Chaitanya Rao : చైతన్య రావు.. షరతులు వర్తిస్తాయి నుంచి మయ సభ వరకు

సినిమా చాలా చిత్రమైనది. ఎవరిని ఎప్పుడు ఎలా హైలెట్ చేస్తుందో ఎవరూ ఊహించలేదు. ఈ రంగుల ప్రపంచంలో ఎవరు ఎప్పుడు బ్రైట్ గా వెలిగిపోతారో వాళ్లు కూడా ఊహించలేరు. 30 వెడ్స్ 21 అనే యూ ట్యూబ్ సిరీస్ తో ఓవర్ నైట్ ఫేమ్ అయ్యాడు చైతన్య రావు. ఆ ఫేమ్ తో కొన్ని సినిమాల్లో చిన్న పాత్రలూ చేశాడు. మరికొన్నిటిలో ప్రధాన పాత్రల్లోనూ కనిపించాడు. అవేవీ అతనికి పెద్దగా గుర్తింపు తేలేదు. తర్వాత కొత్త దర్శకుడు కుమారస్వామి రూపొందించిన ‘షరతులు వర్తిస్తాయి’మూవీ మంచి గుర్తింపు తెచ్చింది. ఇందులో చిరంజీవి అనే పాత్రలో బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ మూవీ కీడా కోలా మరింత మందికి అతన్ని చేరువ చేసింది.
ప్రస్తుతం మయసభ అనే సిరీస్ తో మరోసారి టాప్ రేంజ్ వార్తల్లో కనిపిస్తున్నాడు చైతన్య రావు. ఈ సిరీస్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పోలిన పాత్రలో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. సిరీస్ స్ట్రీమ్ అయ్యి చాలా రోజులు అవుతున్నా.. ఇంకా టాప్ డిస్కషన్స్ లోనే ఉంది సిరీస్. మరో ముఖ్యపాత్రలో చేసిన ఆది పినిశెట్టి నటన గురించి అందరికీ తెలుసు. చైతన్య రావు పాత్ర, నటన అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. విశేషం ఏంటంటే.. ఇతను షరతులు వర్తిస్తాయి అనే సినిమా చేస్తున్న టైమ్ లోనే మయసభ ఆఫర్ వచ్చింది. అతని కటౌట్ చూస్తే హీరోగా రాణిస్తాడా అనుకున్న వారికి సమాధానం షరతులు వర్తాయి అనే మూవీ చెబితే.. ఆ మూవీ టైమ్ లోనే వచ్చిన మయసభతో పాటు మరికొన్ని ఆఫర్స్ కూడా అతన్ని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
ఇక త్వరలోనే క్రిష్ డైరెక్షన్ లో రూపొందిన ఘాటీ అనే సినిమాతో రాబోతున్నాడు. చూడగానే చాలా సాఫ్ట్ గా కనిపించే అతను ఈ మూవీలో క్రూరమైన విలన్ గా కనిపించబోతుండటం విశేషం. నటుడుగా తనను తాను ఎక్స్ ప్లోర్ చేసుకుంటేనే ఇండస్ట్రీలో కొన్నాళ్ల పాటు నిలబడతారు. కాదూ కేవలం హీరోగానే అని గిరి గీసుకుంటే ఆగిపోవడం ఖాయం. ఆ విషయం తను హీరోగా చేసిన సినిమాల రిజల్ట్స్ చూసిన తర్వాత చైతన్య రావుకు అర్థం అయినట్టుంది. అందుకే హీరోగా కాక ‘నటుడు’గా రాణించడం అనే దిశగా వెళుతున్నాడా అనిపిస్తోంది. అతనికి మంచి కటౌట్ ఉంది. వాయిస్ లోనూ బేస్ ఉంటుంది. సో.. ఎలాంటి పాత్రలో అయినా మెప్పించే సత్తా ఉన్న నటుడుగా ప్రూవ్ చేసుకుంటే తెలుగులోనే కాదు.. ఇతర భాషల నుంచీ ఆఫర్స్ అందుకుంటాడు. ఏదేమైనా మయసభతో చైతన్య రావు.. అందరినీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇంతకు మించి ఘాటీతో సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాడు. మరి అతని రేంజ్ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com