NTR: ఓ బడా డైరెక్టర్‌తో ఎన్‌టీఆర్ బాలీవుడ్ డెబ్యూ..?

NTR: 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎన్‌టీఆర్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా చిత్రం. మొదటి పాన్ ఇండియా సినిమాతోనే విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నాడు ఎన్‌టీఆర్. ఇప్పటికీ ఆర్ఆర్ఆర్ సినిమా చాలా రాష్ట్రాలలో హౌస్‌ఫుల్ షోస్‌తో నడుస్తోంది. అంతే కాకుండా హిందీలో అయితే ఆర్ఆర్ఆర్ క్రేజ్ మామూలుగా లేదు. దీంతో త్వరలోనే ఎన్‌టీఆర్ బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తోంది.
ఒకప్పటిలాగా స్టార్ హీరోలు కేవలం ఒకే భాషలో సినిమాలు చేయాలన్న ఆలోచనతో ఉండిపోవట్లేదు. ఏ భాషలో అయినా తమ టాలెంట్‌ను నిరూపించుకుంటూ.. ప్రేక్షకులను మెప్పించాలి అనుకుంటున్నారు. అందుకే యంగ్ హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు చాలామంది బాలీవుడ్‌లో డెబ్యూ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఆర్ఆర్ఆర్‌తో క్రేజ్ సంపాదించుకున్న తర్వాత ఎన్‌టీఆర్ కూడా బాలీవుడ్‌లో డెబ్యూ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది.
ఎన్‌టీఆర్‌తో పాటు ఆర్ఆర్ఆర్‌లో హీరోగా కనిపించిన రామ్ చరణ్.. ఇప్పటికే 'జంజీర్' అనే సినిమాతో బాలీవుడ్‌లో డెబ్యూ ఇచ్చేశాడు. ఎన్‌టీఆర్ నటించిన పలు సినిమాలు కూడా హిందీలో డబ్ అయ్యి పాజిటివ్ టాక్‌ను తెచ్చుకున్నాయి. అయితే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ జరుగుతున్న సమయంలో ఎన్‌టీఆర్‌కు ఏ బాలీవుడ్ డైరెక్టర్ అంటే ఎక్కువ ఇష్టం అని అడగగా.. తాను సంజయ్ లీలా భన్సాలీ, రాజ్‌కుమార్ హిరానీ పేర్లు చెప్పాడు. అయితే ఆర్ఆర్ఆర్‌తో ఎన్‌టీఆర్ బాలీవుడ్‌లో కూడా పాపులర్ అయ్యాడు కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరో ఒక దర్శకుడు ఎన్‌టీఆర్‌తో సినిమా తీసే ఛాన్స్ ఉన్నట్టు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com