తెలుగు సినిమాకు 'తమన్' తప్ప వేరే దిక్కు లేదా..?

తెలుగు సినిమాకు తమన్ తప్ప వేరే దిక్కు లేదా..?
తెలుగులో సంగీత దర్శకుల కొదవ ఉంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు ఆ స్థాయి సంగీతం ఇవ్వడానికి సరైన వాళ్లు లేరనే చెప్పాలి.

Taman: తెలుగులో సంగీత దర్శకుల కొదవ ఉంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలకు ఆ స్థాయి సంగీతం ఇవ్వడానికి సరైన వాళ్లు లేరనే చెప్పాలి. కీరవాణి.. రాజమౌళికే ఫిక్స్ అయ్యాడు. దేవీశ్రీ ప్రసాద్ ఫామ్ కోల్పోయినట్టు కనిపిస్తున్నాడు. తమన్ మాత్రమే హవా చేస్తున్నాడు. ఈ టైమ్ లో ఆ వాక్యూమ్ ఫుల్ ఫిల్ చేయడానికి మరో సంగీత దర్శకుడి కోసం టాలీవుడ్ ఎదురుచూస్తోన్న వేళ అనిరుధ్ పేరు టాప్ హీరోల సినిమాల కోసం వినిపిస్తోందిప్పుడు.

ఒకప్పుడు తెలుగు సినిమా సంగీతం సౌత్ మొత్తానికే కళ్లు కుట్టేలా విరాజిల్లింది. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆ మాటకొస్తే నాణ్యమైన సంగీతం కూడా పెద్దగా వినిపించడం లేదు. ప్రస్తుతం కొంత వరకూ ఓకే అనిపిస్తోన్నా.. ఇతర పరిశ్రమలతో పోలిస్తే మన దగ్గర తక్కువగానే ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. మరోవైపు ఒక బ్లాక్ బస్టర్ లో భాగస్వామి అయితే ఇక అతని వెనకే పరుగులు పెట్టడం వంటి చెడు అలవాటు కూడా తెలుగు పరిశ్రమలో కనిపిస్తుంది. టాప్ స్టార్స్ అయితే కొత్తవారి వైపు పెద్దగా చూడరు.

కొన్నాళ్లుగా కీరవాణి పోటీ నుంచి తప్పుకున్నాడు. ప్రధానంగా దేవీ శ్రీ ప్రసాద్, తమన్ మధ్య కాంపిటీషన్ కొనసాగుతోంది. ఒకప్పుడు తమన్ ను వెనక్కి నెట్టిన దేవీ ఈ మధ్య తను వెనకబడిపోతున్నాడు. ఉప్పెన వంటి సూపర్ హిట్ మూవీ ఇచ్చినా.. తమన్ తో కంపేరిజనల్ లో వెనక బడ్డాడు అనేది నిజం. అందుకు ప్రధాన కారణం పెద్ద హీరోల సినిమాలకు ఈ ఇద్దరూ ఇచ్చిన సంగీతమే. తమన్ సినిమాలు పెద్ద హిట్ అవడం మరో రీజన్ గా ఇప్పుడు దేవీ కంటే తమన్ కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు మనవాళ్లు.

తమన్ చేతిలో చిన్నా పెద్దా అన్నీ కలిపి ఇప్పుడు పదికి పైగా సినిమాలున్నాయి. దేవీ దగ్గర పుష్ప, ఖిలాడీ, ఎఫ్ 3 మాత్రమే ఉండటం విశేషం. అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత ఎంత ఉందో కనిపిస్తోంది కదా. అందుకే పక్క భాషలవైపు చూస్తున్నారు మనవాళ్లు. ఈ క్రమంలో తెలుగులో అజ్ఞాతవాసితో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి అనిరుధ్ ను ఓ ఆప్షన్ గా అనుకుంటున్నారు. అజ్ఞాతవాసి డిజాస్టర్ అయినా ఆ తర్వాత జెర్సీ తో హిట్ అందుకున్నాడు అనిరుధ్. కానీ తర్వాత అతన్ని మనవాళ్లు పెద్దగా పట్టించుకోలేదు.

తమిళ్ లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా వెలుగుతున్నాడు అనిరుధ్. అందుకే ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి స్టార్స్ ఇప్పుడు అనిరుధ్ వైపు చూస్తున్నారట. ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా కోసం అనిరుధ్ ను తీసుకుంటున్నారు అనీ.. అలాగే రామ్ చరణ్ - శంకర్ బై లింగ్వుల్ మూవీ కోసమూ అనిరుధ్ ను అనుకుంటున్నారు. నిజానికి కొరటాల ఇప్పటి వరకు తన అన్ని సినిమాలకు దేవీ శ్రీతో సంగీతం చేయించుకున్నాడు. అటు శంకర్ కూడా ఏఆర్ రెహ్మాన్ తో వెళ్లేవాడు. కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ సడెన్ గా అనిరుధ్ వైపు చూస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు తెలుగులో మ్యూజిక్ డైరెక్టర్స్ కొరత మాత్రం బాగా ఉందనేది నిజం. మట్టిలో మాణిక్యాలు ఎక్కడో ఉండే ఉంటారు. ఓ సారి జల్లెడ పడితే వెలుగులోకి వస్తారు. కానీ అంత ఓపిక, టైమ్ ఎవరికి ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story