Oscar 2023 : భారతీయులు గర్విస్తున్న క్షణాలివి : పవన్ కళ్యాణ్

• ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర బృందానికి హృదయపూర్వక అభినందనలు
ఆర్ఆర్ఆర్ సినిమాకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు దక్కడంతో అభినందనలు తెలియజేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. "భారతీయులందరూ గర్వపడేలా ఆస్కార్ వేదికపై పురస్కారాన్ని స్వీకరించిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్ర సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి గారికి, గీత రచయిత శ్రీ చంద్రబోస్ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ వార్తను చూడగానే ఎంతో సంతోషించాను. ఆస్కార్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంలో ‘నాటు నాటు...’ గీతంలోని తెలుగు పదం నేల నలుచెరగులా ప్రతి ఒక్కరితో పదం కలిపేలా చేసి హుషారెత్తించింది. ఆ హుషారు ఈ రోజు ఆస్కార్ వేదిక మీద రెట్టించిన ఉత్సాహంతో కనిపించింది. ఈ వేదికపై ఈ గీతాన్ని ప్రదర్శించడంతోపాటు... అవార్డు పొందటం ద్వారా భారతీయ సినిమా స్థాయి మరో స్థాయికి చేరింది.
ఇంతటి ఘనత పొందేలా ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రాన్ని రూపొందించిన దర్శకులు ఎస్.ఎస్.రాజమౌళి గారికి ప్రత్యేక అభినందనలు. ఆ చిత్రంలో కథానాయక పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్.టి.ఆర్., రాంచరణ్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, నృత్య దర్శకులు ప్రేమ్ రక్షిత్, చిత్ర నిర్మాత డి.వి.వి.దానయ్యలకు అభినందనలు. ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రానికి దక్కిన ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుతోపాటు పలు అంతర్జాతీయ పురస్కారాలు భారతీయ దర్శకులు, నటులు, రచయితలకు స్ఫూర్తినిస్తుంది." అని ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com