మంచి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ 'ముత్యాల సుబ్బయ్య' .. బర్త్ డే స్పెషల్..

మంచి చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ ముత్యాల సుబ్బయ్య .. బర్త్ డే స్పెషల్..
కథాబలం ఉన్న చిత్రాలకు కేరాఫ్ ఆయన.. ఆఫ్ బీట్ చిత్రాలతో కమర్షియల్ గా ఖలేజా చూపించాడు

కథాబలం ఉన్న చిత్రాలకు కేరాఫ్ ఆయన.. ఆఫ్ బీట్ చిత్రాలతో కమర్షియల్ గా ఖలేజా చూపించాడు.... స్టార్ హీరోలతో సత్తా చాటాడు...స్మాల్ హీరోల స్టార్డమ్ పెంచాడు. సినిమా ఏదైనా తన మార్క్ సెంటిమెంట్ తో సక్సెస్ రేట్ కు సగం బలంగా నిలిచే ఆ దర్శకుడెవరో ఇప్పటికే ఊహించి ఉంటారు కదూ.. యస్ ముత్యాల సుబ్బయ్య.. పేరులో ముత్యాలను.. తీరులో ఆణిముత్యాల్లాంటి సినిమాలను ఇముడ్చుకున్న ముత్యాల సుబ్బయ్య బర్త్ డే ఇవాళ.

ముత్యాల సుబ్బయ్య .. ఈ పేరు వినగానే సెంటిమెంట్ అనే పదమూ గుర్తొస్తుంది. తొలి సినిమాతోనే పెద్ద ప్రయోగం చేశాడు.. ఆ మూడు ముళ్లు ఆదుకోలేదు.. కానీ, అరుణకిరణం ఆదుకుంది. మూడుముళ్లకు అరుణకిరణానికి మధ్యలో ఎనిమిదేళ్ల టి కృష్ణ సాంగత్యం ఆయన ఆలోచనల్ని మార్చివేసింది. అందుకే ముత్యాల సుబ్బయ్య సినిమాల్లో సెంటిమెంట్ ఏ స్థాయిలో ఉంటుందో సామాజిక స్పృహా అదే స్థాయిలో ఉంటుంది..

నెల్లూరు జిల్లాలోని పార్లపల్లి గ్రామంలో జన్మించారు ముత్యాల సుబ్బయ్య. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. స్కూల్ డేస్ నుంచే నాటకాలపై ఇంట్రెస్ట్. కాలేజ్ కి వచ్చాక ఇంకా పెరిగింది. నాటకాలు రాయడం, దర్శకత్వం చేయడంతో పాటు నటించడమూ చేశారు. ఆ అనుభవంతోనే అడుగులు వెండితెర వైపుకు పడ్డాయి. చిన్న చిన్న పరిచయాలతో మద్రాస్ లో అడుగుపెట్టాడు.

మద్రాస్ లో చాలామంది వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. పిసి రెడ్డి వద్ద ఎక్కువ సినిమాలకు అసిస్టెంట్ గా ఉన్నారు. ఆ టైమ్ లోనే కో డైరెక్టర్ గా ప్రమోషన్ వచ్చింది. అక్కడి నుంచి దర్శకుడుగా అవకాశం దక్కించుకున్నాడు. ముత్యాల సుబ్బయ్య దర్శకుడుగా చేసిన తొలి సినిమా మూడుముళ్ల బంధం. ఎనిమిదేళ్ల పిల్లాడు.. పద్దెనిమిదేళ్ల అమ్మాయికి తాళి కట్టడం అనే ప్రయోగాత్మక కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా పెద్ద ఫ్లాప్.

తొలి సినిమా మూడుముళ్ల బంధం అట్టర్ ఫ్లాప్.. దీంతో చాలా గ్యాప్ వచ్చింది. ఆగ్యాప్ లో టి కృష్ణ వద్ద అసిస్టెంట్ గా చేరి ఎన్నో సినిమాలకు పనిచేశాడు. ఆ టైమ్ లోనే సుబ్బయ్యకు అరుణకిరణంతో దర్శకుడిగా అవకాశం వచ్చింది.. అప్పుడు టి కృష్ణ రేపటి పౌరులు తీస్తున్నారు. కానీ అదే టైమ్ లో ఆయనకు క్యాన్సర్ అన్న విషయం తెలిసింది. దీంతో అఫీషియల్ గా అరుణకిరణంకు, టి కృష్ణ సూచనలతో అనఫిషియల్ గా టి కృష్ణ రేపటి పౌరులు చిత్రానికి దర్శకుడిగా పనిచేశారు.

అరుణకిరణం విజయం సాధించింది. తర్వాత వెంటనే అదే స్పృహతో ఇదా ప్రపంచం తీశాడు.. ఇదీ హిట్టే.. ఆ ఊపులోనే బాలకృష్ణతో ఇన్స్ పెక్టర్ ప్రతాప్ చేశాడు. కానీ అదీ యావరేజ్. అయినా ఒకే యేడాది మూడు విజయవంతమైన చిత్రాలతో ముత్యాల సుబ్బయ్య కెరీర్ కు పునాదిరాళ్లు పడ్డ ఆ యేడాది 1988.

ముత్యాల సుబ్బయ్య కెరీర్ లో ది బెస్ట్ అనదగ్గ సినిమాల్లో ఒకటి మామగారు. ఓ తమిళ్ సినిమాకు రీమేక్ అయినా దాన్ని తెలుగులో అద్భుతంగా ఆవిష్కరించాడు. ఈ సినిమాతో దర్శకరత్న దాసరిని డైరెక్ట్ చేయడం ఆయన ఎఛీవ్ మెంట్స్ లో ఒకటని చెప్పొచ్చు. అయితే వస్తున్న క్రేజ్ ను బట్టి వచ్చిన అన్ని రకాల సినిమాలు చేయలేదు. ఎప్పుడూ కథను వదల్లేదు.. దానిలో కూసంతైనా ఉండే ప్రయోజనాన్నీ వదల్లేదు. అందుకే అరుణ కిరణం నుంచి మమతలకోవెల, నేటి చరిత్ర, ఎర్రమందారం, కలికాలం, మామగారు, లాంటి సూపర్ హిట్స్ తో దూసుకుపోయారు.

కలికాలం లాంటి సినిమా తీయాలంటే గట్స్ కావాలి. అందుకే ఆకలి మంటల కలికాలాన్ని మధ్య తరగతి జీవితాల కన్నీటితో నింపేసి కాసులు కురిసేలా చేశాడు.. జయసుధ, చంద్రమోహన్, సుత్తివేలు వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించిన కలికాలం చిత్రం నేటికీ మధ్య తరగతి జీవితాలకు అద్ధం పడుతుంది.

ఇక అప్పటి వరకూ కామెడీ హీరోగా మాత్రమే తెలిసిన రాజేంద్ర ప్రసాద్ లోని కొత్తకోణాన్ని ఎర్రమందారం తో వెలికి తీశాడు సుబ్బయ్య. అలాగే ఆ సినిమాతో గ్రామాల్లో ఆడవారిపై దొరల ఆగడాలు, కూటికి లేకపోయినా ఆత్మాభిమానం తగ్గని బడుగుల తెగువను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించాడు..

ముత్యాల సుబ్బయ్య అనగానే సెంటిమెంట్ చిత్రాల దర్శకుడుగా తిరుగులేని పేరుంది. ఆయన సినిమాల్లో మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరిస్తారు. సహజమైన పాత్రలతో కనిపించే అలాంటి సినిమా పల్నాటి పౌరుషం. కృష్ణంరాజు, రాధిక, చరణ్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో అన్న చెల్లెల్ల అనుబంధాన్ని చాలా గొప్పగా చూపించారు. ఏఆర్ రెహ్మాన్ సంగీతం మరో హైలెట్ గా నిలిచిన పల్నాటి పౌరుషం సినిమా ఆయన కెరీర్ లో మరో బెస్ట్ మూవీ.

ముత్యాల సుబ్బయ్య ఫ్లాప్సే తీయలేదు అనలేం. కానీ అవేవీ డిజాస్టర్స్ అనదగ్గవి కాదు.. సంసార వీణ, రేపటి కొడుకు, మాధవయ్యగారి మనవడు, పెళ్లంటే నూరేళ్ల పంట, పర్వతాలు పానకాలు, బంగారు మామ, ఇల్లు పెళ్లి చిత్రాల్లో కొన్ని యావరేజ్ గా మరికొన్ని ఫ్లాప్స్ గానూ నిలిచాయి.. అలాంటి టైమ్ లో ముత్యాల సుబ్యయ్య పని ఐపోయిందా అనుకున్నారు.. కానీ అన్న, పెళ్లిగోల చిత్రాలతో మళ్లీ ట్రాక్ ఎక్కారు..

దర్శకుడుగా ముత్యాల సుబ్బయ్య బాణీ వైవిధ్యం. కథల ఎంపికలోనే సగం విజయం సాధించారాయన. ప్రయోగాత్మక చిత్రాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ ను అద్ది.. అద్భుత విజయాలు అందుకున్నారు. అందుకే ముత్యాల సుబ్బయ్య అరుదైన దర్శకుల కోవలో నిలిచారు. ఇక మెగాస్టార్ లా దూసుకపోయిన చిరంజీవి వరుస డిజాస్టర్స్ తో ఏకంగా ఏడు నెలల గ్యాప్ తీసుకున్నాడు. తన రీ ఎంట్రీకి సరైన దర్శకుడు కోసం చూస్తోన్న టైమ్ లో కనిపించింది ముత్యాల సుబ్బయ్యే. చిరంజీవికి రీ ఎంట్రీ అనదగ్గ హిట్లర్ తో మెగాస్టార్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించారు ముత్యాల సుబ్బయ్య.

తనకు హిట్లర్‌తో మళ్లీ హిట్ ఇచ్చిన కారణంగానే ముత్యాల సుబ్బయ్యకు పవన్ కళ్యాణ్ రెండో సినిమా ఇచ్చాడు. గోకులంలో సీత అంటూ వచ్చిన ఈ మూవీ పవన్ కు తొలి హిట్ గా నిలిచింది.

మొహమాటానికి సినిమా చేస్తే మూడో రోజే బాక్స్ తిరిగి వచ్చిందట.. అన్నట్టుగా తానూ కొన్ని సినిమాలు మొహమాటానికో, కాదనే ధైర్యం లేకనో చేయాల్సి వచ్చిందని చెబుతారు ముత్యాల సుబ్బయ్య. అలాంటి వాటిలో మాధవయ్య గారి మనవడు, ఒక చిన్నమాట, చిరంజీవి అన్నయ్య లాంటి సినిమాలున్నాయి. హిట్లర్‌తో చిరంజీవికి హిట్ ఇచ్చినా అన్నయ్య తీసి మళ్లీ ఫ్లాప్‌ని మూడగట్టుకున్నాడు. ఇమేజ్ కోసం సెకండాఫ్ లో జరిగిన మార్పులే సినిమా యావరేజ్ కావడానికి కారణమంటాడు.

అయితే సినిమాకు కెప్టెన్ దర్శకుడే అయినా .. అతను కొన్ని సార్లు మంచి లిజనర్ అయి ఉండాలనేది సుబ్బయ్య ఫార్ములా.. అలాంటి సందర్భాల్లోనే సినిమాలు బాల్చీ తంతాయనేది కూడా అతని నమ్మకం. అందుకే లిజనర్ గా ఉన్నా.. క్రియేటివ్ టాలెంట్ ను ఒంట బట్టించుకుని, నిర్మాత శ్రేయస్సును కోరుకున్న వాడే మంచి దర్శకుడు అవుతాడు అనేది ఆయన సిద్ధాంతం.

కథను నమ్మిన దర్శకుడు హీరోల ఇమేజ్ ను దాటి మెప్పించగలడు. వెంకటేష్ కు ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ ను ఎలివేట్ చేస్తూనే అతన్ని మొదట్లో యాంటీ హీరోగా ప్రెజెంట్ చేసి అటుపై పవిత్ర బంధానికి అర్థం చెప్పినా.. ఓ లైంగిక దాడి బాధితురాలికి అండగా నిలిచే పాత్రలో వెంకటేష్ ను, సౌందర్యను ఒప్పించడంలోనూ ఈయన బలం కథే. ఈ కారణంగానే వెంకటేష్, సౌందర్యల కెరీర్ లో ఆల్ టైమ్ బెస్ట్ మూవీస్ గా చెప్పుకునేలా పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం.. చిత్రాలు ఎప్పటికీ నిలిచిపోతాయి.

మహిళా ప్రేక్షకల్లో అంతులేని ఆదరణ ఉన్న సౌందర్య ను లైంగిక దాడి బాధితురాలిగా ఒప్పించాడంటే అర్థం అవుతుంది.. ముత్యాల సుబ్బయ్య కథాబలంలో ఉండే గట్స్.. ముఖ్యంగా వెంకటేష్ తో శీలం గురించి చెప్పే సీన్ మహిళా ప్రేక్షకులనే కాదు యావత్ సినీ అభిమానులచేత చప్పట్లు కొట్టించింది.

అన్నయ్య తర్వాత కొంత టచ్ కోల్పోయాడు ముత్యాల సుబ్బయ్య. తన గురువు టి కృష్ణ తనయుడు గోపీచంద్ ను హీరోగా పరిచయం చేశాడు. తొలివలపుగా వచ్చిన ఈ మూవీ ఫ్లాప్. ఈ సినిమా టైమ్ లో చాలామంది కొత్త కుర్రాళ్లు హీరోలుగా పరిచయం అయ్యారు. కానీ వారి పరిచయాలకు పూర్తి భిన్నమైన కథగా వచ్చిన ఈమూవీ ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

తొలివలపు తర్వాత కూడా ముత్యాల సుబ్బయ్య చేసిన సినిమాలేవీ ఆకట్టుకోలేదు. దీనికి తోడు ఆ టైమ్ లో ఇండస్ట్రీలో కూడా అనేక మార్పులు మొదలయ్యాయి. చాలామంది వెటరన్స్ ‌కు అనివార్యంగా రిటైర్ కావాల్సిన పరిస్థితులు వచ్చాయి. తొలి వలపు తర్వాత దీవించండి, రాజా నరసింహ అనే కన్నడ మూవీతో పాటు ఆప్తుడు, ఆలయం అనే సినిమాలు చేశారు. మొత్తంగా తెలుగు సినిమాలకు సామాజిక సందేశాలను అద్ది కమర్షియల్ విజయాలు సాధించిన అతికొద్దిమంది దర్శకుల జాబితాలో సుబ్బయ్య ఉంటారు.

Tags

Read MoreRead Less
Next Story