Rajinikanth : ఒన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్.. రజినీకాంత్ బర్త్ డే స్పెషల్

సూపర్ స్టార్ రజినీకాంత్.. ఈ పేరు పలుకుతున్నప్పుడు ఓ రకమైన వైబ్రేషన్ ఉంటుంది. నిజమే.. అందుకు కారణం అతని స్టైల్. ఆ స్టైల్ ఆర్ఆర్ తో ఎలివేట్ అయినా.. చూసే చూపుల నుంచి నడక వరకూ అందులో ఏదో తెలియని మాగ్నటిక్ పవర్ ఉంటుంది. లేకపోతే హీరో అనేందుకు ఆ రోజుల్లో కావాల్సిన ఏ క్వాలిఫికేషన్ లేని ఓ సాధారణ బస్ కండక్టర్ సూపర్ స్టార్ అవుతాడా..? అవడమే కాదు.. తనను తాను ప్రూవ్ చేసుకుని కోట్లాదిమందికి ఇన్సిస్పిరేషన్ గా నిలిచిన ఒన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే ఇవాళ.
అందగాడు కాదు.. బ్యాక్ గ్రౌండ్ లేదు. నటుడుగా అనుభవమూ లేదు. ఇన్ని నెగెటివ్ క్వాలిఫికేషన్స్ ఉన్నా యాక్టర్ కావాలనుకున్నాడంటే అతనిలో ఎంత ఆత్మవిశ్వాసం ఉండాలి... ఎంత నమ్మకం ఉండాలి.. అవును వాటిని ఆలంబనగా చేసుకునే అంతులేని పోరాటం చేశాడు. కాబట్టే.. అతని కథే అంతులేనిది అయింది.. ఆ కథే బస్ కండక్టర్ శివాజీరావ్ గైక్వాడ్ ను.. సూపర్ స్టార్ రజినీకాంత్ గా మార్చింది.
కలలు అందరూ కంటారు. వాటికోసం కొందరే పాటుపడతారు. అలా ప్రయత్నించడంలో కూడా వారిది విశిష్టమైన శైలి. ఆ శైలి నలుగురికి తెలియడమే ముఖ్యం. అదృష్టమో.. కష్టానికి తగ్గ ఫలమో కానీ.. శివాజీరావ్ గైక్వాడ్ తొలినాళ్లలో నటశిల్పి కె. బాలచందర్ కళ్లల్లో పడ్డాడు. పడ్డమే కాదు.. తన కళ్లల్లో ఉన్న ఫైర్ ఆయనకి తెలిసేలా చేశాడు. అదే రజినీకాంత్ జీవితంలో మొదటి మలుపు..
పుట్టింది మహరాష్ట్ర, పెరిగింది కర్ణాటక.. నటుడిగా ఎదిగి, విశ్వవ్యాపితమైంది తమిళనాడు నుంచి.. కళకు ఎల్లలు లేవు.. అనేందుకో నిదర్శనంలా నలిచాడు. అందుకే అతని సినిమా జీవితమే ఓ అంతులేని కథ. బాలచందర్ ప్రోత్సాహానికి స్వయం ప్రతిభను జోడించి.. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి.. ఇంక ఊరేలా సొంత ఇళ్లేలా అంటూ.. ఎల్లలు లేని అభిమానాన్ని సంపాదించాడు.
రజినీకాంత్ రాత్రికి రాత్రే సూపర్ స్టార్ కాలేదు. 1975లో నటుడుగా అరంగేట్రం.. కానీ సూపర్ స్టార్ గా మారడానికి దాదాపు దశాబ్ధంన్నర పట్టింది. అలాగని ఆయనేమీ సూపర్ స్టార్ కావాలనే కలలో ప్రయాణం చేయలేదు.. వచ్చిన ప్రతి అవకాశాన్నీ తనదైన శైలిలో వినియోగించుకున్నాడు. విలన్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సరే.. అందులో తొలి సినిమా నుంచే రజినీకాంత్ ఓ స్పెషల్ స్టాంప్ వేశాడు..
తొలినాళ్లలో తను గురువు బాలచందర్ అండదండలున్నాయి.. ఎంతో మంది నటులను తీర్చిదిద్దిన బాలచందర్ కు రజినీ స్ట్రెంత్ ఏంటో తెలుసు. అందుకే నెగెటివ్ క్యారెక్టర్స్ అయినా సరే.. అతన్ని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఇచ్చాడు. అలా వచ్చినవే తొలి సినిమా అపూర్వ రాగంగళ్, అంతులేని కథ, మూన్రుముడిచ్చు, అవర్ గళ్ వంటి సినిమాలు.. వీటిలో ఏ క్యారెక్టర్ అయినా సరే.. రజినీని కాకుండా వేరొకరిని ఊహించలేం..
రజినీకాంత్ స్టార్ గానే కాదు.. అసలు హీరోగా ఎదగడానికే చాలా టైమ్ పట్టింది. తొలిసారిగా అతను హీరోగా నటించింది చిలకమ్మ చెప్పింది అనే తెలుగు సినిమాలో. అలాగే అప్పటి స్టార్ హీరోల సినిమాల్లో సెకండ్ లీడ్ లో చేశాడు.. తెలుగులో కృష్ణ హీరోగా అన్నదమ్ముల సవాల్, ఇద్దరూ అసాధ్యులే, రామ్ రాబర్ట్ రహీమ్ వంటి సినిమాల్లో సెకండ్ లీడ్ లో చేశాడు. ఇలాగే కన్నడ, మళయాలంలోనూ నటించాడు.
ఏ పాత్ర చేసినా 70ల చివరి నుంచే తనదైన మేనరిజమ్స్ తో మెస్మరైజ్ చేయడం మొదలుపెట్టాడు రజినీకాంత్. ఈ మేనరిజమ్స్ వల్లే విలన్ క్యారెక్టర్స్ తో కూడా విజిల్స్ వేయించుకున్న ఫస్ట్ సౌత్ ఇండియన్ స్టార్ అయ్యాడు. హీరో ఎవరైనా.. విలన్ గా ఉన్న రజినీ స్టైల్స్ నే ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడేవారు. ఆ స్టైల్సే హీరోగా మారగానే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రావడానికి కారణం.
రజినీకాంత్ అనగానే స్టైల్స్ తో పాటు సింపిల్సిటీ కూడా కనిపిస్తుంది. ఇది ఆయనకు ముందు నుంచే ఉంది. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండటం.. ఏదో తెలుసుకోవాలనే తపనే ఆయన్ని అప్పటికే ఉన్న ఎందరో స్టార్ హీరోల నుంచి వేరు చేసింది. ఇక ఎనభైల్లో శివాజీ గణేశన్ సినిమాలకు విరామం ప్రకటించడం రజినీకి వరంగా మారింది. ఆయన పాత్రలన్నీ అంతే ఫైర్ తో ఉండే రజనీని వరించాయి. అవకాశాల్ని అందిపుచ్చుకుని వరుస హిట్స్ తో అదరగొడుతూ అలా టాప్ చైర్ కు వెళ్లిపోయాడు రజినీ..
రజినికాంత్ కు ఉన్న ఫేస్ వాల్యూతో స్టార్డమ్ రావడం అసాధ్యం.. కానీ ఆత్మవిశ్వాసం, డిసిప్లిన్ తో సాధించాడు.. ఎన్ని విజయాలు వచ్చినా ఇప్పటికీ నేలమీదే నించోవడం రజినీని మాస్ తో పాటు క్లాస్ కూ దగ్గర చేసింది. ఇది ఏ అప్ కమింగ్ హీరో అయినా నేర్చుకోవాల్సిన బెస్ట్ క్వాలిటీ.. ఆ విషయంలో రజినీ తర్వాతే ఇంకెవరైనా..
దళపతి, మన్నన్, అన్నామలై, మాప్పిళ్లై, పాండ్యన్, వీరా వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాతే రజినీ రేంజ్ మారిందంటే అతిశయోక్తి కాదు. అంటే నటుడిగా అరంగేట్రం చేసిన దశాబ్ధంన్నర తర్వాతే ఆయన సూపర్ స్టార్ రేంజ్ వైపు సాగిపోయాడు.. ఇక తొంభైల తర్వాత రజినీ చేసిన ప్రతి సినిమా హిట్ అన్నంతగా బాక్సాఫీస్ తో ఓ ఆటాడేసుకున్నాడు.
బాషా.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో సెన్షేషన్.. అండర్ వరల్డ్ మాఫియా స్టోరీకి.. రజినీ పవర్ ఫుల్ మేనరిజమ్స్ తో పాటు అద్భుతమైన నటనకు అంతా ఫిదా అయిపోయారు. బాషా ఇన్సిస్పిరేషన్ గా దేశవ్యాప్తంగా ఇప్పటికి ఎన్ని సినిమాలు వచ్చాయో లెక్కేలేదు. ఇదీ బాషా బాక్సాఫీస్ కు చూపించిన కెపాసిటీ. బాషా తర్వాతే రజినీకాంత్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయాడు..
ఇండియాలోనే కాదు.. ఏ కంట్రీలోనూ రజినీకాంత్ వంటి సూపర్ స్టార్ ను చూడలేం. ఎంతో సాధించినా.. ఏమీ సాధించని వ్యక్తిలా కనిపించడం మామూలు విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నా.. ఖాళీ సమయాల్లో పాత స్నేహితులతో కలిసి హిమాలయాలకో లేక మరో ట్రిప్ కో వెళుతూ.. అత్యంత సాధారణ జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు.
రజినీకాంత్ వయసైపోయింది.. కొన్నాళ్లుగా వినిపిస్తోన్న మాట. కానీ ఆ మాట బాక్సాఫీస్ ను అడగాలి. ఏడుపదుల వయసుకు అతి దగ్గరగా ఉన్నాడు రజినీకాంత్. అయితేనేం ఇంకా ముప్ఫైయేళ్ల కుర్రాడిలా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు. కబాలి తర్వాత కాలా నిరుత్సాహపరిచినా.. పేటాతో మళ్లీ తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
ప్రస్తుతం రజినీకాంత్ కుర్రహీరోలం కంటే దూకుడు చూపుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. సినిమా రంగలో ఒక్కోతరాన్ని ఒక్కొక్కరు ప్రభావితం చేస్తారు... కానీ రజినీకాంత్ ఎదిగిన విధానం ఎన్ని తరాలకైనా ఆదర్శమే. ఏమీ లేని వాడుగా వచ్చి.. ఎంతో సాధించిన రజినీ జర్నీ.. ఏ రంగంలో ఉన్నవారికైనా ఆదర్శనీయమే. వెండితెరపై రారాజుగా నిలిచినా.. ఆయన మేకప్ లో ఉన్నంతసేపు మాత్రమే నటిస్తాడు. ఆ తర్వాత రజినీకాంత్ ఓ సాధారణ మనిషిలానే ఉంటాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com