిలిచింది. కశ్మీరీ ఫైల్స్‌పై కంట్రవర్సీలు ఉన్నా.. 350 కోట్లు వసూలు చేయడంతో ఈ సినిమాను టాప్‌-10 జాబితాలో చేర్చారు.


అత్యధిక ప్రజాధరణ పొందిన చిత్రాలు, ఎక్కువ కలెక్షన్స్‌ సాధించిన సినిమాలను లిస్ట్‌ తీసింది IMBD. ఇందులో ట్రిపుల్‌ ఆర్‌కు మొదటి స్థానం దక్కగా.. కాశ్మీరీ ఫైల్స్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాసిన K.G.F: Chapter 2 సినిమా మూడో స్థానంలో నిలిచింది. ఒక కన్నడ సినిమా ఈ రేంజ్‌ కలెక్షన్స్‌ సాధించడం చరిత్రలోనే మొదటిసారి.


కన్నడ చిత్రసీమకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. భారతీయ చిత్ర పరిశ్రమ గర్వించేలా అద్భుతమైన సినిమాలు నిర్మించింది. అందులోంచి వచ్చిన మరో ఆణిముత్యం లాంటి సినిమా కాంతారా. కన్నడ నుంచి వచ్చిన సినిమాల్లో విశేషంగా చెప్పుకోవాల్సిన మరో సినిమా 777 చార్లి. కలెక్షన్స్‌ గట్రా పక్కన పెడితే.. ఈ సినిమాకు కనెక్ట్‌ అయిన వారు కోట్లలో ఉన్నారు. మనిషికి, శునకానికి ఉన్న బాంధవ్యాన్ని ఇందులో హృద్యంగా చూపించారు. మరీ ముఖ్యంగా కుక్కతో కూడా నటనను పలికించిన తీరు అత్యద్భుతం.


ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆర్ఆర్ఆర్‌తో పాటు మేజర్, సీతారామం సినిమాలకు టాప్‌-10లో స్థానం దక్కాయి. కాకపోతే, అనూహ్య విజయం సాధించిన కార్తికేయ-2 మాత్రం ఎందుకనో ఈ లిస్టులో లేదు. ఓ మంచి లవ్‌స్టోరీగా తెరకెక్కిన సీతారామం, ముంబై దాడులను మరో కోణంలో చూపించిన మేజర్‌ సినిమాలకు మాత్రం క్రెడిట్ దక్కింది.

తమిళం నుంచి మూడు సినిమాలు టాప్‌-10లో స్థానం దక్కించుకున్నాయి. విశ్వనటుడు కమల్‌హాసన్‌ నటించిన విక్రమ్ సినిమా ఏకంగా 300 కోట్ల రూపాయల కలెక్షన్స్‌ కొల్లగొట్టింది. కమల్‌హాసన్‌ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్‌ హిట్.


తమిళ ఇండస్ట్రీ నుంచి టాప్‌లో నిలిచిన సినిమాల్లో పొన్నియిన్ సెల్వన్ కూడా ఒకటి. నిజానికి ఈ సినిమా తమిళులకు మాత్రమే ఎక్కింది. మణిరత్నం కలల ప్రాజెక్ట్‌గా, తమిళ ప్రైడ్ స్టోరీగా తెరకెక్కిన ఫస్ట్‌ పార్ట్‌ ఘనమైన వసూళ్లు సాధించింది. అందుకే IMBD లిస్టులో చేరింది.


ఇక ఈ జాబితాలో చెప్పుకోవాల్సిన మరో తమిళ మూవీ.. రాకెట్రీ. ఇస్రో మాజీ ఛైర్మన్‌ నంబియార్‌ జీవిత కథను సినిమా కోణంలో అందరూ మెచ్చేలా తీశారు. హీరో మాధవన్ ఎంతో కష్టపడి, తానే డైరెక్ట్ చేసిన బయోపిక్ ఇది. కలెక్షన్లు పక్కన పెడితే.. ఎక్కువ మంది మెచ్చిన సినిమాగా రాకెట్రీకి టాప్‌-10లో స్థానం ఇచ్చారు.


మొత్తానికి బాలీవుడ్‌ సినిమా ఈ ఏడాది పూర్తిగా డీలా పడింది. కంటెంట్‌ పరంగా చూసినా, ప్రజంటేషన్‌ పరంగా చూసినా.. నార్త్‌తో పోల్చితే సౌత్‌దే డామినేషన్.

Tags

Next Story