Court movie Review : నాని కోర్ట్ మూవీ ఎలా ఉంది.. తీర్పు నచ్చిందా లేదా

రివ్యూ : కోర్ట్
ఆర్టిస్టులు : ప్రియదర్శి, శివాజీ, హర్ష్ రోషన్, శ్రీదేవి, హర్షవర్ధన్, సాయికుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి తదితరులు
ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్ ఆర్
సంగీతం : విజయ్ బుల్గానిన్
సినిమాటోగ్రఫీ : దినేష్ పురుషోత్తమ్
నిర్మాత : ప్రశాంతి తిపిర్నేని
దర్శకత్వం : రామ్ జగదీష్
హీరోగా నాని ఎంచుకునే కథలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. వైవిధ్యమైన కథలతోనే అతను ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు. అలాంటి తను నిర్మాతగా మారితే ఎలాంటి కథలు చేస్తాడో కొన్నాళ్లుగా అతని ప్రొడక్షన్ లో వస్తోన్న మూవీస్ చూస్తే తెలుస్తుంది. తాజాగా మరో డిఫరెంట్ స్టోరీతో ‘కోర్ట్’ అనే మూవీని ప్రొడ్యూస్ చేశాడు. ట్రైలర్ తోనే ఇదో సెన్సిటివ్ ఇష్యూ గురించి మాట్లాడబోతోన్న సినిమా అనిపించుకుంది. కంటెంట్ పై నమ్మకంతో రెండు రోజులు ముందుగానే ప్రీమియర్స్ వేశాడు నాని. మరి ఈ కోర్ట్ మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ :
వైజాగ్ కు చెందిన మంగపతి( శివాజీ)కి తన జాతి, పరువు అంటే ప్రాణం. అలాంటి మంగపతి కుటుంబానికి చెందిన ఓ అమ్మాయి జాబిలి( శ్రీదేవి) ఎమ్సెట్ కు ప్రిపేర్ అవుతూ ఓ ఇంటర్నెట్ సెంటర్ లో పనిచేసే చంద్రశేఖర్(హర్ష్ రోషన్) తో ప్రేమలో పడుతుంది. చందు తల్లి ఇస్త్రీ చేస్తుంది. తండ్రి ఓ చిన్న ఉద్యోగం చేస్తుంటాడు. వాచ్ మేన్ గా ఓ జాగాలో ఉంటుంటారు వాళ్లు. జాబిలి రోజూ అతని ఇంటికి కూడా వెళుతుంది. ఇది తెలిసిన మంగపతి ఆ ఇంటిపై దాడి చేసి తన పరపతితో చందుపై పోక్సోతో సహా అనేక కేస్ లు పెట్టిస్తాడు. మరోవైపు విజయవాడలో లాయర్ మోహన్ రావు(సాయికుమార్) వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తూ తనూ ఎప్పటికైనా సొంతంగా కేస్ వాదించాలని ప్రయత్నిస్తుంటాడు సూర్య తేజ(ప్రియదర్శి). ఈ వైజాగ్ లోని ఈ పోక్సో కేస్ మోహన్ రావు వద్దకు వస్తుంది. అతను కాదంటాడు. అతనికి తెలియకుండా తేజ ఆ కేస్ ను టేకప్ చేస్తాడు. మరి ఈ కేస్ నేపథ్యం ఏంటీ..? ఆ కేస్ లో ఉన్న వాస్తవితక ఎంత..? ఈ కేస్ లో అత్యంత కీలకంగా ఉన్న ‘16నిమిషాల’ఎపిసోడ్ లో ఏం జరిగింది..? పోక్సో చట్టం నిజంగా జెన్యూన్ గా అమలు కావాలంటే ఏం చేయాలి వంటి అంశాలతో జరిగేదే మిగతా కథ.
ఎలా ఉంది :
కోర్ట్ రూమ్ డ్రామా అనగానే అరుపులు కేకలు, లాయర్లు ఒకరిపై ఒకరు చేయి చేసుకునే వరకూ వెళ్లడం.. జడ్జ్ ముందు బల్లలు విరగ్గొట్టినంత పనిచేయడం అనేది చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా ఈ ‘కోర్ట్’ సహజంగా ఉంటుంది. నిజంగా కోర్ట్ లు ఎలా పనిచేస్తాయి..? లాయర్లు జడ్జ్ లకు ఎంత విధేయతగా ఉంటారు అనే అంశాలతో పాటు కొందరు లాయర్లు డబ్బుకు ఆశపడి తాము టేకప్ చేసిన కేస్ లను ఎలా నీరుగారుస్తారు వంటి అంశాలను నిజాయితీగా చూపించాడు దర్శకుడు.
ఫస్ట్ హాఫ్ అంతా ఈ కుర్రాళ్ల ప్రేమకథ కనిపిస్తుంది. చూడ్డానికి నిబ్బా నిబ్బీ లా అనిపించినా.. కాస్త మెచ్యూర్డ్ క్యారెక్టైజేషన్ కనిపిస్తుంది. ఈ పాత్రలు టీనేజ్ ప్రభావంతో అడ్డదారులు తొక్కకుండా నిజాయితీగా కనిపిస్తాయి. బాధ్యతగానూ ఉంటారు. ఆ కుర్రాడిపై కేస్ పెట్టిన తర్వాత ఆ కుటుంబం, సన్నిహితులు పడే ఆవేదన, వీటితో ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది. సెకండ్ హాఫ్ అంతా కోర్ట్ లో జరిగే డ్రామా. ఈ డ్రామాను ఇంటెన్స్ గా రాసుకోవడంలో దర్శకుడు బాగా సక్సెస్ అయ్యాడు. మధ్యలో ప్రియదర్శి కేస్ వదిలేసి వెళ్లిపోవడం.. సాయికుమార్ ఎంట్రీతో తిరిగి టేకప్ చేయడం.. ప్రతి వాయిదాకూ ఓ మలుపు అన్నట్టుగా చూస్తున్నంత సేపూ చాలా ఎంగేజింగ్ గా కనిపిస్తుంది. నిజానికి ఇంత సహజమైన కోర్ట్ రూమ్ డ్రామాను చూడాలంటే ఓపిక కావాలి. కానీ ఓపిక స్థాయిలో ఆసక్తిని క్రియేట్ చేయడంలో రైటింగ్ మెచ్యూరిటీ కనిపిస్తుంది. అప్పటి వరకూ అంతా తానే అన్నట్టుగా ఉన్న దయా అనే లాయర్ తేజ అనే విజయవాడ లాయర్ ఎంట్రీతో డమ్మీ అవడం.. అందుకు పూర్తిగా ఆస్కారం కూడా ఉండటంతో ప్రేక్షకులు హ్యాపీగా ఫీలవుతారు. ఫైనల్ గా ఈ మూవీ క్లైమాక్స్ ఎలా ఉంటుంది అనేది ఊహించేదే అయినా.. ఆ ఊహకు ఎండ్ కార్డ్ ఎలా పడింది అనేది కథనంతో మెప్పించాడు దర్శకుడు.
మైనస్ లు లేవా అంటే ఉన్నాయి. సెకండ్ హాఫ్ అంతా లాయర్ కు అన్నీ ‘ప్రిపేర్డ్’గా ఉంటాయి. అతను కోరినవన్నీ చిటికెలో వస్తుంటాయి. వాయిదాలకు సంబంధించి జడ్జ్ డేట్ లు మాత్రమే చెబుతాడు. ఆ డేట్ నెక్ట్స్ సీన్ కే వస్తుంది. ఈ కేస్ కు సంబంధించిన విషయంలో తేజ పెద్దగా స్టడీ చేయడు. అంతా దర్శకుడే రెడీ చేసి ఉంచుతాడు. కోర్ట్ రూమ్ డ్రామా సహజంగానే కనిపించినా సినిమాటిక్ లిబర్టీస్ కూడా చాలానే తీసుకున్నాడు.
నటన పరంగా ప్రతి ఒక్కరూ ఫిదా చేస్తారు. హర్ష్ రోషన్, శ్రీదేవి చాలా సహజంగా నటించారు. లాయర్ గా హర్షవర్ధన్ ఆకట్టుకుంటే ప్రియదర్శి అదరగొట్టాడు. ఈ పాత్రను అతను ఓన్ చేసుకున్న విధానం బావుంది. ప్రధానంగా చెప్పుకోవాల్సింది శివాజీ గురించి. మంగపతిగా అతని నటనకు భయపడతాం. ఈయనలో ఇంత క్రూరమై యాంగిల్ ఉందా అనిపిస్తుంది. ఆ క్యారెక్టరైజేషన్ ను బర్త్ డే సీన్, ఓ పిల్లాడి తండ్రిని గంజాయి కేస్ లో ఇరికించిన సీన్స్ తో అద్భుతంగా ఎలివేట్ చేశాడు దర్శకుడు. రోహిణి, శుభలేఖ సుధాకర్ పాత్రలు బెల్లంకొట్టిన రాయిలా అనిపించినా చివర్లో దర్శకుడి కోరిక మేరకు తెగించినట్టు కనిపిస్తారు.
సినిమాటోగ్రఫీ బావుంది. లిమిటెడ్ లొకేషన్స్ లోనే బాగా చూపించాడు. మ్యూజిక్ పరంగా పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం ఇంకా బావుంది. ఎడిటింగ్ బావుంది. డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బావున్నాయి. దర్శకుడుగా ఫస్ట్ మూవీతోనే బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు రామ్ జగదీష్. ఇలాంటి కంటెంట్స్ కు కాసులు కూడా రాలే కథనం కూడా రాసుకుని నిర్మాతలకూ హోప్ ఇచ్చాడు.
ఫైనల్ గా : సహజంగా ఆకట్టుకున్న కోర్ట్ రూమ్ డ్రామా
రేటింగ్ : 3/5
- బాబురావు. కామళ్ల
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com