Nayanthara : నయనతార ఊచకోత

లేడీ సూపర్ స్టార్ గా తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది నయనతార. తనే మెయిన్ లీడ్ గా సినిమాలు చేస్తూ కమర్షియల్ గా మంచి విజయాలు సాధిస్తూ వస్తోంది. అప్పుడప్పుడూ స్టార్ హీరోల సరసన ఆఫర్స్ వచ్చినా తన పాత్రలు బావుంటే ఓకే చెబుతోంది. అయితే నయనతార సోలోగా మూవీస్ లో ఇప్పటి వరకూ చేసినవి ఒకెత్తు.. ఇది ఒక్కటే ఒకెత్తు అనేలా ఉన్న మూవీ ‘రక్కయ్యే’. తాజాగా విడుదలైన ఈ మూవీ టీజర్ చూస్తే ఓ టాప్ హీరో సినిమా రేంజ్ లో కనిపిస్తోంది. టీజర్ తోనే వామ్మో అనిపించేలా చేసిందంటే అతిశయోక్తి కాదు. సెంథిల్ నల్లస్వామి డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి 96, సత్యం సుందరం ఫేమ్ గోవింద్ వసంత్ మ్యూజిక్ అందించాడు.
టీజర్ చూస్తే.. ఒక చిన్న ఇంటి ముందు పదుల సంఖ్యలో విలన్స్ ఉంటారు.. వాళ్లంతా ఆ ఇంటిలోని రక్కయ్యే అనే నయనతారను చంపడానికి వచ్చారని అర్థం అవుతుంది. ఇటు అదే ఇంట్లో ఉయ్యాలలో ఒక చిన్న పిల్లవాడు.. ఏడుస్తూ ఉంటాడు. మరోవైపు చీరకట్టులో ఉన్న నయనతార రోటిలో ఎండు మిరపకాయలు దంచుతూ ఉంటుంది. ఆపై పిల్లాడికి పాలు పట్టించి.. ఒక పెద్ద కర్రకు రెండు కత్తులు బిగించి కట్టి మరో చేతిలో కొడవలి పట్టుకుని ఆ దుండగులపై విరుచుకు పడుతుంది నయన్. ఆ ఫైట్ చూస్తే.. ఓ లోకేష్ కనకరాజ్, రాజమౌళి, బోయపాటి మూవీస్ లోని యాక్షన్ సీన్ లా అనిపిస్తుంది. బిగించిన చీరకట్టులో రౌద్రంగా కనిపిస్తోన్న నయన్ ను చూస్తే ఈ సారి రచ్చ మామూలుగా ఉండబోదు అనేలా ఉంది. మరి మూవీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కానీ.. తన బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com