Telugu Film Federation : డ్యామిట్.. చర్చలు ఫెయిల్ అయ్యాయి

Telugu Film Federation  :  డ్యామిట్.. చర్చలు ఫెయిల్ అయ్యాయి
X

సినిమా పరిశ్రమలో సమ్మె కారణంగా షూటింగ్స్ అన్నీ బంద్ అయిపోయాయి. ఫెడరేషన్ నుంచి 30 శాతం వేతనాలు పెంచాలనే డిమాండ్ తో సమ్మె మొదలైంది. అందుకు ఫిల్మ్ ఛాంబర్ సుముఖంగా లేదు. ఓ పది రోజుల నుంచి ఈ విషయంపై ఫెడరేషన్, ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మధ్య చర్చలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా నిర్మాతలంతా ఒకే రోజు రెండు తెలుగు రాష్ట్రాల సినిమాటోగ్రఫీ మంత్రులను కలిశారు. ఇటు ఫెడరేషన్ సభ్యులు కూడా తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ ను సినిమా హబ్ గా మార్చాలనుకుంటున్నాం అని.. అందుకే ఇలాంటి సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని మంత్రి కార్మికులకు సూచించాడు. దీంతో ఇవాళ (బుధవారం) మరోసారి ఫిల్మ్ ఛాంబర్, నిర్మాతలు, ఫెడరేషన్ మధ్య మరోసారి చర్చలు జరిగాయి.

ఈ సందర్భంగా వాడివేడిగా చర్చలు కొనసాగాయి. ఫెడరేషన్ సభ్యుల ప్రతిపాదనలకు అంగీకరించలేదు నిర్మాతలు. అంతేకాదు.. ఓ మూడు యూనియన్ లకు పర్సెంటేజ్ ను పెంచలేం అని కూడా ఖరాకండీగా చెప్పారు. దీంతో తాము సమ్మెను కొనసాగించడానికి సిద్ధమే అని తేల్చి చెప్పారు ఫెడరేషన్ సభ్యులు. ఎప్పటికైనా కలిసి పనిచేయాలి కాబట్టి ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవలని తెలంగాణ ఎఫ్.డి.సి దిల్ రాజు సూచించినా ఫలితం లేకపోయింది. ముందు వేతనాలు పెంచితే ఆ తర్వాత దశల వారీగా నిర్మాతల ప్రతిపాదనలను అంగీకరిస్తాం అని ఫెడరేషన్ నాయకులు తేల్చి చెప్పారు. దీంతో టాలీవుడ్ లో ఓ నిరాశపూరితమైన వాతావరణం నెలకొంది. చూస్తుంటే సమ్మె కొనసాగేలానే ఉందని చెప్పొచ్చు. మరి దీనికి ఎక్కడ ఎప్పుడు ఎవరి ద్వారా ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి.

Tags

Next Story