Nagbabu: గరికపాటి నరసింహారావును నాగబాబు టార్గెట్ చేశారా?

Nagbabu : గరికపాటి నరసింహారావును నాగబాబు టార్గెట్ చేశారా? అన్నయ్యను అన్నందుకు గరికపాటిపై అసహనం చూపిస్తున్నారా? నాగబాబు ట్విటర్ కామెంట్లు చూస్తే.. కచ్చితంగా గరికపాటిని ఉద్దేశించే కామెంట్స్ చేశారంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
ఏపాటి వాడికైనా చిరంజీవి గారి ఇమేజ్ చూస్తే ఆపాటి అసూయ పడటం పరిపాటే అంటూ నిన్న సాయంత్రం నాగబాబు ట్వీట్ చేశారు. ఇది ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియలేదు. కాని, హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో అలయ్‌బలయ్ కార్యక్రమంలో జరిగిన సంఘటన కారణంగానే నాగబాబు ఈ ట్వీట్ చేశారని చెబుతున్నారు.
అలయ్ బలయ్ కార్యక్రమానికి విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. దీనికి చిరంజీవి, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు కూడా వెళ్లారు. ఈ కార్యక్రమంలో గరికపాటి ప్రవచనాలు చెబుతున్న సమయంలో చిరంజీవితో ఫొటోలు దిగేందుకు అక్కడున్న వారు ఆసక్తి చూపారు.
చిరంజీవి కూడా ఎవరినీ నొప్పించకుండా అందరికి ఫొటోలు తీసుకునేందుకు అవకాశం ఇచ్చారు. అయితే అప్పటికే ప్రవచనం ఆరంభించిన గరికపాటికి ఈ పరిణామం ఇబ్బందిగా అనిపించింది. దీంతో.. అసహనానికి గురైన గరికపాటి.. ఫొటోల సెషన్ ఆగిపోతే తాను మాట్లాడతాను, లేకపోతే వెళ్లిపోతాను అంటూ మాట్లాడారు.
గరికపాటి అలా అనడంతో.. చిరంజీవి క్షమాపణ చెప్పి గరికపాటిని భోజనానికి ఆహ్వానించారు. ఆ తర్వాత చిరంజీవి వెళ్లి గరికపాటి పక్కనే కూర్చుని ప్రవచనం విన్నారు. ఇద్దరూ సరదాగా ముచ్చటించుకున్నారు.
అక్కడితో ఈ ఎపిసోడ్ ముగిసింది. కాని, నాగబాబు మాత్రం ఘటనను మరిచిపోలేదని చెబుతున్నారు. నాగబాబు ట్వీట్ చేయడాన్ని మెగా అభిమానులు సమర్థిస్తుండగా.. నెటిజన్లు మాత్రం తప్పుబడుతున్నారు. చిరంజీవి హుందాగా వివాదానికి ముగింపు పలికితే.. అతిగా స్పందిస్తూ మెగాస్టార్ ఇమేజ్‌ను నాగబాబు దిగజార్చుతున్నాడని కొందరు మెగా అభిమానులు కూడా ట్వీట్ చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com