Balakrishna : అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ

Balakrishna :  అన్విత బ్రాండ్ అంబాసిడర్‌గా నందమూరి బాలకృష్ణ
X

అన్విత గ్రూప్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటసింహం, హిందూపురం హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ వ్యవహరించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అచ్యుతరావు బొప్పన ప్రకటించారు. ఈ సందర్భంగా అన్విత గ్రూప్ రూపొందించిన బ్రాండ్ ఫిల్మ్స్‌ను శుక్రవారం హైదరాబాద్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అచ్యుతరావు బొప్పన, ఐదు దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంతో పాటు విద్య, ఆరోగ్య రంగాల్లో బాలకృష్ణ గారు చేసిన సేవలు సమాజానికి ఆదర్శమని అన్నారు. మాట తప్పను–మడమ తిప్పను అనే విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన బాలకృష్ణ వ్యక్తిత్వం, అన్విత గ్రూప్ మౌలిక సిద్ధాంతాలకు అనుగుణంగా ఉందన్నారు. అందుకే ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా కావాలని భావించడం, ఆయన ఒప్పుకోవటం సంస్థకు గర్వకారణమని తెలిపారు.

‘బిల్డ్ హ్యాపినెస్’ అనేదే అన్విత గ్రూప్ నినాదమని, అదే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లగల ప్రతినిధిగా బాలకృష్ణ నిలుస్తారని అచ్యుతరావు బొప్పన పేర్కొన్నారు. సంతోషంతో నిండిన శాశ్వత వారసత్వాన్ని నిర్మించే ప్రయాణంలో ఆయన భాగస్వామ్యం సంస్థకు మరింత బలాన్నిస్తుందన్నారు.

గత రెండు దశాబ్దాలుగా దుబాయ్, అబూదాబిలో నివాస, వాణిజ్య, హాస్పిటాలిటీ రంగాల్లో 4 కోట్ల చదరపు అడుగుల నిర్మాణాన్ని పూర్తి చేసిన అన్విత గ్రూప్, ప్రస్తుతం అమెరికాలోని డల్లాస్ నగరంలో లైఫ్‌స్టైల్ కమ్యూనిటీని అభివృద్ధి చేస్తోందని తెలిపారు. హైదరాబాదులో మూడు ప్రధాన ప్రాజెక్టులతో మొత్తం 80 లక్షల చదరపు అడుగుల నిర్మాణం కొనసాగుతోందన్నారు.

కొల్లూరులోని అన్విత ఇవానా ప్రాజెక్ట్‌కు షెడ్యూల్‌కు ముందే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ రావడం విశేషమని, తొలి దశలో 400 యూనిట్లను వినియోగదారులకు అందించనున్నట్లు తెలిపారు. అలాగే అన్విత హై నైన్, మేడ్చల్ ‌లోని అన్విత పార్క్‌సైడ్ ప్రాజెక్టులు నగర జీవనానికి కొత్త నిర్వచనం ఇవ్వనున్నాయని చెప్పారు.

భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు విజయవాడ, విశాఖలలో ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు అచ్యుతరావు బొప్పన వెల్లడించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలో నగరంలోనే ఎత్తైన భవనాలను నిర్మిస్తామని చెప్పారు. రాబోయే 5–6 సంవత్సరాల్లో ప్రతి ఏడాది సుమారు వెయ్యి యూనిట్లను వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా అన్విత గ్రూప్ ముందుకు సాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో అన్విత గ్రూప్ డైరెక్టర్లు నాగభూషణం బొప్పన, శ్రీకాంత్ బొప్పన, విజయరాజు, హ్యాపీ హోమ్స్ డైరెక్టర్ మురళి తదితరులు పాల్గొన్నారు.

Tags

Next Story