Nani's HIT 3 : హిట్ 3తో సెంచరీ కొట్టిన నాని..

నేచురల్ స్టార్ నాని సెంచరీ కొట్టేశాడు. ఈ సెంచరీపై అతను ముందు నుంచీ కాన్ఫిడెంట్ గానే ఉన్నాడు. అంటే ఖచ్చితంగా హిట్ 3తో వంద కోట్లు కొడతా అనే నమ్మకంతోనే కనిపించాడు. ఆ నమ్మకం కేవలం 4 రోజుల్లోనే నిజమైంది. హిట్ మూవీ ఫ్రాంఛైజీలో భాగంగా వచ్చిన హిట్ 3తో నాని మోస్ట్ వయొలెంట్ మూవీ ఆఫ్ టాలీవుడ్ అనేలా నిర్మించాడు. ఈ రేంజ్ హింసను ఇంతకు ముందెప్పుడూ తెలుగు సినిమా చూడలేదు. అలాంటిది నాని ఇలాంటి క్లాస్ ఇమేజ్ ఉన్న హీరో ఇంత వయొలెంట్ మూవీలో నటించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. సెకండ్ హాఫ్ మొత్తం వెండితెరను రక్తంతో ఎరుపెక్కించాడు. మనుషుల్ని చంపడంలో పిహెచ్.డి చేసినట్టుగా దర్శకుడు ఈ కథనాన్ని రాసుకుంటే దాన్ని నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లే యాక్షన్ కొరియోగ్రఫీతో నాని మరింత రెచ్చిపోయాడు.
శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక గత గురువారం మేడే సందర్భంగా విడుదలైన హిట్ 3 నాలుగు రోజుల్లో 101 కోట్లు వసూలు చేసింది. ఇది ఇప్పటికి నానికి ఫాస్టెస్ట్ సెంచరీ. ఇక ఇంతకు ముందు దసరా, సరిపోదా శనివారం చిత్రాలు కూడా వంద కోట్లతో నాని రేంజ్ ను మార్చాయి. హిట్ 3 ఆ రేంజ్ ను కొనసాగించిందనే చెప్పాలి. ఇక ఈ వీక్ డేస్ లో కూడా హిట్ 3 స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేస్తుందనే అంచనాలున్నాయి. సమ్మర్ కాబట్టి 150 కోట్ల వరకూ వసూలు చేయొచ్చు అనే అంచనాలున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com