Narne Nithiin : నార్నె నితిన్ ‘ఫస్ట్’ఫ్లాప్ పడబోతోందా..?

Narne Nithiin :  నార్నె నితిన్ ‘ఫస్ట్’ఫ్లాప్ పడబోతోందా..?
X

ఎన్టీఆర్ బావమరిదిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నార్నె నితిన్. అతను హీరోగా ఫస్ట్ మూవీ అనౌన్స్ అయినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కూడా. కుర్రాడు యావరేజ్ లుక్స్ తోనే ఉన్నాడు. కాకపోతే ఎన్టీఆర్ బావమరిది కదా.. అతని ఫ్యాన్స్ వరకూ చూశారు. పైగా అప్పటికి పెద్ద ఫ్లాప్ తో ఉన్న సతీష్ వేగేశ్న దర్శకుడు కావడం కూడా కొంత మైనస్ అయింది. అన్నీ కలిసొచ్చాయా అన్నట్టుగా మూవీ బాగా లేట్ అయింది. ఈ లోగా కుర్రాడు మ్యాడ్ మూవీలో నలుగురు హీరోల్లో ఒకడుగా వచ్చాడు. అందరికంటే అతనికి కాస్త ఎక్కువ స్పేస్ ఇచ్చారు. అయినా అంతా మార్కులు కొట్టేశారు. ఆపై ‘ఆయ్’అనే మూవీతో సోలోగా హిట్ కొట్టాడు. ఈ యేడాది మ్యాడ్ స్క్వేర్ తో మరో విజయం అందుకున్నాడు. అలా ఫస్ట్ మూవీ రిలీజ్ కాకుండానే హ్యాట్రిక్ విజయాల్లో భాగమయ్యాడు నితిన్. మరి ఈ హిట్స్ ఉన్నాయనే ధైర్యంతోనే ఏమో.. ఫస్ట్ మూవీ శ్రీ శ్రీ శ్రీ రాజావారు మూవీని మళ్లీ బయటకు తీశారు. తాజాగా ట్రైలర్ విడుదలైంది.

ట్రైలర్ చూస్తే సింపుల్ గా అర్థం అయ్యేది ఒక్కటే. హీరో చైన్ స్మోకర్. అతన్ని ప్రేమించిన అమ్మాయి తండ్రి.. అతను సిగరెట్ మానేస్తేనే పెళ్లి అంటాడు. మరి మానేశాడా లేదా అనేదే పాయింట్ అనేలా ఉందీ ట్రైలర్. ట్రైలర్ లో ఏ పాయింట్ కూడా ఆకట్టుకునేలా లేదు. సిగరెట్ కోసమే సినిమా తీశారా అన్నట్టుగా కనిపిస్తోంది.

‘ప్రేమించడం ఎలక్షన్లో నిలబడ్డం లాంటిది.. ఎవరైనా చేయొచ్చు.. కానీ గెలవడం అంత ఈజీగాదు..’ అనే రావు రమేష్ డైలాగ్ తో ప్రారంభమైన ట్రైలర్ లో తర్వాత.. పొద్దున్న లేవగానే ఓ దమ్ము, టీ తాగాక ఓ దమ్ము, భోజనం అయ్యాక ఓ దమ్ము కొడితే ఉంటదీ.. అంటూ హీరో డైలాగ్. సిగరెట్ మానేస్తే ముద్దిస్తా అంటుంది హీరోయిన్. మనోడు మానేస్తా అంటాడు. మానేయకపోతే అంటుందావిడ. లాగి ఒకటి పీకు అంటాడు ఇతను. అలా ఆమె పీకుతూనే ఉంటుంది. ఇదే తంతు.. ట్రైలర్ అంతా. సో.. ఫస్ట్ మూవీ నితిన్ కు ఫస్ట్ ఫ్లాప్ గా కూడా మారే అవకాశాలు బోలెడు ఉన్నాయని ఈ ట్రైలర్ చూశాక ఎవరికైనా అనిపిస్తే తప్పే లేదేమో.

Tags

Next Story