NTR : 25 యేట అడుగుపెట్టిన హీరో ఎన్టీఆర్

NTR  :  25 యేట అడుగుపెట్టిన హీరో ఎన్టీఆర్
X

నూనూగు మీసాలు కూడా రాని టైమ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంతకు ముందే బాల నటుడుగా బ్రహ్మర్షి విశ్వామిత్రలో కనిపించాడు. ఆపై బాల రామాయణంలో రాముడుగా అద్భుతం అనిపించుకున్నాడు. హీరోగా తొలి సినిమా నిన్ను చూడాలని. 23 మే 2001లో విడుదలైందీ చిత్రం. సో.. హీరోగా ఇది ఎన్టీఆర్ కు 25వ యేడాది అన్నమాట. అయితే ఎన్టీఆర్ లాంటి మహా నటుడి మనవడు మొదటి చిత్రంతో హీరోగా మంచి మార్కులు తెచ్చుకోలేదు. ఆపై స్టూడెంట్ నెంబర్ 1. రాజమౌళి డైరెక్టర్ గా పరిచయం అయిన ఈ మూవీతో తనేంటో నిరూపించుకున్నాడు. సినిమా బ్లాక్ బస్టర్. విశేషం ఏంటంటే.. నిన్ను చూడాలని, స్టూడెంట్ నెంబర్ వన్ 1 తో పాటు అదే యేడాది సుబ్బు అనే సినిమా కూడా విడుదలైంది. ఫస్ట్ మూవీ మే నెలలో విడుదలైతే.. రెండోది సెప్టెంబర్, మూడోది డిసెంబర్ లో వచ్చింది. అలా అరంగేట్రంలోనే హ్యాట్రిక్ మూవీస్ తో అదరగొట్టాడు ఎన్టీఆర్.

ఆది మూవీతో ఇండస్ట్రీకి ముచ్చెమటలు పట్టించాడు. ఆ వయసులో తన నటనతో చాలామందికి కునుకు లేకుండా చేశాడు. తర్వాత రెండు ఫ్లాపులు. ఆపై ఇండస్ట్రీ హిట్.. సింహాద్రి. సింహాద్రిలో ఎన్టీఆర్ నటన చూసి కాబోయే టాలీవుడ్ టాప్ స్టార్ అతనే అని ప్రతి ఒక్కరూ భాష్యం చెప్పుకున్నారు. ఆ స్థాయి నటన, విజయం సాధించాడు. ఈ చిత్రంతో దర్శకుడు రాజమౌళి సైతం తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అలా మొదలైన ఎన్టీఆర్ ప్రస్థానం ఒక బ్లాక్ బస్టర్ పడితే రెండు మూడు యావరేజ్ లు, ఒక ఫ్లాప్ అన్నట్టుగా సాగింది. ఓ దశలో మరీ మొనాటనీ అనిపించాడు. రొడ్డ కొట్టుడు మూవీస్ తో అభిమానులను కూడా ఇబ్బంది పెట్టాడు. మరోవైపు తన జెనరేషన్ హీరోలు అప్పటికే పాగా వేశారు. హిట్స్ కొడుతున్నారు. అప్పుడు తనూ మారాలనుకున్నాడు మారాడు. అప్పటి వరకూ చూపించిన టెంపర్ కు భిన్నంగా ‘టెంపర్’నే మూవీగా చేశాడు.

టెంపర్ లో ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ అప్పటి వరకూ చేసిన సినిమాలకు పూర్తి భిన్నం. అగ్రెసివ్ గా కనిపించే నెగెటివ్ షేడ్ ఉన్న పోలీస్ పాత్ర. ఫస్ట్ హాఫ్ ఆడియన్స్ కు నచ్చలేదు. సెకండ్ పార్ట్ సగం నుంచి అలా ఎందుకు చేశాడు అనే దానికి వివరణ కొనసాగుతూ.. ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకూ కట్టి పడేసే నటనతో అదరగొట్టాడు. సినిమా సూపర్ హిట్.

టెంపర్ తర్వాత వరుసగా నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ఆర్ఆర్ఆర్, దేవర 1.. ఇలా అన్నీ ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ గా బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. టాలీవుడ్ టాప్ ఫైవ్ హీరోస్ లో ఎన్టీఆర్ పేరును పర్మనెంట్ చేశాయి. ఇక ఇప్పుడు వార్ 2తో బాలీవుడ్ డెబ్యూ ఇచ్చాడు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్, ఆపై దేవర 2, నెల్సన్ మూవీస్ తో స్ట్రాంగ్ లైనప్ తో ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ కు ముందు ఎన్టీఆర్ వేరు.. ఆ తరవాత ఎన్టీఆర్ వేరు అనేలా కనిపిస్తోందీ లైనప్. మరి ఈ లైనప్ ఇలాగే కొనసాగాలని.. ఈ పాతికేళ్లే కాదు మరో పాతికేళ్ల వరకూ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా అన్ని క్లాస్ ఆడియన్స్ ను అలరించాలని కోరుకుందాం.

Tags

Next Story