MULTIPLEX: మల్టీప్లెక్సుల్లో మద్యం దుకాణాలు...?

కరోనా సంక్షోభం తర్వాత సామాన్యుడి వినోదం దిశ మారింది. ఒకప్పుడు థియేటర్‌కు వెళ్లి సినిమా చూడటం మధ్యతరగతి కుటుంబాలకు వేడుకగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి మృగ్యమైంది. ఆకాశాన్నంటుతున్న టికెట్ ధరలు, పార్కింగ్ ఫీజులు, వీటికి తోడు మల్టీప్లెక్సుల్లో తిండి పదార్థాల ధరలు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. ఫలితంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు థియేటర్ల కంటే ఓటీటీలకే మొగ్గు చూపుతున్నారు. ఇటీవల నటుడు శివాజీ సైతం ఇదే విషయంపై గళమెత్తారు. "ఒక కాఫీ ధర రూ. 350 ఉండటం ఏంటి? ఆ ధరతో ఇంటిల్లిపాదీ కాఫీ తాగొచ్చు. ఇంతటి దోపిడీ ఉంటే ప్రజలు థియేటర్లకు ఎలా వస్తారు?" అని ఆయన ప్రశ్నించారు. పాప్‌కార్న్, సమోసా, కూల్ డ్రింక్స్ ధరలు టికెట్ ధర కంటే రెట్టింపు ఉండటం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒక చిన్న కుటుంబం సినిమాకు వెళ్లాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు, మల్టీప్లెక్సుల్లో మద్యం కౌంటర్లు ఏర్పాటు చేసేందుకు అసోసియేషన్లు ప్రయత్నిస్తున్నాయన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వినోదం పేరుతో సామాన్యుడిని దోచుకోవడమే కాకుండా, కుటుంబాలతో వచ్చే థియేటర్ల వాతావరణాన్ని దెబ్బతీసే ఇలాంటి నిర్ణయాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రేక్షకులు కోరుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

