Raghu Kunche : భళా రఘు కుంచె భళా

సింగర్ పరిచయమై మ్యూజిక్ డైరెక్టర్ గా మెప్పించి ప్రస్తుతం నటుడుగానూ సత్తా చాటుతున్నాడు రఘు కుంచె. మల్టీ టాలెంటెడ్ అనిపించుకున్న రఘు నటుడుగా ప్రస్తుతం ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నాడు. పలాస నుంచి యాక్టర్ గా మారిన రఘు అవకాశం వచ్చినప్పుడల్లా సంగీత దర్శకుడుగానూ ఆకట్టుకుంటున్నాడు. అయితే తను మ్యూజిక్ చేస్తోన్న సినిమాల్లో కొన్నాళ్ల నుంచి రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. ముఖ్యంగా గ్రామీణ కళాకారులకు అవకాశాలిస్తున్నాడు. వారి గుర్తింపును రెట్టింపు చేస్తున్నాడు.
కొన్నాళ్ల క్రితం అసిరయ్య అనే ఉత్తరాంధ్ర సింగర్ తో పాటల పాడించాడు. అంతకు ముందే పలాస సినిమాలో రాజు అనే అంధుడైన గాయకుడుతో టైటిల్ సాంగ్ ను పాడించాడు. ఆ తర్వాత ఆ కుర్రాడికి ఎన్నో అవకాశాలు వచ్చాయి. ఇలాంటివి చూసినప్పుడు రఘు కుంచెను చాలామంది అభినందించారు. దాంతో పాటు అవకాశాలు కూడా ఇస్తే.. మరింతమంది గాయనీ గాయకులకు అవకాశాలిచ్చేందుకు ఆస్కారం ఉంటుంది. అలా వచ్చిన మరో అవకాశంతో మరో కొత్త గాయనికి ఛాన్స్ ఇచ్చాడు రఘు కుంచె.
పౌరాణిక పద్యాలతో ఎన్నో వందల నాటకాల్లో అద్భుతమైన పద్యాలు, రాగాలతో అబ్బురపరిచిన మంగాదేవి అనే గాయనికి తన కొత్త సినిమా 'గెదెల రాజు' కాకినాడ తాలూకా అనే సినిమాలో అవకాశం ఇచ్చాడు. ఆమెతో పద్యంతో కూడిన పాటను పాడించాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎన్ని చేసినా.. మన మూలాలు మర్చిపోకుండా ఆ మూలాలను కాపాడుతున్న కళాకారులతో సినిమా పాటలు పాడించడం అనే ట్రెండ్ కొత్తదేం కాకపోయినా రఘు కుంచె చేస్తోన్న ప్రయత్నాలు మాత్రం కొత్తగానే ఉన్నాయి. అందుకే భళా రఘు కుంచె భళా అంటున్నారు నెటిజన్స్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com